
సిమ్ కార్డులు కావాలంటే ఇకపై రిటైల్ స్టోర్, కియాస్క్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కస్టమర్లకు ఇంటి దగ్గరే సిమ్ కార్డులను అందించే ప్రక్రియకు టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్‌తో చేతులు కలిపింది.
తొలి దశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర 16 పెద్ద నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. నామమాత్రంగా రూ.49 కన్వినియెన్స్ ఫీజుతో కస్టమర్లు ఇంటి దగ్గరే, పది నిమిషాల్లోనే సిమ్ కార్డులను పొందవచ్చు. సిమ్ కార్డును అందుకున్నాకా 15 రోజుల వ్యవధిలోగా ఆధార్ ఆధారిత కేవైసీ ధృవీకరణ ద్వారా నంబరును యాక్టివేట్ చేసుకోవచ్చు.
గతంలో గ్రోఫర్స్ అని పిలువబడే బ్లింకిట్ దేశంలో క్విక్‌కామర్స్ సేవలందిస్తోంది. ఇది కిరాణా, నిత్యావసరాలు, మరెన్నో వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ ఇస్తుంది. 2013 డిసెంబర్‌లో అల్బిందర్ ధిండ్సా, సౌరభ్ కుమార్‌లు స్థాపించిన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం హరియాణాలోని గురుగావ్‌లో ఉంది. 2022లో బ్లింకిట్‌ను జొమాటో 568 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ సంస్థ భారతదేశం అంతటా 30కి పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: యూఎస్‌తో వాణిజ్య ఒప్పందానికి చాన్స్
2024 ఆర్థిక సంవత్సరంలో 23.01 బిలియన్ డాలర్లు ఆదాయం సంపాదించింది. గతంలో ఈ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 630 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇది కంపెనీ కార్యకలాపాల అభివృద్ధికి, విస్తరణకు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.