Alarm clock
-
ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లు అత్యవసరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా ఫార్మా పరిశ్రమలు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్టర్లతో పాటు అలారం వ్యవస్థను తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ అభిప్రాయపడుతోంది. సాల్వెంట్ ట్యాంకర్ లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ మొత్తం పెట్రోల్ బంకుల తరహాలో ఎర్త్ రైట్ సిస్టమ్ ద్వారా నిర్వహించాలని కూడా స్పష్టంచేస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల పాటు విశాఖ అచ్యుతాపురం సెజ్, రాంకీ ఫార్మాలోని వివిధ యూనిట్లను పరిశీలించడంతో పాటు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సెజ్లల్లో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీలో భద్రతాపరమైన లోటుపాట్లు స్పష్టంగా ఉన్నట్లు ఈ ఉన్నతస్థాయి కమిటీ గుర్తించింది. మొత్తం ఏడు విభాగాలకు సంబంధించిన అంశాలతోనూ, ఫార్మా కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి త్వరలో అందజేయనుంది. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆగస్టు 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా.. 39 మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే. రెండ్రోజుల వ్యవధిలోనే పరవాడ సినర్జీస్ కంపెనీలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయి? ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనలు ఎలా కఠినతరం చెయ్యాలనే అంశాలపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా ఆధ్వర్యంలో హైలెవల్ కమిటి జిల్లాలోని సెజ్‌లలో పర్యటించింది. ప్రమాదం జరిగిన కంపెనీలతో పాటు సెజ్లని పరిశీలించింది. అనంతరం.. ఆయా విభాగాల అధికారులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు కోణాల్లో హైలెవల్ కమిటీ నివేదిక సిద్ధంచేసింది. ఒకటి.. జరిగిన ప్రమాదానికి గల కారణాలు, రెండు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మూడు.. పరిశ్రమలు అవలంబించాల్సిన అత్యాధునిక విధానాల్ని సూచిస్తూ సమగ్ర నివేదిక సిద్ధంచేసింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ౖఫైర్, డ్రగ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఏపీపీసీబీ, బాయిలర్స్ విభాగాల నుంచి సలహాలతో నివేదికని తయారుచేశారు.నివేదికలో ముఖ్యమైన అంశాలు» ప్రతి ఫార్మా పరిశ్రమ.. అడ్వాన్స్డ్ విధానాలు అవలంబించాలని హైలెవల్ కమిటీ సూచనలు చేసింది. అవి.. రియాక్టర్లు వినియోగించే ఫార్మా కంపెనీలు కచ్చితంగా రివర్స్ చార్జింగ్ మెకానిజమ్ని ఏర్పాటుచేసుకోవాలి. దీనివల్ల పొరపాటున మండే స్వభావం ఉన్న రసాయనాలు లీకైతే ఘన పదార్థాలు రియాక్టర్‌లోని మ్యాన్‌హోల్ ద్వారా పంపించి.. ఘన పదార్థంగా మార్చే అవకాశం ఉంటుంది.» నిర్ధిష్ట రసాయనాల్ని అవసరమైన పరిమాణాల్లోనే నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలి. సాల్వెంట్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసేందుకు కచ్చితంగా ఎర్త్ రైట్ సిస్టమ్‌ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఫార్మా కంపెనీలో ఉన్న క్లోజ్డ్ రూమ్‌లలో ఫిక్స్డ్ ఆక్సిజన్ మీటర్లు ఏర్పాటుచేయాలి.» ఫార్మా కంపెనీల్లో అన్ని ఎలక్ట్రికల్ ప్యానెల్లు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు దూరంగానే అమర్చుకోవాలి. ప్యానెల్ ప్రాంతానికి సమీపంలో సాల్వెంట్స్ నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి.» సిబ్బంది వివరాలు ప్యానెల్ ప్రాంతానికి సమీపంలోనే ప్రదర్శించాలి. అక్కడ స్మోక్, హీట్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలి.» ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏరియాల్లో ఆటోమేటిక్ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ అందుబాటులో ఉంచాలి. -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!
సరిగ్గా పొద్దున్నే ఏడు గంటలకు లేవానుకుని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. ఉదయం అది మోగగానే దాని పీకనొక్కేసి మళ్లీ దుప్పట్లో దూరిపోతున్నారా అయితే మీ మెదడును మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లేనని ఇటీవల వైద్యులు తేల్చి చెప్పారు. అలారాన్ని తాత్కాలికంగా ఆపేసి మరో 10 నిమిషాలు పడుకుందాంలే అనుకుని పడుకోవడం భ్రమ మాత్రమేనట. నిజానికి మన మెదడు అలారం మోతతో మెలకువకు సిద్ధమయ్యాక తిరిగి వెనక్కి వెళ్లడం నిద్రావస్థ సైకిల్‌కు భంగం చేకూరుస్తుందని, అదే ఆనాటి మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలా అలారం మోగగానే సినిమాల్లో లాగా దాని తలపైన ఒక్కటిచ్చి తిరిగి పడుకోవడం అలవాటుగా మారిందంటే దీర్ఘకాలంలో దాని దుష్ఫలితాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ఖాయమంటున్నారు వైద్యులు. ఉత్సాహాన్ని ఊదేసే స్లీప్ ఇనర్షియా.. నిద్రలేమి బీపీ, జ్ఞాపక శక్తి తగ్గడం తదితర అనేక శారీరక, మానసిక ఆనారోగ్యాలకు కారణమౌతుంది. కంటినిండా నిద్రపోతే మరునాడు మీలో ఉత్సాహం పొంగిపొర్లుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అదే నిద్రనుంచి మేల్కొనడానికి అలారం పెట్టుకొని దాన్ని తాత్కాలికంగా ఆపేసి, తిరిగి ముడుచుకొని పడుకుందామనుకుంటే మాత్రం అది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల నిద్రాభంగం అవుతుందే తప్ప తిరిగి నిద్రలోకి జారుకోవడం అంటూ ఉండదని స్లీప్ ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. అలారాన్ని ఆపేసి పడుకోవడంతో మీ శరీరం, మీ మెదడు పడుకోవాలో, మేల్కోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్తుందట దాన్నే నిద్రలో నిద్ర (స్లీప్ ఇనర్షియా) అంటారు. ఈ స్థితి రోజంతా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిద్ర మేల్కోవడానికి ఆ పదినిముషాలూ బద్ధకించడం వల్ల ఉత్సాహానికి బదులు ఆ రోజంతా బద్ధకాన్ని కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిద్రలో రెండు దశలు మన నిద్ర రెండు భాగాలుగా ఉంటుంది. తొలి పార్శ్వం కనుగుడ్లు కదలకుండా(నాన్రాపిడ్ ఐ) ఉండే నిద్ర. రెండవ భాగం కనుగుడ్లు వేగంగా కదిలుతుండే (రాపిడ్ ఐ) నిద్ర. కనుగుడ్లు కదలకుండా ఉండే నిద్ర నుంచి కనుగుడ్లు కదిలే నిద్ర రెండూ రాత్రంతా ఒక సైకిల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే నిద్రపట్టిన వెంటనే వచ్చే స్థితిలో కనుగుడ్ల కదలిక ఉండదు. ఇది దీర్ఘ నిద్రను సూచిస్తుంది. ఆ తరువాత వచ్చే నిద్రావస్థలో మాత్రం కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. ఇది మెలకువ స్థితిలో ఉండే నిద్ర. మంచి నిద్రపట్టడం అంటే ఈ లయబద్ధమైన నిద్రావస్థకి భంగం వాటిల్లలేదని అర్థం. అలాకాకుండా మెలకువకోసం పెట్టుకున్న అలారం మోగిన వెంటనే లేవకుండా తిరిగి నిద్రపోవడం శారీరక మానసిక సహజక్రియని అడ్డుకుంటున్నట్లే. -
లేచి నిల్చుంటేనే కూత ఆగుతుంది!
ఈ ఏడాదైనా పొదుపొద్దున్నే లేచి వాకింగో, రన్నింగో, జాగింగో లేకపోతే జిమ్మింగో చేసేస్తానంటూ చాలా మంది కొత్తసంవత్సర శపథాలు చేస్తుంటారు. రాత్రికి రాత్రి అలారమ్ పెట్టేసుకొని పొద్దున్న అది మోగగానే ఒక్క నొక్కు నొక్కి హాయిగా కునుకు కంటిన్యూ చేస్తారు. తిరిగి లేచాక అరే.. ఈ రోజూ లేవలేకపోయామే అని బాధపడిపోతుంటారు. అలాంటి వారికోసమే ఓ కొత్త గ్యాడ్జెట్ రూపుదిద్దుకుంది. పేరు ‘రగ్గీ’. 15.5x23.5 సైజులో ఉండబోయే ఈ వెల్కమ్ మ్యాట్‌లో అలారమ్ క్లాక్ ఇమిడి ఉంటుంది. అది ఉదయం మోగడం మొదలు పెట్టాక మీరు లేచి దానిపై కాసేపు నిల్చుంటేకానీ ఆగదు. దానికి స్నూజ్ బటన్ కూడా ఉండదు. నచ్చిన పాటను కూడా యూఎస్బీ ద్వారా అలారమ్‌గా పెట్టుకునే ఆప్షన్ ఉంది. మూడు ఏఏ బ్యాటరీలు వేస్తే ఏడాది వరకు చూసుకోనక్కర్లేదు. టామ్ అనే వ్యక్తి రూపొందించిన ఈ అలారమ్ మ్యాట్.. ‘కిక్‌స్టార్టర్’ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే 70 వేల అమెరికా డాలర్ల వరకు ఫండింగ్ పొందింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరులో ఇది మార్కెట్లోకి రావచ్చు. -
వామ్మో...అలారం
-
వామ్మో...అలారం
స్వీడన్: పొద్దున్నే మర్చిపోకుండా నిద్ర లేవాలంటే ఎవరైనా ఏం చేస్తాం.. అలారం పెట్టుకుంటాం. అయనా ఠంచన్ గా అలారం మోగినా లేవడానికి బద్దకించేవాళ్లు చాలామందే ఉన్నారు. అంతేకాదు దాని నెత్తిమీద ఒకటి మొట్టి మరీ మళ్లీ ముసుగు తన్ని పడుకోవడం కూడా కామనే... అవునా.. కాని ఇపుడు ఓ అలారం ఆ పప్పులేవీ ఉడకవు అంటోంది. పాఠం అప్పచెప్పకపోతే బెత్తం తీసుకుని వాయించే టీచర్ లా.. లేచే దాకా మొఖం మీద ఫెడీ. ఫెడీ వాయిస్తూనే ఉంటానంటోంది. ఎంతటి కుంభకర్ణులకైనా దెబ్బకు దెయ్యం అదేనండి..నిద్ర పారిపోవాల్సిందే అంటోంది. దీనికి సంబంధించి స్వీడిస్ మహిళ విడుదల చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వేకప్ అలారాన్ని చూసిన నెటిజన్లు, ఇదేమీ అలారం రా బాబూ అనుకుంటూనే లైక్ ల మీద కొడుతూ, వేల కొద్దీ షేర్ లు చేస్తున్నారట.