వాహన విక్రయాల పరుగు
న్యూఢిల్లీ: దేశంలో కార్ల విక్రయాలు జూలైలో 10 శాతం మేర పెరిగాయి. ఇక మొత్తంగా ప్యాసెంజర్ వాహన విక్రయాలు 17 శాతం మేర ఎగశాయి. మారుతీ సుజుకీ విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటా సహా పలు ఇతర కంపెనీల యుటిలిటీ వాహన అమ్మకాల వృద్ధి, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ ప్రతిపాదనల అమలు వంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. ఈ విషయాలను ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ వెల్లడించింది.
దీని ప్రకారం.. దేశీ ప్యాసెంజర్ వాహనాల విక్రయాలు జూలైలో 2,59,685 యూనిట్లుగా ఉన్నాయి. వీటి విక్రయాలు గతేడాది ఇదే నెలలో 2,22,368 యూనిట్లుగా నమోదయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 42 శాతం వృద్ధితో 45,191 యూనిట్ల నుంచి 64,105 యూనిట్లకు పెరిగాయి. కార్ల విక్రయాలు 1,62,022 యూనిట్ల నుంచి 1,77,604 యూనిట్లకు ఎగశాయి. రెండు నెలల తర్వాత కార్ల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యింది.
⇔ మారుతీ సుజుకీ దేశీ కార్ల విక్రయాలు 2 శాతం వృద్ధితో 91,602 యూనిట్ల నుంచి 93,634 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వాహన (యూవీ) విక్రయాలు 151 శాతం వృద్ధితో 17,382 యూనిట్లకు ఎగశాయి.
⇔ హ్యుందాయ్ కార్ల అమ్మకాలు 12 శాతం వృద్ధితో 29,599 యూనిట్ల నుంచి 33,197 యూనిట్లకు పెరిగాయి. యూవీ విక్రయాలు 16 శాతం వృద్ధితో 8,004 యూనిట్లకు చేరాయి.
⇔ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం వృద్ధితో 15,962 యూనిట్లకు పెరిగాయి.
⇔ టాటా మోటార్స్ కార్ల విక్రయాలు 43% వృద్ధితో 12,209 యూనిట్లకు చేరాయి. కానీ యూవీ విక్రయాలు మాత్రం 1,338 యూనిట్లకు తగ్గాయి.
⇔ టయోటా యూవీ అమ్మకాలు 8,356 యూనిట్లుగా ఉన్నాయి.
⇔ జూలైలో మొత్తం టూవీలర్ వాహన విక్రయాలు 14 శాతం వృద్ధితో 14,76,340 యూనిట్లుగా నమోదయ్యాయి.