ఏమయ్యేనో?
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్, నీటి సరఫరాలను మెరుగుకు కేంద్ర బడ్జెట్ అనూహ్యంగా కేటాయింపులు చేసిన నేపథ్యంలో త్వరలో ఆర్థిక మంత్రి సమర్పించే ఢిల్లీ బడ్జెట్‌పై ఆశలు మొదలయ్యాయి. రాష్ట్రంలోప్రజలెన్నుకున్న ప్రభుత్వం లేనందువల్ల బడ్జెట్‌లో కొత్త పథకాలు, ప్రతిపాదనలు ప్రకటించకపోయ్టినప్పటికీ ప్రభుత్వ విభాగాలు తమ తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపాయి. ప్రస్తుతం అమల్లోఉన్న ఆహారభద్రత పథకం కొనసాగింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే చక్కెరకు సబ్సిడీ. చౌక ధర దుకాణాలను కంప్యూటరీకరించే ప్రతిపాదననదు కేంద్రానికి పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నగరంలో విద్యుత్, నీటి సరఫరాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే.
అందుకే బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీకి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు.200 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగించేవారికి సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది. దీంతోపాటు అనధికార కాలనీల్లో అభివృద్ధి కార్యకలాపాలు, జుగ్గీ జోపిడీలలో నివసించేవారికి చౌక ధర ఇళ్ల కేటాయింపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటితోపాటు నగరంలో రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు సంబంధించి కూడా ప్రభుత్వం కేటాయింపులు చేయనుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఢిల్లీకి ప్రస్తుతం 11 వేల బస్సులు అవసరమవుతాయి. అయితే డీటీసీ వద్ద దాదాపు 5,500 బస్సులున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలుకు సంబంధించి ఈ బడ్జెట్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది.
ఢిల్లీ కోసం 1,150 బస్సులు కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీ సర్కారు ఇప్పటికే కేంద్రానికి పంపింది. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే రూ. 584 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో బడ్జెట్‌లో ఈ బస్సుల కొనుగోలు కోసం నిధులు కేటాయించవచ్చని ఆశిస్తున్నారు. శాససభ ఎన్నికల నాటి నుంచి అభివృద్ధి కార్యకలాపాలు ఆగిపోయిన నేపథ్యంలో ఇందుకుకూడా నిధులు కేటాయించొచ్చని ఆశిస్తున్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొత్త పాఠశాలల ఏర్పాటు, ఆస్పత్రుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఢిల్లీ సర్కారు కేంద్రానికి పంపింది.