ఆర్థిక మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ తొలిసారి ప్రవేశపెట్టిన వార్షిక ‘సాధారణ’ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లు గందరగోళానికి లోనయ్యాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులను చవిచూశాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 800 పాయింట్ల పరిధిలో పలుమార్లు హెచ్చుతగ్గులకు వేదికైంది. వెరసి రోజులో గరిష్టంగా 25,920 పాయింట్లను తాకినప్పటికీ, 25,117 వద్ద కనిష్ట స్థాయిని సైతం చూసింది.
చివరికి 72 పాయింట్ల నష్టంతో 25,373 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 7,731-7,479 మధ్య కదిలి చివరికి 7,568 వద్ద ముగిసింది. నికరంగా 17 పాయింట్లు క్షీణించింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇంతక్రితం జూన్ 27న మాత్రమే సెన్సెక్స్ 25,100 వద్ద ముగిసింది.
సబ్సిడీ చెల్లింపులపై అస్పష్టత
బడ్జెట్‌లో పలు పాలసీలను సంస్కరించడంతోపాటు, బీమా, రక్షణ రంగాలలో విదేశీ పెట్టుబడులను పెంచడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులకు ఉపశమనం, ఇన్‌ఫ్రాకు పెట్టుబడి అవకాశాలు వంటి పలు కీలక అంశాలున్నప్పటికీ ఇన్వెస్టర్లు పూర్తిస్థాయిలో సానుకూలంగా స్పందించలేకపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చెల్లింపులకు నోచుకోని సబ్సిడీ బిల్లుపై స్పష్టత కొరవడటం, ద్రవ్యలోటు అదుపు చర్యలపై అస్పష్టత, ఎలాంటి భారీ స్థాయి ప్రకటనలూ లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను నిరుత్సాహపరచాయని తెలిపారు.
సెన్సెక్స్ తీరు ఇదీ...
తొలుత స్వల్ప లాభాల మధ్య కదిలిన సెన్సెక్స్ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదలైన తరువాత 330 పాయింట్లు పతనమైంది. కనిష్టంగా 25,117కు చేరింది. ప్రసంగం ముగిశాక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు 475 పాయింట్లు ఎగసింది. 25,920 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.
రియల్టీ దూకుడు
ప్రధానంగా వినియోగ వస్తు రంగం 3% పతనంకాగా, రియల్టీ ఇండెక్స్ 5% ఎగసింది. బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌ఈఐటీ)లకు పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించడంతోపాటు, గృహ రుణ వడ్డీపై పన్ను రాయితీ పరిధిని పెంచడం ఇందుకు దోహదపడింది. రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, డీబీ, మహీంద్రా లైఫ్, శోభా, ఒబెరాయ్, ఫీనిక్స్ 9-2% మధ్య దూసుకెళ్లాయి.
ఇతర విశేషాలివీ...
హైవేలకు నిధుల కేటాయింపుతో కన్‌స్ట్రక్షన్ షేర్లు ఎన్‌సీసీ, కేఎన్‌ఆర్, మధుకాన్, పీబీఏ, ఐఆర్‌బీ, గ్యామన్ 6-4% మధ్య ఎగశాయి.
2017 కల్లా ప్రారంభమయ్యే విద్యుదుత్పత్తి సంస్థలకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడంతో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, టొరంట్, అదానీ, టాటా పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా 4-2% మధ్య పుంజుకున్నాయి.
పాదరక్షలపై ఎక్సైజ్ సుంకాన్ని 12% నుంచి 6%కు తగ్గించడంతో రిలాక్సో, లిబర్టీ, బాటా 6-4% మధ్య జంప్ చేశాయి.
సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం 11% నుంచి 72 శాతానికి పెంపుతో వీఎస్‌టీ ఇండస్ట్రీస్ 18% పడింది.
మార్కెట్.. అటూఇటూ
Published Fri, Jul 11 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM
Advertisement