న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ల కొరత వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతినడంతో నవంబర్‌లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 19 శాతం క్షీణించాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించింది.
సియామ్ గణాంకాల ప్రకారం గత నెల డీలర్లకు కార్ల వంటి ప్యాసింజర్ వాహనాల సరఫరా 2,15,626కి పరిమితమైంది. గతేడాది నవంబర్‌లో నమోదైన 2,64,898 యూనిట్లతో పోలిస్తే 19 శాతం క్షీణించింది. అటు ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 34 శాతం పడిపోయాయి. 16,00,379 యూనిట్ల నుంచి 10,50,616 యూనిట్లకు తగ్గాయి. మోటర్‌సైకిళ్ల అమ్మకాలు 10,26,705 నుంచి 6,99,949 యూనిట్లకు పడిపోయాయి. స్కూటర్ల విక్రయాలు 5,02,561 యూనిట్ల నుంచి 3,06,899 యూనిట్లకు క్షీణించాయి. ఇక మొత్తం త్రిచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం క్షీణించి 24,071 యూనిట్ల నుంచి 22,471 యూనిట్లకు పరిమితమయ్యాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలు గత నెల 12,88,759 యూనిట్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో ఇవి 18,89,348 యూనిట్లుగా నమోదయ్యాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 1,35,775 యూనిట్ల నుంచి 1,09,726 యూనిట్లకు పడిపోయాయి. అలాగే హ్యుందాయ్ మోటర్ ఇండియా విక్రయాలు 48,800 నుంచి 37,001 యూనిట్లకు క్షీణించాయి.
7 ఏళ్ల కనిష్టానికి పీవీ విక్రయాలు..
‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌లో కొంతయినా కోలుకోవచ్చని ఆశించింది కానీ ఈ ఏడాది నవంబర్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 ఏళ్లు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టాలకు క్షీణించాయి‘ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే, సరఫరా వ్యవస్థపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment