న్యూఢిల్లీ: మారుతీ, మహీంద్రా, టాటా మోటార్స్, హోండా కార్స్ కంపెనీలు జూన్ నెల వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి సాధించాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ మొత్తం వాహన విక్రయాల్లో 36.3 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 1,44,981 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 1,06,394 యూనిట్లుగా ఉన్నాయి. దేశీ విక్రయాలు ఏకంగా 45.5% వృద్ధితో 93,263 యూనిట్ల నుంచి 1,35,662 యూనిట్లకు ఎగశాయి.కంపెనీ ఎగుమతులు మాత్రం 29% క్షీణించాయి.
ఇవి 13,131 యూనిట్ల నుంచి 9,319 యూనిట్లకు తగ్గాయి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం వాహన అమ్మకాల్లో 26% వృద్ధి కనపర్చింది. ఇవి 35,759 యూనిట్ల నుంచి 45,155 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీ వాహన విక్రయాలు 23% వృద్ధితో 33,904 యూనిట్ల నుంచి 41, 689 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతుల్లోనూ 87% వృద్ధి కనిపించింది. ఇవి 1,855 యూనిట్ల నుంచి 3,466 యూనిట్లకు చేరాయి.
ఇక టాటా మోటార్స్ దేశీ వాహన విక్రయాలు 54% వృద్ధితో 36,836 యూనిట్ల నుంచి 56,773 యూనిట్లకు పెరిగాయి. దేశీ వాణిజ్య వాహన అమ్మకాలు 50 శాతం వృద్ధి చెందాయి. ఇవి 25,660 యూనిట్ల నుంచి 38,560 యూనిట్లకు ఎగశాయి. దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 63% వృద్ధితో 18,213 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు కూడా 50% వృద్ధితో 3,504 యూనిట్ల నుంచి 5,246 యూనిట్లకు చేరాయి.
హోండా కార్స్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 37.5% వృద్ధి తో 12,804 యూనిట్ల నుంచి 17,602 యూనిట్లకు పెరిగాయి. ఐషర్ మోటార్స్‌కు చెందిన టూవీలర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం వాహన విక్రయాల్లో 18% వృద్ధి కనిపించింది. ఇవి 63,160 యూనిట్ల నుంచి 74,477 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 21% వృద్ధితో 37,562 యూనిట్ల నుంచి 45,371 యూనిట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment