దేశీ ఔషధాలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియా ఫార్మాస్యూటికల్ అలియాన్స్(ఐపీఏ) విన్నవించింది. ఔషధ ఆవిష్కరణలకు ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారం తగ్గించే దిశగా పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టాలని ఐపీఏ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కోరారు.
త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పరిశ్రమ అభిప్రాయాలను బుధవారమిక్కడ ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని రకాల క్రియాశీల రసాయన మూలకాల(ఏపీఐ) కోసం చైనాపైన ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ‘ఇదంత మంచి పరిణామం కాదు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయగలిగే స్థాయిలో భారత్ లేదు. చైనా నుంచి సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే దేశీయ పరిశ్రమకు పెద్ద సమస్యే. ఇదే జరిగితే వ్యయాలు అధికమవుతాయి’ అన్నారు.
ప్రత్యేక క్లస్టర్లు..: ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమైన ఔషధాల తయారీకై పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సతీష్ రెడ్డి కోరారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే చేపట్టాలి. పోటీ ధరలో విద్యుత్ అందించాలి. తద్వారా బల్క్ డ్రగ్ రంగం లో ఇతర దేశాలతో పోటీ పడేందుకు మన కంపెనీలకు వీలవుతుంది. ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గుతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ ఆధారిత యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా చైనా నుంచే తెప్పించుకుంటున్నాం’ అని గుర్తు చేశారు.
ఆవిష్కరణలను..: దేశీయంగా ఔషధ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలని సతీష్ రెడ్డి అభిలషించారు. ఇది కార్యరూపం దాల్చాలంటే పరిశ్రమకు రాయితీలను అందించాలని అన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం 1999-2004లో రూ.1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినా, వివిధ కారణాలరీత్యా పెద్దగా ఫలితమివ్వలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీలతో అనుసంధానంగా ఇంకుబేషన్ కేంద్రాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇంకుబేషన్ కేంద్రాలు, పరిశోధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను వెన్నుతట్టే ప్రోత్సాహక వ్యవస్థ ఏర్పాటవ్వాలన్నారు. ఆర్‌అండ్‌డీ వ్యయాలపై ఇస్తున్న వెయిటెడ్ తగ్గింపులను ప్రస్తుతమున్న 200% నుంచి 250 శాతానికి పెంచాలని కోరారు.
వ్యయమూ పెరగాలి..
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఏమేర వ్యయం చేయబోతోందో పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.2% మాత్రమే. వచ్చే ఐదేళ్లలో ఇది జీడీపీలో 2.5 శాతానికి చేరుతుందని ఐపీఏ అంచనా వేస్తోంది. జీవ సమతుల్యత(బయోఈక్వలెన్స్) పరిశోధనలను ఫార్మా కంపెనీలు చేపట్టాలని ఐపీఏ కోరుతోంది. పేటెంటు దరఖాస్తులకు బదులు క్లినికల్ ట్రయల్స్‌ను విదేశాల్లో నిర్వహించాలని సూచించింది.