
కార్.. టాప్‌గేర్!!
దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఆగస్ట్ నెలలో జోరు చూపించాయి. పలు కంపెనీలు బలమైన వృద్ధిని నమోదుచేశాయి.
ఆగస్ట్‌లో దూసుకెళ్లిన దేశీ వాహన విక్రయాలు
► మారుతీదే ఆధిపత్యం; 26.7 శాతం అప్
► హ్యుందాయ్, టాటా, మహీంద్రా, హోండా అమ్మకాల్లో జోష్
► ఫోర్డ్, టయోటా విక్రయాలు మాత్రం డౌన్
న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు ఆగస్ట్ నెలలో జోరు చూపించాయి. పలు కంపెనీలు బలమైన వృద్ధిని నమోదుచేశాయి. మరీ ముఖ్యంగా మార్కెట్ దిగ్గజం మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పండుగ సీజన్, కన్సూమర్ సెంటిమెంట్ బలంగా ఉండటం వంటి పలు కారణాలతో అమ్మకాలు బాగా పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కంపెనీల ప్యాసెంజర్ వాహన విక్రయాలు పెరిగాయి. ఫోర్డ్, టయోటా వాహన అమ్మకాలు మాత్రం క్షీణించాయి.
మారుతీ దుమ్ము దులిపేసింది...
మారుతీ సుజుకీ ఇండియా దేశీ విక్రయాలు ఏకంగా 26.7 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,19,931 యూనిట్ల నుంచి 1,52,000 యూనిట్లకు ఎగశాయి. దీని ప్రధాన ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ అమ్మకాలు 9 శాతం వృద్ధితో 43,201 యూనిట్ల నుంచి 47,103 యూనిట్లకు పెరిగాయి. విక్రయాల పెరుగుదలకు కొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన వెర్నా ప్రధాన కారణమని హెచ్‌ఎంఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. దేశీ యుటిలిటీ వాహన దిగ్గజమైన మహీంద్రా దేశీ విక్రయాలు 7.01 శాతం వృద్ధి చెంది 36,944 యూనిట్ల నుంచి 39,534 యూనిట్లకు ఎగశాయి.
సానుకూల రుతుపవనాలు, గ్రామీణ డిమాండ్ వంటి అంశాలు అమ్మకాల వృద్ధికి దోహదపడ్డాయని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వాడెరా తెలిపారు. టాటా మోటార్స్ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10.29 శాతం వృద్ధితో 13,002 యూనిట్ల నుంచి 14,340 యూనిట్లకు పెరిగాయి. టియాగో, టిగోర్, హెక్సా వంటి కొత్త జనరేషన్ కార్లకున్న డిమాండ్ కారణంగా విక్రయాలు పెరిగినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) మయాంక్ పరీఖ్ తెలిపారు.
‘గణేశ్ చతుర్థితో పండుగ సీజన్‌లోకి ప్రవేశించాం. భవిష్యత్‌లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) దేశీ అమ్మకాలు 24.5 శాతం పెరిగాయి. ఇవి 13,941 యూనిట్ల నుంచి 17,365 యూనిట్లను ఎగశాయి. ‘దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగ కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పండుగ సీజన్ వల్ల వచ్చే రెండు నెలల్లో విక్రయాలు మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నాం’ అని హెచ్‌సీఐఎల్ యుచిరో యెనో తెలిపారు.
రివర్స్ గేర్‌లో ఫోర్డ్, టయోటా
ఫోర్డ్ ఇండియా దేశీ విక్రయాలు 9% తగ్గాయి. ఇవి 8,548 యూనిట్ల నుంచి 7,777 యూనిట్లకు క్షీణించాయి. సరఫరా వ్యవస్థలోని పలు సమస్యలు ఎగుమతులతోపాటు దేశీ ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించినట్లు ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) దేశీ అమ్మకాలు 6.12% తగ్గుదలతో 12,801 యూనిట్ల నుంచి 12,017 యూనిట్లకు పడ్డాయి. ఉత్పత్తికి సంబంధించిన పరిమితుల కారణంగా ఆగస్ట్ నెలలోని డిమాండ్ అందుకోలేకపోయామని టీకేఎం డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్.రాజా తెలిపారు.
టూవీలర్ జోష్..: టూవీలర్ విభాగంలోనూ విక్రయాలు బాగానే పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం విక్రయాలు 21.99% వృద్ధితో 67,977 యూనిట్లకు ఎగశాయి. బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు 2.98 శాతం వృద్ధి చెందాయి. ఇవి 3,25,347 యూనిట్ల నుంచి 3,35,031 యూనిట్లకు పెరిగాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు 54.25 శాతం వృద్ధితో 56,745 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటార్ మొత్తం అమ్మకాలు 15.7 శాతం వృద్ధితో 2,74,303 యూనిట్ల నుంచి 3,17,563 యూనిట్లకు పెరిగాయి.