న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి దేశీ ఫార్మా సంస్థలకు వచ్చే ఆదాయం ఒక మోస్తరుగానే వృద్ధి చెందనుంది. అక్కడి మార్కెట్లో ఔషధాల ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొనడమే ఇందుకు కారణం కానుంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలు ప్రకటించింది. తాము పరిశీలించిన ఎనిమిది దిగ్గజ ఫార్మా కంపెనీలకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చే ఆదాయాలు 0.2 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది.
ఉత్పత్తుల ధరలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి–కనిష్ట టీన్స్ (రెండంకెల) స్థాయిలో పడిపోవడం ఇందుకు కారణమని వివరించింది. గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో రేట్ల పతనం కొనసాగడం వల్ల సమీప భవిష్యత్తులోనూ ఆదాయాలపై ఒత్తిడి నెలకొనవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి భారతీయ ఫార్మా కంపెనీలకు వచ్చే ఆదాయాలు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు.
ఇతర వ్యయాల భారం..
ముడి వస్తువుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా వ్యయాలు భారీగా పెరగడం .. సరఫరాపరమైన అవాంతరాలు మొదలైన అంశాల కారణంగా మార్జిన్లపై పడే ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాలకు అనుమతుల ప్రక్రియ వేగం మందగించిందని, 2022 ఆర్థిక సంవత్సరంలో ధరలపరమైన ఒత్తిళ్లు ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపాయని వివరించింది.
అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ మళ్లీ ప్లాంట్ల తనిఖీలను మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో భారతీయ ఫార్మా కంపెనీలు చెప్పుకోతగ్గ స్థాయిలో చెల్లించి, లిటిగేషన్లను సెటిల్ చేసుకుంటూ ఉండటం కూడా వాటి ఆదాయాలపై ప్రభావం చూపుతోందని ఇక్రా వివరించింది. ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) మొదలైనవి తరచుగా నిఘా పెట్టే రిస్కులు భారత ఫార్మా కంపెనీలకు ఉన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment