హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా ఫార్మా దిగుమతుల్లో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ వాటా 63 శాతముంది. ఇందులో 70 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్. ఏ ముడి పదార్థం తీసుకున్నా దీని కోసం ఖచ్చితంగా చైనాపై భారత్ ఆధారపడి ఉంది. ఈ స్థాయిలో ఒక దేశంపై ఆధారపడడం శ్రేయస్కరం కాదని భారత ఔషధ పరిశ్రమ ఎన్నాళ్లనుంచో చెబుతూ వస్తోంది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాలని విన్నవిస్తోంది. ఇదే జరిగితే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి ముడి పదార్థాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
నాలుగైదేళ్లలో సాధించవచ్చు..
ఫార్మా ముడి పదార్థాల విషయంలో భారత్ స్వావలంబన సాధ్యమేనని పరిశ్రమ చెబుతోంది. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వస్తే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తామని బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ఈడీ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఉన్నఫలంగా చైనా నుంచి ముడిపదార్థాల దిగుమతులను ఆపేయలేము. క్రమంగా దేశీయంగా వీటి తయారీని పెంచుకుంటూ పోవాలి. ఇక ఏపీఐ, ఇంటర్మీడియేట్స్ తయారీ ప్రక్రియలో ఉప పదార్థాలు వస్తాయి. ఇవి సద్వినియోగం అయితేనే తయారీదారుకు ప్రయోజనం. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత్‌లో ఉత్పత్తి వ్యయం చైనాతో పోలిస్తే 20–25 శాతం అధికంగా ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. టెక్నికల్ ఇన్నోవేషన్ పెద్ద ఎత్తున జరగాలి’ అని వెల్లడించారు. కాగా, రూ.3,000 కోట్లతో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి ఊతం ఇచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,940 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.
కొత్త మార్కెట్ల నుంచి...
చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు కొన్ని రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్‌ను యూఎస్, ఇటలీ, సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి దిగుమతి చేసుకునే విషయమై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చైనాతో తలెత్తిన వివాదం నేపథ్యమూ ఇతర దేశాలవైపు దృష్టిసారించేందుకు మరో కారణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. ఏ దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవచ్చో అన్న అంశంపై ఐపీఏ ఇప్పటికే ఓ అధ్యయనం చేపట్టిందని ఆయన చెప్పారు. కొత్త దేశాల నుంచి దిగుమతులు వెంటనే చేపట్టి, మధ్య, దీర్ఘకాలంలో దేశీయంగా సామర్థ్యం పెంచుకోవాలన్న సరైన విధానం భారత్ ఎంచుకుందని అన్నారు. సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో దేశీయంగా ఉన్న 1,500–1,600 ఏపీఐ యూనిట్లు బలోపేతం అవుతాయని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ అశోక్ మదన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment