Generic
-
అమెరికాలో ఒత్తిళ్లు.. దేశీ ఫార్మాకు ధరల కష్టాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి దేశీ ఫార్మా సంస్థలకు వచ్చే ఆదాయం ఒక మోస్తరుగానే వృద్ధి చెందనుంది. అక్కడి మార్కెట్లో ఔషధాల ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొనడమే ఇందుకు కారణం కానుంది. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలు ప్రకటించింది. తాము పరిశీలించిన ఎనిమిది దిగ్గజ ఫార్మా కంపెనీలకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి వచ్చే ఆదాయాలు 0.2 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ఉత్పత్తుల ధరలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి–కనిష్ట టీన్స్ (రెండంకెల) స్థాయిలో పడిపోవడం ఇందుకు కారణమని వివరించింది. గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో రేట్ల పతనం కొనసాగడం వల్ల సమీప భవిష్యత్తులోనూ ఆదాయాలపై ఒత్తిడి నెలకొనవచ్చని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కింజల్ షా తెలిపారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికా జనరిక్స్ మార్కెట్ నుంచి భారతీయ ఫార్మా కంపెనీలకు వచ్చే ఆదాయాలు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. ఇతర వ్యయాల భారం.. ముడి వస్తువుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా వ్యయాలు భారీగా పెరగడం .. సరఫరాపరమైన అవాంతరాలు మొదలైన అంశాల కారణంగా మార్జిన్లపై పడే ప్రభావాన్ని కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఔషధాలకు అనుమతుల ప్రక్రియ వేగం మందగించిందని, 2022 ఆర్థిక సంవత్సరంలో ధరలపరమైన ఒత్తిళ్లు ఫార్మా కంపెనీల ఆదాయంపై ప్రభావం చూపాయని వివరించింది. అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ మళ్లీ ప్లాంట్ల తనిఖీలను మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈమధ్య కాలంలో భారతీయ ఫార్మా కంపెనీలు చెప్పుకోతగ్గ స్థాయిలో చెల్లించి, లిటిగేషన్లను సెటిల్ చేసుకుంటూ ఉండటం కూడా వాటి ఆదాయాలపై ప్రభావం చూపుతోందని ఇక్రా వివరించింది. ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) మొదలైనవి తరచుగా నిఘా పెట్టే రిస్కులు భారత ఫార్మా కంపెనీలకు ఉన్నట్లు పేర్కొంది. -
రతన్ టాటా పక్కన ఈ వ్యాపారవేత్త ఎవరంటే..
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా తాజా పెట్టుబడులు ఆసక్తికరంగా నిలిచాయి. ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయన వెల్లడించలేదు. ముంబైలోని యువ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్ దేశ్‌పాండే (18)కు చెందిన ‘జనరిక్ ఆధార్'లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది. ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో వుంది. అలాగే రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు త్వరలోనే ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తోంది. (రిలయన్స్ దన్ను, భారీ లాభాలు) కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన తరువాత జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు సరసమైన ధరలకు మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నానన్నారు. కాగా అర్జున్ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే షార్ట్ లిస్ట్ కావడం విశేషం. చదవండి : మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన -
జనరిక్.. జనానికి దూరం!
–చౌకగా మందులు లభిస్తున్నా ఆదరణ కరువు –అవగాహన కల్పించని వెలుగు సిబ్బంది –మూతదిశగా ‘అన్న సంజీవని’ దుకాణాలు కర్నూలు(హాస్పిటల్): అన్న సంజీవని(జెనరిక్ మందులు) దుకాణాలు ఆపదలో ఉన్నాయి. చవకగా లభించే జనరిక్ మందుల గురించి ప్రజలకు తెలియకపోడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువవుతున్నారు. చాలా మంది వైద్యులు అన్న సంజీవని ఔషదిపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు వెలుగు సిబ్బంది సరైన ప్రచారం కల్పించకపోవడంతో జిల్లాలో చాలా చోట్ల ఇవి మూతపడే స్థితికి చేరుకున్నాయి. మొదట్లో వీటిని మండల మహిళా సమాఖ్యలు నిర్వహించినా, నష్టాల్లో ఉండటంతో అందులోని సభ్యులతో నిర్వహిస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. నష్టాల్లో దుకాణాలు.. జిల్లాలో డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ప్యాపిలి, బేతంచర్ల, కోడుమూరు, పత్తికొండ, ఆలూరులలో అన్న సంజీవని దుకాణాలు ఉన్నాయి. ఇవేగాక మెప్మా ఆధ్వర్యంలోనూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు, నంద్యాల, ఆదోని, నందికొట్కూరులలో మరో మూడు దుకాణాలు ఏర్పాటు చేశారు. మెప్మా ఆధ్వర్యంలోని దుకాణాలు కాస్త మెరుగ్గా పనిచేస్తున్నా డీఆర్డీఏ ఆద్వర్యంలో నడిచేవి చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసిన మండల మహిళా సమాఖ్య, పొదుపు సంఘాల మహిళలకు మందులపై అవగాహన లేకపోవడం, మందుల కొనుగోళ్లు, అమ్మకాలపై అక్కడ పనిచేసే ఫార్మాసిస్టులకు తెలియకపోవడం కూడా నష్టాలు రావడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇక స్థానిక వైద్యులు సహకరించకపోవడంతో ఇవి మూతదశకు చేరుకున్నాయి. ఇదీ దుకాణాల పరిస్థితి... –కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు దుకాణాలు పట్టణ మహిళా సమాఖ్యలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో అధిక శాతం బ్రాండెడ్ జనరిక్స్‌కు బదులు ప్రాపగండ మందులు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా రోగులకు మరింత చవకగా లభించాల్సిన మందులు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. – ప్యాపిలిలోని దుకాణం ఊరి చివర ఉంది. దీంతో ఇది ఆదరణకు నోచుకోలేదు. బేతంచర్లలో పాతబస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణం మాత్రం ఫరవాలేదనిపిస్తోంది. –కోడుమూరులో ఏర్పాటు చేసిన దుకాణంలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. –ఆలూరులో ఏర్పాటు చేసిన అన్న సంజీవని బాగానే నడుస్తోంది –పత్తికొండలోని దుకాణం పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు రూ.500ల నుంచి రూ.1000లు కూడా వ్యాపారం జరగని పరిస్థితి. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం అన్న సంజీవనిపై ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాం. ర్యాలీలతోపాటు, కరపత్రాలు పంపిణీ చేశాం. అన్న సంజీవని దుకాణాల్లో మందులు నాణ్యమైనవి, చవకగా లభిస్తాయి. స్థానిక వైద్యులు ప్రజలకు అవగాహన పెంచాలి. –నర్సమ్మ, అన్న సంజీవని ఇన్‌ఛార్జి -
బ్రాండ్స్ వైపు ఫార్మా చూపు..
♦ గడిచిన నాలుగు నెలల్లో మూడు డీల్స్ ♦ జాబితాలో సన్, స్ట్రైడ్స్, పిరమాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా విదేశాల్లో విస్తరణ కోసం కంపెనీల కొనుగోలు లేదా జనరిక్స్ మార్గాన్ని ఎంచుకునే దేశీ ఫార్మా కంపెనీలు ప్రస్తుతం రూటు మారుస్తున్నాయి. పేరొందిన ఔషధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ మొదలుకుని ఇటీవలి సన్ ఫార్మా, స్ట్రైడ్స్ షసన్ దాకా చాలా మటుకు దేశీ సంస్థలు గత కొన్నాళ్లుగా ఈ తరహా డీల్స్ కుదుర్చుకున్నాయి. ఫార్మా దిగ్గజం సన్ .. స్విట్జర్లాండ్ ఫార్మా సంస్థ నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. దీని విలువ దాదాపు రూ. 1,900 కోట్లు (సుమారు 293 మిలియన్ డాలర్లు). వివిధ చికిత్సల్లో ఉపయోగపడే ఈ బ్రాండ్స్ అన్నింటి వార్షికాదాయాలు 160 మిలియన్ డాలర్ల పైచిలుకు ఉంటాయి. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద ఔషధ మార్కెట్ కావడంతో పాటు అత్యధికంగా నియంత్రణలు కూడా ఉండే జపాన్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి సన్ ఫార్మాకు ఈ డీల్ ఉపయోగపడనుంది. జపాన్ ఔషధ మార్కెట్ ఏకంగా 73 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని అంచనా. 1 లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో జపాన్‌కు దాదాపు 7 శాతం వాటా ఉంటుంది. ఇక మరోవైపు, స్వీడన్‌కు చెందిన మోబర్గ్ ఫార్మా నుంచి స్ట్రైడ్స్ షసన్ .. జాయింట్ఫ్లెక్స్, ఫెర్గాన్, వ్యాంక్విష్ అనే మూడు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇందుకోసం 10.4 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మోబర్గ్ బ్రాండ్ల కొనుగోలు.. అమెరికా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాల్లో ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) ఔషధాల విభాగంలో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తోడ్పడగలదని స్ట్రైడ్స్ పేర్కొంది. దేశీయంగాను.. ఇలా కొన్ని ఫార్మా సంస్థలు విదేశీ మార్కెట్‌పై కసరత్తు చేస్తుండగా.. మరికొన్ని సంస్థలు దేశీయంగాను బ్రాండ్ల కొనుగోలుపై దృష్టి పెట్టాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కొన్నాళ్ల క్రితం బెల్జియం బయోఫార్మా సంస్థ యూసీబీ ఎస్ఏకి చెందిన కొన్ని ఉత్పత్తులను దాదాపు రూ. 800 కోట్లకు కొనుగోలు చేసింది. వాటిని భారత్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో విక్రయించే హక్కులను దక్కించుకుంది. అటారాక్స్, జెర్టైక్, జైజాల్ వంటివి వీటిలో ఉన్నాయి. డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇవి తోడ్పడగలవని డాక్టర్ రెడ్డీస్ వర్గాలు పేర్కొన్నాయి. అంతక్రితమే నొవార్టిస్ నుంచి హాబిట్రోల్ అనే ఓటీసీ బ్రాండ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కొనుగోలు చేసింది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ గతేడాది డిసెంబర్లో ఎంఎస్డీ సంస్థ నుంచి అయిదు బ్రాండ్స్‌ను (న్యాచురోలాక్స్, ల్యాక్టోబాసిల్ మొదలైనవి) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 92 కోట్లు. దేశీయంగా పేరొందిన ఈ బ్రాండ్స్‌ను ఓటీసీ మార్గంలో విక్రయించాలన్నది పిరమాల్ యోచన. భారత ఓటీసీ మార్కెట్ రూ. 15,000 కోట్లు కాగా ఏటా 14 శాతం మేర వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం పిరమాల్‌కి చెందిన ఆరు బ్రాండ్లు టాప్ 100 ఓటీసీల్లో ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఎనిమిదికి చేరింది. అంతకు ముందే బేబీకేర్ బ్రాండ్ లిటిల్స్ను కూడా పిరమాల్ కొనుగోలు చేసింది.