వాహన విక్రయాలు ఢమాల్...
• 16 ఏళ్ల కనిష్టానికి పతనం
• డీమోనిటైజేషన్ దెబ్బతో విలవిల
• సియామ్ గణాంకాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్ డిమాండ్‌ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్ తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్ స్థాయికి పడిపోయాయి.
⇔ 2015 డిసెంబర్‌లో 15,02,315 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2016 డిసెంబర్‌లో 12,21,929 యూనిట్లకు క్షీణించాయి. 2000 డిసెంబర్‌నుంచి ఈ స్థాయిలో సేల్స్ తగ్గడం ఇదే తొలిసారి.
⇔ 2015 డిసెంబర్‌లో 1,72,671 యూనిట్లుగా ఉన్న దేశీ కార్ల విక్రయాలు 2016 డిసెంబర్ నెలలో 8.14 శాతం క్షీణతతో 1,58,617 యూనిట్లకు పతనమయ్యాయి. 2014 ఏప్రిల్ నుంచి చూస్తే విక్రయాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.
⇔ మొత్తం టూవీలర్ అమ్మకాలు 22.04% క్షీణతతో 11,67,621 యూనిట్ల నుంచి 9,10,235 యూనిట్లకు తగ్గాయి. సియామ్ గణాంకాలను నమోదుచేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి (1997) చూస్తే ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గడం ఇదే ప్రధమం.
పాత కార్ల విక్రయాలదీ అదే తీరు పెద్ద నోట్ల రద్దు... పాత కార్ల విక్రయాల మార్కెట్‌నూ పడకేసేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నోట్ల రద్దు తర్వాత వినియోగదార్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో పాత కార్ల విక్రయాలు 42 శాతం క్షీణించాయి.