న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. సెప్టెంబర్‌లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ కంపెనీగా కొనసాగుతోన్న మారుతీ సుజుకీ అమ్మకాలు గతనెల్లో 26.7 శాతం పడిపోయాయి. తాజా అమ్మకాల గణాంకాలపై హ్యుందాయ్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ.. ‘వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడకపోవడం వల్ల సెప్టెంబర్‌లో కూడా అమ్మకాలు క్షీణించాయి.
ఈ అంశమే తాజా గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది’ అని అన్నారు. దసరా, దీపావళి పండుగల సమయంలో అమ్మకాలు గాడిన పడే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎం అండ్ ఎం చీఫ్ సేల్స్(ఆటోమోటివ్) వీజయ్ రామ్ నక్రా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి వర్షాలు అనుకున్నస్థాయిని మించి నమోదుకావడం, కార్పొరేట్ పన్నుల్లో భారీ కోత విధించి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలను వెల్లడించడం వంటి సానుకూలతతో త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. పండుగల సీజన్‌లో అమ్మకాలు గాడిన పడతాయని అంచనావేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు.
పెరిగిన డాట్సన్ గో, గో ప్లస్ ధరలు
‘డాట్సన్ గో, గో ప్లస్’ ధరలను 5 శాతం మేర పెంచినట్లు జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మంగళవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని నిస్సాన్ ఇండియా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా పెంపు అనంతరం ఈ మోడల్ కార్ల ధరల శ్రేణి రూ. 3.32 లక్షలు నుంచి రూ. 3.86 లక్షలుగా ఉన్నట్లు వివరించారు. వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ధరల్లో పెరుగుదల ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment