కెనడా కంపెనీతో విప్రో రూ. 6,600 కోట్ల డీల్ | Wipro inks $1.1bn deal with ATCO; acquires IT arm for $195 mn | Sakshi
Sakshi News home page

కెనడా కంపెనీతో విప్రో రూ. 6,600 కోట్ల డీల్

Published Sat, Jul 19 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

కెనడా కంపెనీతో విప్రో రూ. 6,600 కోట్ల డీల్

కెనడా కంపెనీతో విప్రో రూ. 6,600 కోట్ల డీల్

బెంగళూరు: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... కెనడాకు చెందిన ఆట్కో గ్రూప్‌తో భారీ డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ద్వంద్వ ఒప్పందం మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లు(సుమారు రూ.6,600 కోట్లు)గా అంచనా. ఇందులో భాగంగా ఆట్కో సంస్థకు విప్రో  పదేళ్లపాటు పూర్తిస్థాయి అవుట్‌సోర్సింగ్ సేవలను అందించనుంది.

మరోపక్క ఆట్కో ఐటీ అనుబంధ సంస్థ(ఆట్కో ఐ-టెక్)ను ఈ బెంగళూరు దిగ్గజం కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు చెల్లింపు విధానంలో 21 కోట్ల కెనడా డాలర్ల(సుమారు రూ.1,176 కోట్లు)ను ఇందుకోసం వెచ్చించనుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో ఈ కొనుగోలు పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఆట్కోతో శుక్రవారం ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు విప్రో వెల్లడించింది.

 ఏటా రూ.675 కోట్ల ఆదాయం...
 కెనడాలోని అల్బెర్టా ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆట్కో గ్రూప్ ఆ దేశంలో పేరొందిన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటి. ఈ గ్రూప్ విలువ 16 బిలియన్ డాలర్లుగా అంచనా. సుమారు 9,800 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సరుకు రవాణా(లాజిస్టిక్స్), యుటిలిటీస్, ఇంధన, టెక్నాలజీ, స్ట్రక్చర్స్ తదితర రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది.

 తాజా ఒప్పందం ప్రకారం.. ఆట్కో గ్రూప్‌నకు కెనడా, ఆస్ట్రేలియాల్లో మౌలికసదుపాయాల నిర్వహణ, అప్లికేషన్‌ల అభివృద్ధి, మెయింటెనన్స్ వంటి పనులను అవుట్‌సోర్సింగ్ ద్వారా 2024 డిసెంబర్ వరకూ విప్రో అందించనుంది. ‘ఈ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు వల్ల మా కంపెనీకి ఏటా 12 కోట్ల కెనడా డాలర్ల(దాదాపు రూ.675 కోట్లు)కుపైగా ఆదాయం లభించే అవకాశం ఉంది. యూరప్‌లోని యుటిలిటీ  విభాగంలో పటిష్టంగా ఉన్నాం. తాజా డీల్‌లో కెనడా, ఆస్ట్రేలియాల్లో మా వ్యాపారం మరింత పుంజుకోనుంది’ అని విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఇంధన, సహజవనరులు, యుటిలిటీ సేవల విభాగం) ఆనంద్ పద్మనాభన్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

 కాగా, ఈ ఒప్పందం ప్రకారం ఆట్కోకు చెందిన సుమారు 500 మంది కెనడా ఉద్యోగులు, 50 మంది ఆస్ట్రేలియా సిబ్బంది విప్రోకు బదలీకానున్నారు. అదేవిధంగా ఆట్కో ఐ-టెక్‌కు చెందిన షేర్లతోపాటు ఆ సంస్థకు చెందిన కాంట్రాక్టులు, ఉద్యోగులు(సుమారు 700 మంది), ఆస్ట్రేలియాలోఉన్న ఆస్తులు కూడా విప్రోపరం కానున్నాయి. కెనడా, ఆస్ట్రేలియాల్లో విప్రో విస్తరణకు ఈ డీల్ ఒక చోధకంగా పనిచేయనుందని ఆట్కో కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

Advertisement
Advertisement