Pharma Industry
-
ఫార్మాసిటీలో విష వాయువు లీక్
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని రక్షిత్ డ్రగ్స్ ఫార్మా పరిశ్రమలో సోమవారం ఉదయం జరిగిన విష వాయువుల లీకేజీ ప్రమాదంలో ఇద్దరు కాంట్రాక్టు కార్మీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు కోలుకోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పరవాడ సీఐ మల్లికార్జునరావు చెప్పారు. పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో రియాక్టర్లో పైకా బెండా జోన్ డ్రగ్ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులైన్ నుంచి హైడ్రోజన్ సల్ఫేడ్ అనే విష వాయువు లీకైంది. తెల్లవారు జామున విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒడిశాకు చెందిన దేవ్ బాగ్, ఉగ్రేష్ గౌడ్లు విష వాయువును పీల్చడంతో అస్వస్థతకు లోనయ్యారు. ఇతర కార్మికులు యాజమాన్యానికి సమాచారం అందించి, వెంటనే అంబులెన్స్‌లో గాజువాకలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు కొలుకోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పరవాడ తహసీల్దార్ అంబేడ్కర్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. -
ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా ఫార్మా పరిశ్రమలు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లతో పాటు అలారం వ్యవస్థను తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ అభిప్రాయపడుతోంది. సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ మొత్తం పెట్రోల్ బంకుల తరహాలో ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలని కూడా స్పష్టంచేస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల పాటు విశాఖ అచ్యుతాపురం సెజ్, రాంకీ ఫార్మాలోని వివిధ యూనిట్లను పరిశీలించడంతో పాటు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సెజ్లల్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీలో భద్రతాపరమైన లోటుపాట్లు స్పష్టంగా ఉన్నట్లు ఈ ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. మొత్తం ఏడు విభాగాలకు సంబంధించిన అంశాలతోనూ, ఫార్మా కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. 39 మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే. రెండ్రోజుల వ్యవధిలోనే పరవాడ సినర్జీస్ కంపెనీలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయి? ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనలు ఎలా కఠినతరం చెయ్యాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా ఆధ్వర్యంలో హైలెవల్ కమిటి జిల్లాలోని సెజ్‌లలో పర్యటించింది. ప్రమాదం జరిగిన కంపెనీలతో పాటు సెజ్లని పరిశీలించింది. అనంతరం.. ఆయా విభాగాల అధికారులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు కోణాల్లో హైలెవల్ కమిటీ నివేదిక సిద్ధంచేసింది. ఒకటి.. జరిగిన ప్రమాదానికి గల కారణాలు, రెండు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మూడు.. పరిశ్రమలు అవలంబించాల్సిన అత్యాధునిక విధానాల్ని సూచిస్తూ సమగ్ర నివేదిక సిద్ధంచేసింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ౖఫైర్, డ్రగ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఏపీపీసీబీ, బాయిలర్స్ విభాగాల నుంచి సలహాలతో నివేదికని తయారుచేశారు.నివేదికలో ముఖ్యమైన అంశాలు» ప్రతి ఫార్మా పరిశ్రమ.. అడ్వాన్స్డ్ విధానాలు అవలంబించాలని హైలెవల్ కమిటీ సూచనలు చేసింది. అవి.. రియాక్టర్లు వినియోగించే ఫార్మా కంపెనీలు కచ్చితంగా రివర్స్ చార్జింగ్ మెకానిజమ్ని ఏర్పాటుచేసుకోవాలి. దీనివల్ల పొరపాటున మండే స్వభావం ఉన్న రసాయనాలు లీకైతే ఘన పదార్థాలు రియాక్టర్‌లోని మ్యాన్‌హోల్ ద్వారా పంపించి.. ఘన పదార్థంగా మార్చే అవకాశం ఉంటుంది.» నిర్ధిష్ట రసాయనాల్ని అవసరమైన పరిమాణాల్లోనే నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలి. సాల్వెంట్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసేందుకు కచ్చితంగా ఎర్త్ రైట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఫార్మా కంపెనీలో ఉన్న క్లోజ్డ్ రూమ్‌లలో ఫిక్స్డ్ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటుచేయాలి.» ఫార్మా కంపెనీల్లో అన్ని ఎలక్ట్రికల్ ప్యానెల్లు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు దూరంగానే అమర్చుకోవాలి. ప్యానెల్ ప్రాంతానికి సమీపంలో సాల్వెంట్స్ నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి.» సిబ్బంది వివరాలు ప్యానెల్ ప్రాంతానికి సమీపంలోనే ప్రదర్శించాలి. అక్కడ స్మోక్, హీట్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలి.» ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏరియాల్లో ఆటోమేటిక్ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. -
మ్యాన్‌కైండ్ ఫార్మా: అతిపెద్ద ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 4 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా రూ. 5,500 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. (Akasa Air: వారానికి 250కి పైగా ప్లయిట్స్) కంపెనీ వివిధ విభాగాలలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్‌లను చేపడుతోంది. కన్జూమర్ హెల్త్‌కేర్ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. ప్రమోటర్లు రమేష్, రాజీవ్ జునేజాతోపాటు షీతల్ అరోరా కోటి షేర్లకుపైగా షేర్లను విక్రయించనుండగా.. ఇన్వెస్టర్ సంస్థ కెయిర్న్‌హిల్ సీఐపీఈఎఫ్ 1.74 కోట్ల షేర్లు, కెయిర్న్‌హిల్ సీజీపీఈ దాదాపు కోటి షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఇదీ చదవండి: లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో మెక్‌లాయిడ్స్ ఫార్మా రూ. 5,000 కోట్ల సమీకరణకు ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అయితే కంపెనీ విలువ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హెల్త్‌కేర్ విభాగం(2020 నవంబర్)లో గ్లాండ్ ఫార్మా రూ. 6,480 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
ఫార్మా పరిశ్రమ గ్రోత్ అంతంత మాత్రమే: క్రిసిల్
న్యూఢిల్లీ: నియంత్రిత దేశాల్లో ఎగుమతులకు ఎదురవుతున్న సవాళ్లు, దేశీయంగా ఫార్ములేషన్స్ వ్యాపారంలో అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 7-9 శాతం స్థాయిలోనే వృద్ధి నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, ముడి సరుకులు.. రవాణా చార్జీల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా ఉండగలవని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నిర్వహణ లాభాలు 130 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) క్షీణించగా ఈసారి మరో 200-250 బీపీఎస్ మేర తగ్గొచ్చని క్రిసిల్ వివరించింది. ఆదాయంపరంగా ఫార్మా పరిశ్రమలో 55 శాతం వరకూ వాటా ఉండే 184 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం మేరకు క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. రిపోర్టు ప్రకారం దేశీయంగా ఫార్ములేషన్స్ మార్కెట్ ఆదాయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా నమోదైంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్దిష్ట ఔషధాల రేట్లను సగటున 6–8 శాతం పెంచుకునేందుకు అనుమతించడం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్-19పరమైన ఔషధాలు, విటమిన్లకు డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, జీవనశైలి ఆధారిత తీవ్ర రుగ్మతలకు సంబంధించిన (డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ) ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే డిమాండ్‌కు చోదకంగా నిలవగలవని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ దానీ తెలిపారు. -
అమెరికాలో ఒత్తిళ్లు.. దేశీ ఫార్మాకు ధరల కష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి దేశీ ఫార్మా సంస్థలకు వచ్చే ఆదాయం ఒక మోస్తరుగానే వృద్ధి చెందనుంది. అక్కడి మార్కెట్లో ఔషధాల ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొనడమే ఇందుకు కారణం కానుంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలు ప్రకటించింది. తాము పరిశీలించిన ఎనిమిది దిగ్గజ ఫార్మా కంపెనీలకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చే ఆదాయాలు 0.2 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ఉత్పత్తుల ధరలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి–కనిష్ట టీన్స్ (రెండంకెల) స్థాయిలో పడిపోవడం ఇందుకు కారణమని వివరించింది. గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో రేట్ల పతనం కొనసాగడం వల్ల సమీప భవిష్యత్తులోనూ ఆదాయాలపై ఒత్తిడి నెలకొనవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి భారతీయ ఫార్మా కంపెనీలకు వచ్చే ఆదాయాలు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. ఇతర వ్యయాల భారం.. ముడి వస్తువుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా వ్యయాలు భారీగా పెరగడం .. సరఫరాపరమైన అవాంతరాలు మొదలైన అంశాల కారణంగా మార్జిన్లపై పడే ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాలకు అనుమతుల ప్రక్రియ వేగం మందగించిందని, 2022 ఆర్థిక సంవత్సరంలో ధరలపరమైన ఒత్తిళ్లు ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపాయని వివరించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ మళ్లీ ప్లాంట్ల తనిఖీలను మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో భారతీయ ఫార్మా కంపెనీలు చెప్పుకోతగ్గ స్థాయిలో చెల్లించి, లిటిగేషన్లను సెటిల్ చేసుకుంటూ ఉండటం కూడా వాటి ఆదాయాలపై ప్రభావం చూపుతోందని ఇక్రా వివరించింది. ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మొదలైనవి తరచుగా నిఘా పెట్టే రిస్కులు భారత ఫార్మా కంపెనీలకు ఉన్నట్లు పేర్కొంది. -
Kurnool: ఇండస్ట్రియల్ హబ్‌గా కర్నూలు
దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు ‘న్యాయ రాజధాని’ని ప్రకటించి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సేకరించిన భూములు, దరఖాస్తు చేసుకున్న కంపెనీలు, రిజిస్ట్రేషన్లు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే ‘కర్నూలు’ పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందనేది స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జిల్లాలో ప్రభుత్వం ఆరు ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు, ఆదోని, డోన్‌తో పాటు నంద్యాలలో రెండు పార్కులు ఉన్నాయి. కర్నూలు పరిధిలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఓహెచ్ఎం) కోసం 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో 8,300 ఎకరాలు పట్టా, తక్కినవి డీకేటీ భూములు. హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ‘ఓహెచ్ఎం’ను నోడ్ పాయింట్’గా కేంద్రం ప్రభుత్వం 2020 ఆగస్టులో నోటిఫై చేసింది. ఇందులో ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్‌కు తొలివిడతలో 413.19 ఎకరాలు కేటాయించింది. ఈ స్టీల్ ప్లాంటు పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ఫేజ్–2లో మరో 600 ఎకరాలు వీరికి ఏపీఐఐసీ కేటాయించనుంది. ఇందులో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తంగడంచలో జైన్ ఇరిగేషన్‌కు 623.40 ఎకరాలు కేటాయించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ పార్క్ ఇక్కడ ఏర్పాటవుతోంది. భూముల కోసం 21 కంపెనీలు దరఖాస్తు ఓహెచ్‌ఎంలోని గుట్టపాడు క్లస్టర్లో 4,900 ఎకరాలు ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో సిగాచీ ఇండస్ట్రీస్, ఆర్పీఎస్ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి – సుజుకి కూడా ఫార్మారంగంలో ప్రవేశించేందుకు భూముల కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంది. వీటితో పాటు మరో 5 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రైమో పాలీప్యాక్ (ప్లాస్టిక్ ఇండస్ట్రీ), బాక్లహ్యాక్, ఎక్సైల్ ఇమ్యూన్ లాజిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 13 బడా కంపెనీలు కూడా గుట్టపాడు క్లస్టర్లో నిర్మాణాలు మొదలుపెట్టబోతున్నాయి. ఓర్వకల్లు సమీపంలో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఇండస్ట్రీ నిర్మాణ పనులు ఫార్మారంగం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ గుట్టపాడు క్లస్టర్లో దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో ఫార్మాకంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ ఫార్మారంగానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలు. హైదరాబాద్ కంటే కర్నూలులో వాతావరణ పరిస్థితులు ఫార్మా అభివృద్ధికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో భూసమస్య ఎక్కువగా ఉండటం, అక్కడి కంటే ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉండటంతో తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీలు కర్నూలుపై దృష్టి సారిస్తున్నాయి. ఓర్వకల్లో ఎయిర్‌పోర్టు ఉండటం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు కర్నూలుకు వచ్చేందుకు ఎయిర్ కనెక్టివిటీ కూడా దోహదం చేస్తుంది. ‘రెడ్’కు ఈసీ క్లియరెన్స్ వస్తే.. ఫార్మా రంగంలో రెడ్, ఆరెంజ్ అని రెండు విభాగాలు దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ ఉంటుంది. ఆరెంజ్ కేటగిరికి ఈసీ (పర్యావరణ అనుమతి) క్లియరెన్స్ ఉంది. 4,200 ఎకరాలు ఆరెంజ్ కేటగిరీలో ఫార్మాకు భూములు కేటాయిస్తున్నారు. మరో 900 ఎకరాలు రెడ్ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఈసీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. దీనికి ఈసీ ‘గ్రీన్‌సిగ్నల్’ ఇస్తే ‘రెడ్’ విభాగంలో భారీగా ఫార్మా కంపెనీలు కర్నూలులో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీఆర్డీవోతో పాటు మరిన్ని సంస్థలు.. ఓహెచ్‌ఎంలో 250 ఎకరాల్లో డీఆర్డీవో ప్లాంటు నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇవి కాకుండా వంద ఎకరాల్లో ఎన్ఐసీ, మెడ్‌సిటీతో పాటు ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలు నిర్మిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, తంగడంచ, ఇటిక్యాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలకు భూములు కేటాయిస్తున్నారు. బ్రాహ్మణపల్లిలో 20 యూనిట్లు, ఇటిక్యాలలో 4 యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు 56 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు తొలివిడతలో రూ.560 కోట్లు కేటాయించారు. దీనికి ఈ నెల 16న టెండర్లు పిలిచారు. ఫేజ్–2లో మరో రూ.800 కోట్లు కేటాయించనున్నారు. ఇవి కాకుండా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మౌలిక వసతులు పూర్తయి, ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు నీరు చేరితే భారీ సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధికి 33 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 10,900 ఎకరాలు సేకరించాం. చాలా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. జయరాజ్, జైన్ ఇరిగేషన్ లాంటి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా ఫార్మారంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దరఖాస్తులు కూడా ఈరంగం నుంచే ఎక్కువగా వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో కర్నూలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. – వెంకట నారాయణమ్మ, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ, కర్నూలు -
ఫార్మా.. లోకల్ రూట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా ఫార్మా దిగుమతుల్లో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ వాటా 63 శాతముంది. ఇందులో 70 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్. ఏ ముడి పదార్థం తీసుకున్నా దీని కోసం ఖచ్చితంగా చైనాపై భారత్ ఆధారపడి ఉంది. ఈ స్థాయిలో ఒక దేశంపై ఆధారపడడం శ్రేయస్కరం కాదని భారత ఔషధ పరిశ్రమ ఎన్నాళ్లనుంచో చెబుతూ వస్తోంది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాలని విన్నవిస్తోంది. ఇదే జరిగితే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి ముడి పదార్థాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాలుగైదేళ్లలో సాధించవచ్చు.. ఫార్మా ముడి పదార్థాల విషయంలో భారత్ స్వావలంబన సాధ్యమేనని పరిశ్రమ చెబుతోంది. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వస్తే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తామని బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ఈడీ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఉన్నఫలంగా చైనా నుంచి ముడిపదార్థాల దిగుమతులను ఆపేయలేము. క్రమంగా దేశీయంగా వీటి తయారీని పెంచుకుంటూ పోవాలి. ఇక ఏపీఐ, ఇంటర్మీడియేట్స్ తయారీ ప్రక్రియలో ఉప పదార్థాలు వస్తాయి. ఇవి సద్వినియోగం అయితేనే తయారీదారుకు ప్రయోజనం. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత్‌లో ఉత్పత్తి వ్యయం చైనాతో పోలిస్తే 20–25 శాతం అధికంగా ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. టెక్నికల్ ఇన్నోవేషన్ పెద్ద ఎత్తున జరగాలి’ అని వెల్లడించారు. కాగా, రూ.3,000 కోట్లతో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి ఊతం ఇచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,940 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కొత్త మార్కెట్ల నుంచి... చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు కొన్ని రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ను యూఎస్, ఇటలీ, సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి దిగుమతి చేసుకునే విషయమై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చైనాతో తలెత్తిన వివాదం నేపథ్యమూ ఇతర దేశాలవైపు దృష్టిసారించేందుకు మరో కారణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. ఏ దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవచ్చో అన్న అంశంపై ఐపీఏ ఇప్పటికే ఓ అధ్యయనం చేపట్టిందని ఆయన చెప్పారు. కొత్త దేశాల నుంచి దిగుమతులు వెంటనే చేపట్టి, మధ్య, దీర్ఘకాలంలో దేశీయంగా సామర్థ్యం పెంచుకోవాలన్న సరైన విధానం భారత్ ఎంచుకుందని అన్నారు. సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో దేశీయంగా ఉన్న 1,500–1,600 ఏపీఐ యూనిట్లు బలోపేతం అవుతాయని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ అశోక్ మదన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫార్మా స్టాక్స్‌లో మరింత అప్‌సైడ్
ఎన్ఎస్ఈ నిఫ్టీకి శుక్రవారం(17)తో ముగిసిన వారంలో 10,800-10,900 స్థాయిలో పలుమార్లు అవరోధాలు ఎదురయ్యాయని శామ్కో గ్రూప్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో వచ్చే వారం 10,950 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్కెట్లు బలహీనపడితే.. 10,550 స్థాయిలో సపోర్ట్ లభించే వీలున్నదని చెప్పారు. ఈ స్థాయికంటే దిగువకు చేరితే 9,900 పాయింట్లను నిఫ్టీ తిరిగి పరీక్షించవచ్చని అంచనా వేశారు. ఫార్మా రంగంలో రెండు కౌంటర్లకు బయ్ రేటింగ్‌ను ఇవ్వగా.. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌ను విక్రయించవచ్చునంటూ సూచించారు. మార్కెట్ల తీరు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు చూద్దాం.. అటూఇటుగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్లపై ఆశలు, ఆర్ఐఎల్ ఏజీఎం, ఇన్ఫోసిస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాల ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. కోవిడ్ సవాళ్లలోనూ ఐటీ దిగ్గజాలు ఉత్తమ పనితీరు ప్రదర్శించాయి. ట్రావెల్, ఎస్జీఏ వ్యయాలు తగ్గడం, ఫారెక్స్ లాభాలు వంటి అంశాలు మార్జిన్లకు బలమిచ్చాయి. అయితే ఇటీవల ఐటీ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ కారణంగా ఈ రంగంలో పెట్టుబడులకు 10-12 శాతం కరెక్షన్ కోసం వేచిచూడటం మేలు. ఇక ఫార్మా స్టాక్స్‌లో స్వల్పకాలిక చలన సగటు ప్రాతిపదికన పుల్‌బ్యాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ రంగంలో సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది. ఫార్మా రంగంలో కొన్ని కౌంటర్లు తదుపరి దశ ర్యాలీకి సిద్ధంగా ఉన్న సంకేతాలు లభిస్తున్నాయి. లుపిన్ లిమిటెడ్ ఫార్మా దిగ్గజం లుపిన్ షేరుకి రూ. 850 స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. దీంతో రూ. 980 టార్గెట్ ధరతో రూ. 890 స్థాయిలో కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నాం. అయితే రూ. 850 వద్ద స్టాప్‌లాస్ అమలు చేయవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో లుపిన్ రూ. 897 వద్ద ముగిసింది. అజంతా ఫార్మా వారపు చార్టుల ప్రకారం హెల్త్‌కేర్ కంపెనీ అజంతా ఫార్మాకు రూ. 1330 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. ఇటీవల ఈ కౌంటర్ జోరందుకుంది. ఇది మరింత బలపడే వీలుంది. రూ. 1600 టార్గెట్ ధరతో రూ. 1440 స్థాయిలో అజంతా ఫార్మా షేరుని కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1370 వద్ద స్టాప్‌లాస్ తప్పనిసరి. వారాంతాన ఎన్ఎస్ఈలో అజంతా ఫార్మా రూ. 1459 వద్ద ముగిసింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ డౌన్‌ట్రెండ్‌లో ఉన్న పిరమల్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ తాజాగా ర్యాలీ బాట పట్టింది. తద్వారా ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరింది. దీంతో రూ. 1420-1460 స్థాయిలవద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. వెరసి రూ. 1050 టార్గెట్ ధరతో రూ. 1360-1368 స్థాయిలలో ఈ షేరుని విక్రయించవచ్చని భావిస్తున్నాం. రూ. 1485 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకోవలసి ఉంటుంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 1381 వద్ద ముగిసింది. -
‘కరోనా వ్యాక్సిన్‌తో ఫార్మా రంగం వృద్ధి’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో మెజారిటీ రంగాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ ఫార్మా రంగం మాత్రం ఆశాజనక వృద్ధితో దూసుకెళ్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. కరోనా వైరస్‌ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ల(టీకా)ను కనిపెట్టే ప్రయత్నంలో చాలా బిజీగా రీసెర్చ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఫార్మా రంగం ఆర్థికంగా లాభాలు తేకపోవచ్చు గానీ, ఫార్మా పరిశ్రమ పుంజుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే ఫార్మా రంగం వేగంగా పుంజుకుంటుందని నివేదిక తెలిపింది. ఫార్మా రంగం అభివృద్ధి చెందితే ప్రజలకు మెరుగైన సేవలందుతాయని పేర్కొంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను వేగంగా తీసుకొచ్చేందుకు దేశానికి చెందిన భారత్ బయోటెక్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాలు ముందంజలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం, ఐసీఎమ్ఆర్ సహాయంతో భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కొవాక్సిన్ మొదటగా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఫార్మాకు ‘కోవిడ్’ ఫీవర్!!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడి వస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ‘ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి‘ అని జైడస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ పటేల్ వెల్లడించారు. 2018–19 గణాంకాల ప్రకారం.. భారత సంస్థలు దిగుమతి చేసుకునే బల్క్ డ్రగ్స్‌లో సింహభాగం 67.56 శాతం వాటా చైనాదే ఉంది. కరోనా వైరస్‌కు సంబంధించి తాజా పరిస్థితులపై ఫార్మాతో పాటు టెక్స్టైల్స్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్, సోలార్, ఆటో, సర్జికల్ ఎక్విప్మెంట్స్, పెయింట్స్ తదితర రంగాల ప్రతినిధులు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. దేశీ పరిశ్రమలపై కరోనావైరస్ ప్రతికూల ప్రభావాలు పడకుండా చూసేందుకు ప్రభుత్వం త్వరలో తగు చర్యలు ప్రకటిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆందోళన వద్దు: నిర్మలా సీతారామన్ కీలక ముడి వస్తువుల దిగుమతుల్లో జాప్యం వల్ల ఫార్మా, కెమికల్, సౌర విద్యుత్ పరికరాల రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, కరోనావైరస్ కారణంగా ధరల పెరుగుదల గురించి ఆందోళన అక్కర్లేదని ఆమె చెప్పారు. ఔషధాలు, మెడికల్ పరికరాల కొరత లేదన్నారు. కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఫార్మా పరిశ్రమ కోరుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, దేశీ ఫార్మా సంస్థలకు ఏపీఐల సరఫరాపై కరోనావైరస్ ప్రభావాల మీద ఫార్మా విభాగం (డీవోపీ) అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాలో నూతన సంవత్సర సెలవుల కారణంగా గత 20–25 రోజులుగా సరఫరా ఆగిపోయిందని పేర్కొన్నాయి. బల్క్ డ్రగ్స్ కోసం భారత ఫార్మా సంస్థలు ఎక్కువగా చైనా మీదే ఆధారపడుతున్నాయి. రెండు, మూడు నెలల స్టాక్ మాత్రమే ఉంది: ఐపీఏ భారత ఔషధ పరిశ్రమ వద్ద రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ నిల్వలు ఉన్నాయని ఇండియా ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) వెల్లడించింది. చైనా నుంచి ఏటా రూ.17,000 కోట్ల విలువైన ముడి సరుకు (ఏపీఐ) భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. బయో ఆసియాలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఏం జరుగుతుందో ఊహించే పరిస్థితి లేదు. రెండు, మూడు నెలలకు సరిపడ మాత్రమే నిల్వలున్నాయి. మార్చి మొదటి వారం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందని భావిస్తున్నాం’ అన్నారు. -
కోవిడ్ : పరిస్థితి భయంకరంగా ఉంది
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్-19 వైరస్ ప్రకంపనలు దేశీయ ఫార్మ రంగాన్ని తాకనున్నాయి. చైనా నుండి ముడి పదార్థాల దిగుమతి నిలిచిపోవడంతో పరిస్థితి భయంకరంగా ఉందని (ఐపీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత పార్మా పరిశ్రమలో కేవలం రెండు, మూడు నెలల వరకు మాత్రమే సరిపడా ముడిపదార్థం నిల్వలు (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఏపీఐ) ఉన్నాయని తెలిపింది. మార్చి నెల నుంచి దిగుమతులు తిరిగి ప్రారంభమైతేనే పరిస్థితి చక్కబడే అవకాశాలున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా క్లిష్టమైన, తీవ్రమైన పరిస్థితిలో భారతీయ ఫార్మా పరిశ్రమం ఉందని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమి జరుగుతుందో ఎవరికీ పూర్తి అంచనాలేదనీ, పరిస్థితి ఎప్పటికి మెరుగుపడుతుందో లేదో ఊహించడం చాలా కష్టమని తెలిపారు. కేవలం రెండు, మూడు నెలలకు సరిపడా ముడి పదార్థాలు మాత్రమే మిగిలి వున్నాయని జైన్ చెప్పారు. అయితే ప్రతీ రోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఏపీఐలను యూరోపియన్ దేశాలనుంచి దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన (ఫిబ్రవరి17-19 తేదీల్లో) బయో ఏషియా-2020 సదస్సులో మాట్లాడుతూ సుదర్శన్ జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ వనరులపై తాము కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అలాగే కొన్ని ఏపీఐ తయారీ యూనిట్లకు వేగంగా పర్యావరణ అనుమతులు కోరినట్టు చెప్పారు. తద్వారా చైనాపై ఆధారపడటం తగ్గిందన్నారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం చైనా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ఏపీఐల విలువ రూ .17,000 కోట్లు. ప్రపంచానికి జెనరిక్ మందుల ప్రధాన సరఫరాదారుగా ఉన్న చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం ఫార్మా పరిశ్రమగా పెద్ద దెబ్బేనని, ఈ కొరత మరింత పెరిగే అవకాశం వుందని ఇప్పటికే పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత దేశానికి 70 శాతం కంపెనీలు చైనానుంచి దిగుమతయ్యే ఔషధాల మూలకాల మీదే ఆధారపడి వున్నాయి. చదవండి : కోవిడ్ : పరిశ్రమలకు ఆర్థికమంత్రి అభయం -
ప్రత్యేక ఫార్మా క్లస్టర్లకు సిఫార్సు!
సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఫార్మా సిటీల మాదిరిగా ప్రత్యేక (ఎక్స్‌క్లూజివ్) ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు ప్రభుత్వరంగ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఆర్. ఉదయ్ భాస్కర్ తెలిపారు. దీనివల్ల ఫార్మారంగం వృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో ఫార్మా ఇండస్ట్రీ సదస్సుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మందుల ఎగుమతుల్లో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలోను, వాల్యూలో 10వ స్థానంలో ఉందని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్ ఎదుగుతోందన్నారు. చైనాలో మనకన్నా తక్కువ ధరలకే చాన్నాళ్లుగా యాంటీబయాటిక్స్, తదితర మందుల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యమవుతుండడం వల్ల అక్కడ నుంచి వాటి దిగుమతికి ఎక్కువగా భారత్ ఆధార పడుతోందన్నారు. కానీ కొన్నాళ్లుగా చైనాలో ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో భారత్ నుంచి అక్కడకు ఎగుమతులు మొదలయ్యాయని, ఇది మనకు మంచి పరిణామమని తెలిపారు. ఇలాంటి వాటిని మనదేశంలో విస్తృతం చేస్తే ఇతర దేశాలకు గణనీయంగా ఎగుమతి చేయడానికి వీలుంటుందని, దీంతో ఫార్మా కంపెనీలు లాభాలు ఆర్జిస్తాయని వివరించారు. ప్రస్తుతం ఫార్మాక్సిల్ దృష్టి సారిస్తోందన్నారు. చాలా దేశాలు ఔషధ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకు తక్కువ ధరలకే మందుల లభ్యత తప్పనిసరన్నారు. మందుల ఎగుమతుల్లో భారత్‌కు చైనాతో పాటు అమెరికా, యూరప్ దేశాలు ప్రధాన పోటీదార్లుగా ఉన్నారని చెప్పారు. రెగ్యులేటెడ్ మార్కెట్‌కి భారత్ 50 శాతం మందులను ఎగుమతి చేస్తోందన్నారు. ఔషధాల దిగుమతులపై ఉన్న నిషేధంపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతుందని, ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఫార్మా పాలసీ రూపొందించడంలో ఫార్మెక్సిల్ ప్రభుత్వానికి సలహా ఇస్తుందని వివరించారు. ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్.. కొన్ని దేశాల్లో మన దేశ ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు రిజిస్ట్రేషన్ అవసరమని ఉదయ్ భాస్కర్ తెలిపారు. అందుకయ్యే ఖర్చులో 50 శాతం గాని, లేదా రూ.50 లక్షలు మించకుండా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ ఫార్మా కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, ఎగుమతులు, ఆయా దేశాలకు అవసరాలేమిటన్న దానిపై ప్రతినిధులతో చర్చలుంటాయని వివరించారు. దేశంలో ఫార్మెక్సిల్కు ఔషధ ఎగుమతులు చేసే 3500 మంది సభ్యులున్నారని ఉదయ్‌భాస్కర్ తెలిపారు. -
ముచ్చర్లలో ‘ఫార్మా’ సరికాదు
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం: ముచ్చర్లలో ఫార్మా పరిశ్రమ నెలకొల్పడం వల్ల ఇక్కడి ప్రశాంతమైన పర్యావరణానికి పెనుప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీరిస్ పరిశ్రమ నెలకొల్పడం మూలంగా రంగారెడ్డి జిల్లాలోని జీటిమెట్ల, సరూర్‌నగర్ మండలాల్లో ఇప్పటికే వాతావరణ కాలుష్యం ఏర్పడిందని, ఎంతో మంది ప్రజలు ఫ్లోరైడ్‌బారిన పడి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై ఎక్కడా మాట్లాడని ముఖ్యమంత్రి.. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, పర్యటనలతో నిరుద్యోగ యువతను భ్రమల్లోకి నెడుతున్నారన్నారు. ఎంతోమంది యువకుల బలిదానాలకు చలించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, విద్యార్ధుల బలిదానాలను, మేధావుల పోరాటాలను అపహాస్యం చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు విసుగెత్తి పోతున్నారని, గతంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని వెల్లడించారు. -
దేశీ ఔషధాలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియా ఫార్మాస్యూటికల్ అలియాన్స్(ఐపీఏ) విన్నవించింది. ఔషధ ఆవిష్కరణలకు ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారం తగ్గించే దిశగా పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టాలని ఐపీఏ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కోరారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పరిశ్రమ అభిప్రాయాలను బుధవారమిక్కడ ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని రకాల క్రియాశీల రసాయన మూలకాల(ఏపీఐ) కోసం చైనాపైన ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ‘ఇదంత మంచి పరిణామం కాదు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయగలిగే స్థాయిలో భారత్ లేదు. చైనా నుంచి సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే దేశీయ పరిశ్రమకు పెద్ద సమస్యే. ఇదే జరిగితే వ్యయాలు అధికమవుతాయి’ అన్నారు. ప్రత్యేక క్లస్టర్లు..: ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమైన ఔషధాల తయారీకై పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సతీష్ రెడ్డి కోరారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే చేపట్టాలి. పోటీ ధరలో విద్యుత్ అందించాలి. తద్వారా బల్క్ డ్రగ్ రంగం లో ఇతర దేశాలతో పోటీ పడేందుకు మన కంపెనీలకు వీలవుతుంది. ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గుతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ ఆధారిత యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా చైనా నుంచే తెప్పించుకుంటున్నాం’ అని గుర్తు చేశారు. ఆవిష్కరణలను..: దేశీయంగా ఔషధ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలని సతీష్ రెడ్డి అభిలషించారు. ఇది కార్యరూపం దాల్చాలంటే పరిశ్రమకు రాయితీలను అందించాలని అన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 1999-2004లో రూ.1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినా, వివిధ కారణాలరీత్యా పెద్దగా ఫలితమివ్వలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీలతో అనుసంధానంగా ఇంకుబేషన్ కేంద్రాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇంకుబేషన్ కేంద్రాలు, పరిశోధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను వెన్నుతట్టే ప్రోత్సాహక వ్యవస్థ ఏర్పాటవ్వాలన్నారు. ఆర్అండ్డీ వ్యయాలపై ఇస్తున్న వెయిటెడ్ తగ్గింపులను ప్రస్తుతమున్న 200% నుంచి 250 శాతానికి పెంచాలని కోరారు. వ్యయమూ పెరగాలి.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఏమేర వ్యయం చేయబోతోందో పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.2% మాత్రమే. వచ్చే ఐదేళ్లలో ఇది జీడీపీలో 2.5 శాతానికి చేరుతుందని ఐపీఏ అంచనా వేస్తోంది. జీవ సమతుల్యత(బయోఈక్వలెన్స్) పరిశోధనలను ఫార్మా కంపెనీలు చేపట్టాలని ఐపీఏ కోరుతోంది. పేటెంటు దరఖాస్తులకు బదులు క్లినికల్ ట్రయల్స్‌ను విదేశాల్లో నిర్వహించాలని సూచించింది. -
కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్‌లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది. భెల్‌లో 4.66 శాతం వాటా విక్రయంపై... విద్యుత్ పరికరాల సంస్థ భెల్‌లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.