న్యూఢిల్లీ: నియంత్రిత దేశాల్లో ఎగుమతులకు ఎదురవుతున్న సవాళ్లు, దేశీయంగా ఫార్ములేషన్స్ వ్యాపారంలో అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 7-9 శాతం స్థాయిలోనే వృద్ధి నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, ముడి సరుకులు.. రవాణా చార్జీల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా ఉండగలవని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నిర్వహణ లాభాలు 130 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) క్షీణించగా ఈసారి మరో 200-250 బీపీఎస్ మేర తగ్గొచ్చని క్రిసిల్ వివరించింది. ఆదాయంపరంగా ఫార్మా పరిశ్రమలో 55 శాతం వరకూ వాటా ఉండే 184 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం మేరకు క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది.
రిపోర్టు ప్రకారం దేశీయంగా ఫార్ములేషన్స్ మార్కెట్ ఆదాయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా నమోదైంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నిర్దిష్ట ఔషధాల రేట్లను సగటున 6–8 శాతం పెంచుకునేందుకు అనుమతించడం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్-19పరమైన ఔషధాలు, విటమిన్లకు డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, జీవనశైలి ఆధారిత తీవ్ర రుగ్మతలకు సంబంధించిన (డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ) ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే డిమాండ్‌కు చోదకంగా నిలవగలవని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ దానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment