హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు జూన్‌లో 19 శాతం దూసుకెళ్లి 2,75,788 యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగుపడడం ఈ వృద్ధికి కారణమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది.
ద్విచక్ర వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 10.6 లక్షల నుంచి 13.08 లక్షల యూనిట్లకు చేరింది. త్రిచక్ర వాహనాలు సుమారు మూడురెట్లు ఎగసి 26,701 యూనిట్లుగా ఉంది. అన్ని విభాగాల్లో కలిపి 13.01 లక్షల నుంచి 16.11 లక్షల యూనిట్లకు పెరిగింది. ఏప్రిల్–జూన్‌లో ప్యాసింజర్ వాహనాలు 41 శాతం పెరిగి 9.1 లక్షల యూనిట్లకు ఎగసింది.
వాణిజ్య వాహనాలు 1.05 లక్షల నుంచి 2.24 లక్షల యూనిట్లకు చేరింది. ద్విచక్ర వాహనాలు 24.13 లక్షల నుంచి 37.24 లక్షల యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 24,522 నుంచి 76,293 యూనిట్లకు చేరాయి. అన్ని విభాగాల్లో కలిపి జూన్ త్రైమాసికంలో 31.9 లక్షల నుంచి 49.3 లక్షల యూనిట్లకు పెరిగాయి.
రెండింతలైన పోర్ష్ అమ్మకాలు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న పోర్ష్ ఈ ఏడాది జనవరి–జూన్‌లో భారత్‌లో 378 యూనిట్లు విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా వృద్ధి. ఖరీదైన స్పోర్ట్స్ కార్ల డిమాండ్‌తో పరిశ్రమ కోలుకుంటోందని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2021లో భారత్‌లో 474 పోర్ష్ కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటి వరకు సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే.
Comments
Please login to add a commentAdd a comment