
రైల్లో ప్రయాణికులకు లిక్విడ్ క్యాష్ అవసరాలు తీర్చేందుకు, బ్యాంకింగ్ సర్వీసులు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రముఖ బ్యాంకులు కొత్త సేవలు ప్రారంభిస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచించి రైలు ప్రయాణికులకు నేరుగా రైల్లోనే ఏటీఎం సేవలు అందించిందుకు సిద్ధమవుతున్నాయి. నాసిక్‌లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్ ఏసీ బోగీలో ఇటీవల దేశంలోని మొదటి ఏటీఎం ట్రయల్‌రన్ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.
రైలు ప్రయాణంలో కొన్నిసార్లు సిగ్నల్ లేకపోవడం సహజం. దాంతో మన్మాడ్-ముంబై మధ్య ఇగత్పురి, కసారా సమీపంలోని కొన్ని సొరంగాల కారణంగా సిగ్నల్‌లో అవాంతరం చోటుచేసుకుందని ట్రయల్‌రన్‌లో గమనించినట్లు అధికారులు తెలిపారు. అది మినహా ట్రెయిల్ పరీక్ష సజావుగా సాగిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పది నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డులు
ఈ సందర్భంగా భుసావల్ డీఆర్ఎం పాండే మాట్లాడుతూ..‘ప్రజలు ఇప్పుడు కదిలే రైలులో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రైలులోని మొత్తం 22 బోగీలను వెస్టిబుల్స్(రెండు బోగీల మధ్య ప్రయాణించేందుకు వీలైన మార్గం) ద్వారా అనుసంధానం చేశాం. దాంతో ప్రయాణికులు ఏటీఎంను సులభంగా చేరుకోవచ్చు’ అని చెప్పారు. ప్రయాణికుడు సంజయ్ ఝా మాట్లాడుతూ ‘ఈ ఏటీఎం ద్వారా అన్ని సేవలు నిర్వహించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చెక్ బుక్ లను ఆర్డర్ చేయవచ్చు. స్టేట్‌మెంట్లను పొందవచ్చు. ప్రయాణ సమయంలో ఈ సర్వీసు చాలా తోడ్పడుతుంది’ అన్నారు.