Union Budget 2014
-
ఏమయ్యేనో?
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్, నీటి సరఫరాలను మెరుగుకు కేంద్ర బడ్జెట్ అనూహ్యంగా కేటాయింపులు చేసిన నేపథ్యంలో త్వరలో ఆర్థిక మంత్రి సమర్పించే ఢిల్లీ బడ్జెట్‌పై ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రంలోప్రజలెన్నుకున్న ప్రభుత్వం లేనందువల్ల బడ్జెట్లో కొత్త పథకాలు, ప్రతిపాదనలు ప్రకటించకపోయ్టినప్పటికీ ప్రభుత్వ విభాగాలు తమ తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయి. ప్రస్తుతం అమల్లోఉన్న ఆహారభద్రత పథకం కొనసాగింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే చక్కెరకు సబ్సిడీ. చౌక ధర దుకాణాలను కంప్యూటరీకరించే ప్రతిపాదననదు కేంద్రానికి పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నగరంలో విద్యుత్, నీటి సరఫరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీకి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు.200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించేవారికి సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది. దీంతోపాటు అనధికార కాలనీల్లో అభివృద్ధి కార్యకలాపాలు, జుగ్గీ జోపిడీలలో నివసించేవారికి చౌక ధర ఇళ్ల కేటాయింపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటితోపాటు నగరంలో రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు సంబంధించి కూడా ప్రభుత్వం కేటాయింపులు చేయనుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఢిల్లీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరమవుతాయి. అయితే డీటీసీ వద్ద దాదాపు 5,500 బస్సులున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలుకు సంబంధించి ఈ బడ్జెట్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. ఢిల్లీ కోసం 1,150 బస్సులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు ఇప్పటికే కేంద్రానికి పంపింది. జెఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే రూ. 584 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో బడ్జెట్లో ఈ బస్సుల కొనుగోలు కోసం నిధులు కేటాయించవచ్చని ఆశిస్తున్నారు. శాససభ ఎన్నికల నాటి నుంచి అభివృద్ధి కార్యకలాపాలు ఆగిపోయిన నేపథ్యంలో ఇందుకుకూడా నిధులు కేటాయించొచ్చని ఆశిస్తున్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొత్త పాఠశాలల ఏర్పాటు, ఆస్పత్రుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది. -
మార్కెట్.. అటూఇటూ
ఆర్థిక మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ తొలిసారి ప్రవేశపెట్టిన వార్షిక ‘సాధారణ’ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లు గందరగోళానికి లోనయ్యాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 800 పాయింట్ల పరిధిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు వేదికైంది. వెరసి రోజులో గరిష్టంగా 25,920 పాయింట్లను తాకినప్పటికీ, 25,117 వద్ద కనిష్ట స్థాయిని సైతం చూసింది. చివరికి 72 పాయింట్ల నష్టంతో 25,373 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 7,731-7,479 మధ్య కదిలి చివరికి 7,568 వద్ద ముగిసింది. నికరంగా 17 పాయింట్లు క్షీణించింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇంతక్రితం జూన్ 27న మాత్రమే సెన్సెక్స్ 25,100 వద్ద ముగిసింది. సబ్సిడీ చెల్లింపులపై అస్పష్టత బడ్జెట్లో పలు పాలసీలను సంస్కరించడంతోపాటు, బీమా, రక్షణ రంగాలలో విదేశీ పెట్టుబడులను పెంచడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు ఉపశమనం, ఇన్ఫ్రాకు పెట్టుబడి అవకాశాలు వంటి పలు కీలక అంశాలున్నప్పటికీ ఇన్వెస్టర్లు పూర్తిస్థాయిలో సానుకూలంగా స్పందించలేకపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చెల్లింపులకు నోచుకోని సబ్సిడీ బిల్లుపై స్పష్టత కొరవడటం, ద్రవ్యలోటు అదుపు చర్యలపై అస్పష్టత, ఎలాంటి భారీ స్థాయి ప్రకటనలూ లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను నిరుత్సాహపరచాయని తెలిపారు. సెన్సెక్స్ తీరు ఇదీ... తొలుత స్వల్ప లాభాల మధ్య కదిలిన సెన్సెక్స్ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలైన తరువాత 330 పాయింట్లు పతనమైంది. కనిష్టంగా 25,117కు చేరింది. ప్రసంగం ముగిశాక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు 475 పాయింట్లు ఎగసింది. 25,920 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. రియల్టీ దూకుడు ప్రధానంగా వినియోగ వస్తు రంగం 3% పతనంకాగా, రియల్టీ ఇండెక్స్ 5% ఎగసింది. బడ్జెట్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)లకు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు, గృహ రుణ వడ్డీపై పన్ను రాయితీ పరిధిని పెంచడం ఇందుకు దోహదపడింది. రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీబీ, మహీంద్రా లైఫ్, శోభా, ఒబెరాయ్, ఫీనిక్స్ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఇతర విశేషాలివీ... హైవేలకు నిధుల కేటాయింపుతో కన్స్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ, కేఎన్ఆర్, మధుకాన్, పీబీఏ, ఐఆర్బీ, గ్యామన్ 6-4% మధ్య ఎగశాయి. 2017 కల్లా ప్రారంభమయ్యే విద్యుదుత్పత్తి సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడంతో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరంట్, అదానీ, టాటా పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా 4-2% మధ్య పుంజుకున్నాయి. పాదరక్షలపై ఎక్సైజ్ సుంకాన్ని 12% నుంచి 6%కు తగ్గించడంతో రిలాక్సో, లిబర్టీ, బాటా 6-4% మధ్య జంప్ చేశాయి. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం 11% నుంచి 72 శాతానికి పెంపుతో వీఎస్టీ ఇండస్ట్రీస్ 18% పడింది. -
రిటైల్‌కు పరిశ్రమ హోదా కావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో రిటైల్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని సంబంధిత కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ‘2017 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.47 లక్షల కోట్ల స్థాయికి ఎగబాకవచ్చని అంచనా. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుంది. ఈ దృష్ట్యా పరిశ్రమ హోదా తప్పనిసరి’ అని ఉడ్‌ల్యాండ్ ఎండీ హర్కిరాట్ సింగ్ పేర్కొన్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్, టాటా గ్రూప్‌నకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్ సీఈఓ, ఎండీ అజిత్ జోషి కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశీయ బ్రాండ్లకు ప్రోత్సాహం అవసరం... ‘దేశీయ బ్రాండ్లు ప్రాచుర్యంలోకి రావాలి. ఇందుకు రాయితీలను ప్రకటించాలి. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇటువంటి ప్రోత్సాహం అవసరం. దేశీయ ఫుడ్ ప్రాసెసర్లకు అనలిటికల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వాలి. ప్రాసెస్డ్, నాన్ ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులపై ఎక్సైజు డ్యూటీ తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలి. వ్యవసాయోత్పత్తులు, పశుగణ మార్కెట్ యాక్టు 1966ను ఎత్తివేయాలి. ఆహారోత్పత్తుల ధరలు స్థిరంగా ఉండాలంటే జీఎస్టీని వెంటనే అమలు పరచాలి’ -రవీంద్ర మోడీ, ఎండీ, హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్(సూర్య బ్రాండ్) -
దేశీ ఔషధాలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియా ఫార్మాస్యూటికల్ అలియాన్స్(ఐపీఏ) విన్నవించింది. ఔషధ ఆవిష్కరణలకు ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారం తగ్గించే దిశగా పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టాలని ఐపీఏ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కోరారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పరిశ్రమ అభిప్రాయాలను బుధవారమిక్కడ ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని రకాల క్రియాశీల రసాయన మూలకాల(ఏపీఐ) కోసం చైనాపైన ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ‘ఇదంత మంచి పరిణామం కాదు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయగలిగే స్థాయిలో భారత్ లేదు. చైనా నుంచి సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే దేశీయ పరిశ్రమకు పెద్ద సమస్యే. ఇదే జరిగితే వ్యయాలు అధికమవుతాయి’ అన్నారు. ప్రత్యేక క్లస్టర్లు..: ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమైన ఔషధాల తయారీకై పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సతీష్ రెడ్డి కోరారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే చేపట్టాలి. పోటీ ధరలో విద్యుత్ అందించాలి. తద్వారా బల్క్ డ్రగ్ రంగం లో ఇతర దేశాలతో పోటీ పడేందుకు మన కంపెనీలకు వీలవుతుంది. ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గుతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ ఆధారిత యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా చైనా నుంచే తెప్పించుకుంటున్నాం’ అని గుర్తు చేశారు. ఆవిష్కరణలను..: దేశీయంగా ఔషధ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలని సతీష్ రెడ్డి అభిలషించారు. ఇది కార్యరూపం దాల్చాలంటే పరిశ్రమకు రాయితీలను అందించాలని అన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 1999-2004లో రూ.1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినా, వివిధ కారణాలరీత్యా పెద్దగా ఫలితమివ్వలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీలతో అనుసంధానంగా ఇంకుబేషన్ కేంద్రాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇంకుబేషన్ కేంద్రాలు, పరిశోధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను వెన్నుతట్టే ప్రోత్సాహక వ్యవస్థ ఏర్పాటవ్వాలన్నారు. ఆర్అండ్డీ వ్యయాలపై ఇస్తున్న వెయిటెడ్ తగ్గింపులను ప్రస్తుతమున్న 200% నుంచి 250 శాతానికి పెంచాలని కోరారు. వ్యయమూ పెరగాలి.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఏమేర వ్యయం చేయబోతోందో పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.2% మాత్రమే. వచ్చే ఐదేళ్లలో ఇది జీడీపీలో 2.5 శాతానికి చేరుతుందని ఐపీఏ అంచనా వేస్తోంది. జీవ సమతుల్యత(బయోఈక్వలెన్స్) పరిశోధనలను ఫార్మా కంపెనీలు చేపట్టాలని ఐపీఏ కోరుతోంది. పేటెంటు దరఖాస్తులకు బదులు క్లినికల్ ట్రయల్స్‌ను విదేశాల్లో నిర్వహించాలని సూచించింది.