వాహన విక్రయాలకు పండుగ శోభ
• ప్రధాన కంపెనీల దేశీ విక్రయాలు జూమ్
• కలిసొచ్చిన దసరా, దీపావళి సీజన్
• టయోటా విక్రయాల్లో మాత్రం క్షీణత
న్యూఢిల్లీ: పండుగ సీజన్ నేపథ్యంలో వాహన విక్రయాలు అక్టోబర్ నెలలో టాప్ గేర్‌లో పరిగెత్తాయి. ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహన అమ్మకాల్లో మంచి వృద్ధినే ప్రకటిస్తే.. ఇక నిస్సాన్ మోటార్ ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీల వాహన విక్రయాలు జోరు మీద ఉన్నాయి. అయితే ఒక్క టయోటా విక్రయాలు మాత్రం తగ్గాయి.
⇔ మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాలు 2.2 శాతం వృద్ధితో 1,23,764 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులతో సహా కంపెనీ మొత్తం వాహన విక్రయాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇవి 1,34,209 యూనిట్ల నుంచి 1,33,793 యూనిట్లకు క్షీణించాయి.
⇔ హ్యుందాయ్ వాహన విక్రయాలు 4.3 శాతం వృద్ధితో 61,701 యూనిట్ల నుంచి 64,372 యూనిట్లకు పెరిగాయి. ఇక కంపెనీ దేశీ విక్రయాలు కూడా 6.4 శాతం వృద్ధితో 47,015 యూనిట్ల నుంచి 50,016 యూనిట్లకు చేరాయి. నెలవారి విక్రయాల పరంగా చూస్తే కంపెనీకి ఇవే ఉత్తమ అమ్మకాలు.
⇔ టాటా మోటార్స్ కార్ల విక్రయాల్లో 28 శాతం వృద్ధి నమోదయ్యింది. గత నాలుగేళ్లలో కంపెనీకి ఇవే అత్యుత్తమ అమ్మకాలు. ఎగుమతులతో కలుపుకొని మొత్తం వాహన విక్రయాలు (ప్యాసెంజర్, కమర్షియల్) 21 శాతం వృద్ధితో 52,813 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 43,486 యూనిట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం దేశీ విక్రయాలు 19 శాతం వృద్ధితో 46,480 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు కూడా 15% వృద్ధితో 30,169 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి ఈ విభాగానికి సంబంధించి ఏడాదిలోనే గరిష్ట అమ్మకాలు.
⇔ నిస్సాన్ మోటార్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 88% వృద్ధితో 6,108 యూనిట్లుగా ఉన్నా యి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన అమ్మకాలు 3,246 యూనిట్లుగా నమోదయ్యాయి.
⇔ ఫోక్స్‌వ్యాగన్ దేశీ వాహన విక్రయాలు 70 శాతం వృద్ధితో 5,534 యూనిట్లకు ఎగశాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన అమ్మకాలు 3,255 యూనిట్లుగా ఉన్నాయి.
⇔ టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీ వాహన విక్రయాలు మాత్రం 6% క్షీణతతో 11,651 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 12,403 యూనిట్లను విక్రయించింది.
⇔ మారుతీ, హ్యుందాయ్ వాహన ఎగుమతులు తగ్గితే.. టాటా మోటార్స్ ఎగుమతులు మాత్రం పెరిగాయి.
⇔ హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్ లేలాండ్ మొత్తం వాహన అమ్మకాలు 28 శాతం వృద్ధితో 9,803 యూనిట్ల నుంచి 12,533 యూనిట్లకు పెరిగాయి. హెవీ, మీడియం వాణిజ్య వాహన విక్రయాలు 33 శాతం వృద్ధితో 9,574 యూనిట్లకు, తేలికపాటి వాణిజ్య వాహన అమ్మకాలు 13% వృద్ధితో 2,959 యూనిట్లకు ఎగశాయి.
⇔ ఐషర్ మోటార్స్‌కు చెందిన టూవీలర్ విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం వాహన విక్రయాలు 33 శాతం వృద్ధితో 59,127 యూనిట్లకు ఎగశాయి. కంపెనీ గతేడాది అమ్మకాలు 44,522 యూని ట్లుగా ఉన్నాయి. ఇక దేశీ విక్రయాలు 44,138 యూనిట్ల నుంచి 58,369 యూనిట్లకు పెరిగాయి.