ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా అయిదో రోజూ లాభాలు కొనసాగడంతో నిఫ్టీ సూచీ సోమవారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనాన్స్, ఇంధన, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో 146 పాయింట్లు ఎగసి 22,187 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 82 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపు 22,122 వద్ద స్థిరపడింది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న స్టాక్ సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనై సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాల ప్రభావంతో వెంటనే తేరుకోని లాభాల బాటపట్టాయి. నిఫ్టీ ఆల్‌టైం హై(22,187)ని నమోదు చేయగా.. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,882 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఐటీ, రియల్టీ షేర్లలో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 72,708 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ సైతం సరికొత్త శిఖరం(22,122) వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.52 %, 1.29% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.755 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.453 కోట్ల షేర్లు కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, జపాన్, ఇండోనేసియా స్టాక్ సూచీలు మాత్రమే నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ ఎక్సే్చంజీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా ప్రెసిడెంట్స్ హాలిడే కావడంతో అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు.
మార్కెట్లు మరిన్ని సంగతులు
► తమ నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్
బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకుకు మార్చడంతో పేటీఎం షేరు 5% లాభపడి రూ.359 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది.
► క్యూ3లో నికర లాభం 33% వృద్ధి నమోదుతో క్రిసిల్ షేరు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 9.50% ర్యాలీ చేసి రూ.5,039 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 13% ర్యాలీ చేసి రూ.5196 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.
► తన అనుబంధ సంస్థ పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఐఆర్‌డీఏఐ ‘డైరెక్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్’ నుంచి ‘కాంపోసైట్ ఇన్యూరెన్స్ బ్రోకర్’గా అప్‌గ్రేడ్ చేయడంతో పీబీ ఫిన్‌టెక్ షేరు 8% ఎగబాకి రూ.1,004 వద్ద నిలిచింది.
ఇన్వెస్టర్ల సంపద.. ఆల్‌టైమ్ గరిష్టం
మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.20 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.391.69 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment