IPA
-
డోలో 650, రూ. వెయ్యికోట్ల ఫ్రీబీస్: ఐపీఏ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: డోలో-650 తయారీదారు మైక్రో ల్యాబ్ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల లంచాలు అందించిందన్న వార్త నిజం కాదా? దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) రిపోర్టు ఇదే తేల్చింది. వెయ్యికోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్ కాదని నేషనల్ ఫార్మా స్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)కి ఐపీఏ సమర్పించిన పరిశోధనా నివేదిక వెల్లడించింది. కంపెనీ వివరణలో సింగిల్ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టే. కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని నివేదించింది. ఒక సంవత్సరంలో (మైక్రో ల్యాబ్స్) 1000 కోట్ల ఖర్చు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేశారని ఐపీఏ పేర్కొంది. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లు, అందులో దాదాపు రూ. 2500 కోట్ల దేశీయ విక్రయాలు. గత నాలుగేళ్లలో దేశీయ విక్రయాలపై (ఏడాదికి ఏడాదికి అన్ని కార్యకలాపాలపై) సగటున రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో ఐపీఏ వెల్లడించింది. ఐపీఏ విచారణకు ప్రతిస్పందనగా మైక్రోల్యాబ్స్ అన్ని కార్యకలాపాలపై ఐదు సంవత్సరాల వ్యయాల రిపోర్టును అందించింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు, మార్కెటింగ్‌పై మొత్తం రూ. 186 కోట్లు వెచ్చించిందని, అందులో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఖర్చులకు రూ. 65 కోట్లు, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సేవలకు రూ. 67 కోట్లు, దాదాపు రూ. 53 కోట్లు వెచ్చించామని వివరించింది. అలాగే 2019-20లో కంపెనీ సేల్స్ అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం రూ.67 కోట్లు వెచ్చించింది. ఈ నివేదిక ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో డోలో 650పై చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి, 2021లో మొత్తం 1152 లక్షలు వెచ్చించింది. 22 విజువల్ యాడ్స్, లిటరేచర్ అండ్ ప్రింట్ ప్రమోషనల్ ఇన్పుట్లు, బ్రాండ్ రిమైండర్స్, ఫిజిషియన్ శాంపిల్స్, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సర్వీసెస్ కలిపి 2020-21లో ఈ ఖర్చు రూ. 712 లక్షలుగా ఉంది. డోలో650 సరైన మోతాదు అవునా కాదా, ధరల నియంత్రణలో ఉందా లేదా అనేదికూడా ఐపీఏ పరిశీలించింది. డోలో-650 ఎంజీ 2018లో ఇండియన్ ఫార్మకోపోయి ఆమోదించిందని తెలిపింది. ఇది జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో ఉందని స్పష్టం చేసింది. కాగా వైద్య సంఘాల ఫిర్యాదులను స్వీకరించిన ఎన్పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యుసిపిఎంపి) కింద దర్యాప్తు చేయాలని ఐపీఎను కోరింది. ఇందుకు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ టాబ్లెట్లను సిఫారసు చేసేందుకుగాను వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్న ఆరోపణలు, డోలో-650 మేకర్ మైక్రో ల్యాబ్స్ జూలైలో పన్ను ఎగవేత ఆరోపణలపై టాప్ మేనేజ్మెంట్ కార్యాలయాలు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది. -
4లక్షల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్ రంగం వాటా 50 బిలియన్ డాలర్లు ఉండగా, 2030 నాటికి వంద బిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు, నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముంబాయిలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ప్రతినిధులతో పాటు ఫార్మా రంగ ప్రముఖులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఫార్మాస్యూటికల్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వెల్లడించడంతో పాటు, ఐపీఏ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు సిరిసిల్ల అపరెల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరిస్తూ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ షాపర్స్‌స్టాప్ ఎంవోయూపై సంతకాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా సిరిసిల్ల అపరెల్ పార్కులో వందలమంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందం అనంతరం ముంబయిలోని వస్త్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కేటీఆర్ చర్చలు జరిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ప్రత్యేకతలను వారికి వివరించారు. టెక్స్టైల్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల ప్రత్యేకతలతో పాటు, ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిగిన ఈ భేటీల్లో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
ఐసీఎస్ఐ ఐపీఏ వెబ్సైట్ ప్రారంభం
హైదరాబాద్: ఐసీఎస్ఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ, ఐసీఎస్ఐ ఐపీఏ(ఐసీఎస్ఐ ఇన్సాల్వేన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ) తన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను ఐసీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ అగర్వాల్ ఆరంభించారని ఐసీఎస్ఐ ఐపీఓ ఒక ప్రకటనలో తెలిపింది. ⇔ ఐసీఎస్ఐ ఐపీఏ రాజ్యాంగం, గత, రాబోయే ఈవెంట్స్, ఇన్సాల్వేన్సీ ప్రొఫెషనల్‌గా నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ వివరాలు, దివాళాకు సంబంధించిన నియమనిబంధనలు, ఈ నియమనిబంధనలకు సంబంధించిన అప్డేట్లు, తాజా సవరణలు, ప్రకటనలు...సంబంధిత సమస్త వివరాలు ఈ వెబ్సైట్లో ఉంటాయని ఈ సందర్భంగా శ్యామ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
భవిష్యత్ ఫార్మారంగానిదే..
ఎచ్చెర్ల: భవిష్యత్ అంతా ఫార్మారంగానిదేనని ముంబయికి చెందిన ఐపీఏ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ అన్నారు. చిలకపాలేం సమీపంలోని శివానీ కాలేజ్ ఆఫ్ పార్మసీలో బుధవారం ‘ఫార్మా కార్నివాల్- 2016 నేషనల్ లెవల్ సింపోషియం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశ ంలో శరవేగంగా ఫార్మారంగం విస్తరిస్తోందన్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడీ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫార్మసిస్టులకు విదేశాల్లో వైద్యులతో సమానగుర్తింపు లభిస్తోందని చెప్పారు. వైద్యులు రోగాలు నిర్థారిస్తే ఫార్మసిస్టులు మందులు నిర్ణయిస్తారన్నారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. జేఎన్టీయూ కాకినాడ బోర్డాఫ్ స్టడీస్ చెర్మైన్ ప్రొఫెసర్ కేపీఆర్ చౌదిరి మాట్లాడుతూ విద్యార్థులు ఫార్మారంగంలో రాణించాలంటే ప్రస్తుత ట్రెండ్ తెలుకోవాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాలు ఆధారంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కాకినాడ ఫార్మసీ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీయూ ఎం.ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్‌బాబు, మేనేజ్ మెంట్ సభ్యులు వీఎంఎం సాయినాథ్‌రెడ్డి, పి.దుర్గాప్రసాద్‌రాజు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశీ ఔషధాలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ తయారీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియా ఫార్మాస్యూటికల్ అలియాన్స్(ఐపీఏ) విన్నవించింది. ఔషధ ఆవిష్కరణలకు ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారం తగ్గించే దిశగా పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టాలని ఐపీఏ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి కోరారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పరిశ్రమ అభిప్రాయాలను బుధవారమిక్కడ ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని రకాల క్రియాశీల రసాయన మూలకాల(ఏపీఐ) కోసం చైనాపైన ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ‘ఇదంత మంచి పరిణామం కాదు. అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయగలిగే స్థాయిలో భారత్ లేదు. చైనా నుంచి సరఫరాలో అవాంతరాలు ఏర్పడితే దేశీయ పరిశ్రమకు పెద్ద సమస్యే. ఇదే జరిగితే వ్యయాలు అధికమవుతాయి’ అన్నారు. ప్రత్యేక క్లస్టర్లు..: ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమైన ఔషధాల తయారీకై పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని సతీష్ రెడ్డి కోరారు. పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే చేపట్టాలి. పోటీ ధరలో విద్యుత్ అందించాలి. తద్వారా బల్క్ డ్రగ్ రంగం లో ఇతర దేశాలతో పోటీ పడేందుకు మన కంపెనీలకు వీలవుతుంది. ఇతర దేశాలపై ఆధారపడటమూ తగ్గుతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ ఆధారిత యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా చైనా నుంచే తెప్పించుకుంటున్నాం’ అని గుర్తు చేశారు. ఆవిష్కరణలను..: దేశీయంగా ఔషధ ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలని సతీష్ రెడ్డి అభిలషించారు. ఇది కార్యరూపం దాల్చాలంటే పరిశ్రమకు రాయితీలను అందించాలని అన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం 1999-2004లో రూ.1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసినా, వివిధ కారణాలరీత్యా పెద్దగా ఫలితమివ్వలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీలతో అనుసంధానంగా ఇంకుబేషన్ కేంద్రాలు రావాలని అభిప్రాయపడ్డారు. ఇంకుబేషన్ కేంద్రాలు, పరిశోధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను వెన్నుతట్టే ప్రోత్సాహక వ్యవస్థ ఏర్పాటవ్వాలన్నారు. ఆర్అండ్డీ వ్యయాలపై ఇస్తున్న వెయిటెడ్ తగ్గింపులను ప్రస్తుతమున్న 200% నుంచి 250 శాతానికి పెంచాలని కోరారు. వ్యయమూ పెరగాలి.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఏమేర వ్యయం చేయబోతోందో పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.2% మాత్రమే. వచ్చే ఐదేళ్లలో ఇది జీడీపీలో 2.5 శాతానికి చేరుతుందని ఐపీఏ అంచనా వేస్తోంది. జీవ సమతుల్యత(బయోఈక్వలెన్స్) పరిశోధనలను ఫార్మా కంపెనీలు చేపట్టాలని ఐపీఏ కోరుతోంది. పేటెంటు దరఖాస్తులకు బదులు క్లినికల్ ట్రయల్స్‌ను విదేశాల్లో నిర్వహించాలని సూచించింది.