Wipro Acquisition
-
ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులకు అనుమతి
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ మాతృ సంస్థ ఎస్ఎన్వీ ఏవియేషన్‌లో వాటాల కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఈ జాబితాలో టెక్ టైకూన్ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్ ఫ్యామిలీ ఆఫీస్, 360 వన్ అసెట్ చేరాయి.ఆకాశ ఎయిర్ దేశీయంగా ప్యాసింజర్, కార్గో రవాణా సర్వీసులందిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న 360 వన్ ఆల్టర్నేట్స్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా పీఐవోఎఫ్(ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థ), పీఐ ఎగ్జిక్యూటివ్స్, క్లేపాండ్(పాయ్ కుటుంబ సంస్థ), 360 ఫండ్ వాటాలను సొంతం చేసుకోనున్నట్లు సీసీఐ పేర్కొంది. భారీ వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా అజీమ్ ప్రేమ్జీతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల కన్సార్షియంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆకాశ ఎయిర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..మరోవైపు ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌లో 45.97 శాతం వాటాను కలిగిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కుటుంబం సైతం అదనపు పెట్టుబడులు అందించేందుకు అంగీకరించింది. సంస్థ సీఈవో, వ్యవస్థాపకులలో ఒకరైన వినయ్ దూబే వాటా 16.13 శాతంకాగా.. సోదరులు సంజయ్, నీరజ్ విడిగా 7.59 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా మాధవ్ భట్కులీకి 9.41 శాతం, పీఏఆర్ క్యాపిటల్ వెంచర్స్ ఎల్ఎల్సీకి 6.37 శాతం చొప్పున వాటా ఉంది. అయితే ఇతర సంస్థలు కొత్తగా ఇన్వెస్ట్ చేయనున్న నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌లో ప్రస్తుత వాటాదారుల వాటాలు దిగిరానున్నాయి. -
విప్రో కన్సూమర్ చేతికి స్లా్పష్ కార్పొరేషన్
బెంగళూరు: విప్రో కన్సూమర్ కేర్(డబ్ల్యూసీసీ) కంపెనీ, ఫిలిప్పైన్స్కు చెందిన పర్సనల్ కేర్ సంస్థ, స్లా్పష్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని విప్రో కన్సూమర్ కేర్ వెల్లడించింది. తమ కంపెనీ కొనుగోలు చేస్తున్న 11వ కంపెనీ ఇదని డబ్ల్యూసీసీ సీఈఓ వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఆయన వెల్లడించలేదు. స్లా్పష్ కార్పొరేషన్ మధ్య ఆసియా దేశాలతో పాటు థాయ్‌ల్యాండ్, మలేసియా, హాంకాంగ్, వియత్నాం, నైజీరియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని అగర్వాల్ తెలిపారు. ఆసియాలోనే మూడో అతి పెద్ద పర్సనల్ కేర్ సంస్థగా అవతరించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఈ కంపెనీ కొనుగోలుతో ఫిలిప్పైన్స్ దేశంలో పర్సనల్ కేర్ విభాగంలో అగ్రస్థాయి కంపెనీగా అవతరిస్తామని పేర్కొన్నారు. స్లా్పష్ కంపెనీ ఆదాయం 8 కోట్ల డాలర్లని తెలిపారు. -
కెనడా కంపెనీతో విప్రో రూ. 6,600 కోట్ల డీల్
బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... కెనడాకు చెందిన ఆట్కో గ్రూప్‌తో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ద్వంద్వ ఒప్పందం మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లు(సుమారు రూ.6,600 కోట్లు)గా అంచనా. ఇందులో భాగంగా ఆట్కో సంస్థకు విప్రో పదేళ్లపాటు పూర్తిస్థాయి అవుట్సోర్సింగ్ సేవలను అందించనుంది. మరోపక్క ఆట్కో ఐటీ అనుబంధ సంస్థ(ఆట్కో ఐ-టెక్)ను ఈ బెంగళూరు దిగ్గజం కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు చెల్లింపు విధానంలో 21 కోట్ల కెనడా డాలర్ల(సుమారు రూ.1,176 కోట్లు)ను ఇందుకోసం వెచ్చించనుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో ఈ కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఆట్కోతో శుక్రవారం ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు విప్రో వెల్లడించింది. ఏటా రూ.675 కోట్ల ఆదాయం... కెనడాలోని అల్బెర్టా ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆట్కో గ్రూప్ ఆ దేశంలో పేరొందిన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటి. ఈ గ్రూప్ విలువ 16 బిలియన్ డాలర్లుగా అంచనా. సుమారు 9,800 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరుకు రవాణా(లాజిస్టిక్స్), యుటిలిటీస్, ఇంధన, టెక్నాలజీ, స్ట్రక్చర్స్ తదితర రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం.. ఆట్కో గ్రూప్‌నకు కెనడా, ఆస్ట్రేలియాల్లో మౌలికసదుపాయాల నిర్వహణ, అప్లికేషన్ల అభివృద్ధి, మెయింటెనన్స్ వంటి పనులను అవుట్సోర్సింగ్ ద్వారా 2024 డిసెంబర్ వరకూ విప్రో అందించనుంది. ‘ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు వల్ల మా కంపెనీకి ఏటా 12 కోట్ల కెనడా డాలర్ల(దాదాపు రూ.675 కోట్లు)కుపైగా ఆదాయం లభించే అవకాశం ఉంది. యూరప్‌లోని యుటిలిటీ విభాగంలో పటిష్టంగా ఉన్నాం. తాజా డీల్‌లో కెనడా, ఆస్ట్రేలియాల్లో మా వ్యాపారం మరింత పుంజుకోనుంది’ అని విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఇంధన, సహజవనరులు, యుటిలిటీ సేవల విభాగం) ఆనంద్ పద్మనాభన్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం ఆట్కోకు చెందిన సుమారు 500 మంది కెనడా ఉద్యోగులు, 50 మంది ఆస్ట్రేలియా సిబ్బంది విప్రోకు బదలీకానున్నారు. అదేవిధంగా ఆట్కో ఐ-టెక్కు చెందిన షేర్లతోపాటు ఆ సంస్థకు చెందిన కాంట్రాక్టులు, ఉద్యోగులు(సుమారు 700 మంది), ఆస్ట్రేలియాలోఉన్న ఆస్తులు కూడా విప్రోపరం కానున్నాయి. కెనడా, ఆస్ట్రేలియాల్లో విప్రో విస్తరణకు ఈ డీల్ ఒక చోధకంగా పనిచేయనుందని ఆట్కో కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి.