కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన తరువాత చాలా దేశాలు సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' స్వదేశీ సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు నిజం కాబోతోంది.
భారతదేశంలో సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేస్తే.. మన దేశం చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. రతన్ టాటా అనుకున్న విధంగానే చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మోరిగావ్ జిల్లాలోని జాగిరోడ్‌లో ప్లాంట్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమక్షంలో జరిగింది.
అస్సాంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ. 27 వేలకోట్లు ఖర్చవుతుందని సమాచారం. నిర్మాణం పూర్తయిన తరువాత సుమారు 27000 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. సెమీకండక్టర్ తయారీలో అగ్రగామిగా ఉన్న చైనా మీద.. భారత్ ఆధారపడటం తగ్గుతుంది. దీనికోసం టాటా కంపెనీ కోట్లాది సెమీకండక్టర్లను తయారు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో భారత్ సెమికండక్టర్ చిప్ ఎగుమతిదారుగా కూడా నిలిచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!
టాటా సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ 2025 నాటికి సిద్ధమవుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. 2024 ఫిబ్రవరి 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన ఐదు నెలల వ్యవధిలోనే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment