
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మాతృ సంస్థ ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌లో వాటాల కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఈ జాబితాలో టెక్ టైకూన్ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్ ఫ్యామిలీ ఆఫీస్, 360 వన్ అసెట్ చేరాయి.
ఆకాశ ఎయిర్ దేశీయంగా ప్యాసింజర్, కార్గో రవాణా సర్వీసులందిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న 360 వన్ ఆల్టర్నేట్స్ అసెట్ మేనేజ్‌మెంట్ ద్వారా పీఐవోఎఫ్(ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ), పీఐ ఎగ్జిక్యూటివ్స్, క్లేపాండ్(పాయ్ కుటుంబ సంస్థ), 360 ఫండ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు సీసీఐ పేర్కొంది. భారీ వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా అజీమ్ ప్రేమ్‌జీతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల కన్సార్షియంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకాశ ఎయిర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..
మరోవైపు ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌లో 45.97 శాతం వాటాను కలిగిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కుటుంబం సైతం అదనపు పెట్టుబడులు అందించేందుకు అంగీకరించింది. సంస్థ సీఈవో, వ్యవస్థాపకులలో ఒకరైన వినయ్ దూబే వాటా 16.13 శాతంకాగా.. సోదరులు సంజయ్, నీరజ్ విడిగా 7.59 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా మాధవ్ భట్కులీకి 9.41 శాతం, పీఏఆర్ క్యాపిటల్ వెంచర్స్ ఎల్‌ఎల్‌సీకి 6.37 శాతం చొప్పున వాటా ఉంది. అయితే ఇతర సంస్థలు కొత్తగా ఇన్వెస్ట్ చేయనున్న నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌లో ప్రస్తుత వాటాదారుల వాటాలు దిగిరానున్నాయి.