ప్రమాద సమయంలో అలారం వ్యవస్థ ఉండాలి
సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్, అన్‌లోడింగ్ ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలి
ప్రతి క్లోజ్డ్ రూమ్‌లోనూ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటు చేయాలి
‘ఫార్మా’ ప్రమాదాల నివారణకు హైలెవల్ కమిటీ సిఫారసులు సిద్ధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా ఫార్మా పరిశ్రమలు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లతో పాటు అలారం వ్యవస్థను తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ అభిప్రాయపడుతోంది. సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ మొత్తం పెట్రోల్ బంకుల తరహాలో ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలని కూడా స్పష్టంచేస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల పాటు విశాఖ అచ్యుతాపురం సెజ్, రాంకీ ఫార్మాలోని వివిధ యూనిట్లను పరిశీలించడంతో పాటు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా సెజ్‌లల్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీలో భద్రతాపరమైన లోటుపాట్లు స్పష్టంగా ఉన్నట్లు ఈ ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. మొత్తం ఏడు విభాగాలకు సంబంధించిన అంశాలతోనూ, ఫార్మా కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. 39 మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే.
రెండ్రోజుల వ్యవధిలోనే పరవాడ సినర్జీస్ కంపెనీలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయి? ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనలు ఎలా కఠినతరం చెయ్యాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా ఆధ్వర్యంలో హైలెవల్ కమిటి జిల్లాలోని సెజ్‌లలో పర్యటించింది. ప్రమాదం జరిగిన కంపెనీలతో పాటు సెజ్‌లని పరిశీలించింది. అనంతరం.. ఆయా విభాగాల అధికారులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మూడు కోణాల్లో హైలెవల్ కమిటీ నివేదిక సిద్ధంచేసింది. ఒకటి.. జరిగిన ప్రమాదానికి గల కారణాలు, రెండు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మూడు.. పరిశ్రమలు అవలంబించాల్సిన అత్యాధునిక విధానాల్ని సూచిస్తూ సమగ్ర నివేదిక సిద్ధంచేసింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ౖఫైర్, డ్రగ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఏపీపీసీబీ, బాయిలర్స్ విభాగాల నుంచి సలహాలతో నివేదికని తయారుచేశారు.
నివేదికలో ముఖ్యమైన అంశాలు
» ప్రతి ఫార్మా పరిశ్రమ.. అడ్వాన్స్‌డ్ విధానాలు అవలంబించాలని హైలెవల్ కమిటీ సూచనలు చేసింది. అవి.. రియాక్టర్లు వినియోగించే ఫార్మా కంపెనీలు కచ్చితంగా రివర్స్ చార్జింగ్ మెకానిజమ్‌ని ఏర్పాటుచేసుకోవాలి. దీనివల్ల పొరపాటున మండే స్వభావం ఉన్న రసాయనాలు లీకైతే ఘన పదార్థాలు రియాక్టర్‌లోని మ్యాన్‌హోల్ ద్వారా పంపించి.. ఘన పదార్థంగా మార్చే అవకాశం ఉంటుంది.
» నిర్ధిష్ట రసాయనాల్ని అవసరమైన పరిమాణాల్లోనే నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలి. సాల్వెంట్స్ లోడింగ్ అన్‌లోడింగ్ చేసేందుకు కచ్చితంగా ఎర్త్ రైట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఫార్మా కంపెనీలో ఉన్న క్లోజ్డ్ రూమ్‌లలో ఫిక్స్‌డ్ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటుచేయాలి.
» ఫార్మా కంపెనీల్లో అన్ని ఎలక్ట్రికల్ ప్యానెల్‌లు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు దూరంగానే అమర్చుకోవాలి. ప్యానెల్ ప్రాంతానికి సమీపంలో సాల్వెంట్స్ నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
» సిబ్బంది వివరాలు ప్యానెల్ ప్రాంతానికి సమీపంలోనే ప్రదర్శించాలి. అక్కడ స్మోక్, హీట్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలి.
» ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏరియాల్లో ఆటోమేటిక్ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ అందుబాటులో ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment