న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా త్వరలో మార్కెట్లోకి తేనున్న మల్టీపర్పస్ వెహికిల్‌కు ఇన్విక్టో అని నామకరణం చేసింది. జూలై 5న భారత విపణిలో ఇది రంగ ప్రవేశం చేయనుంది. జూన్ 19 నుంచి బుకింగ్స్ ప్రారంభం. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. టయోటా, మారుతీ సుజుకీ సంయుక్తంగా ఈ మోడల్‌ను అభివృద్ధి చేశాయి.
కొత్త మోడల్ రాకతో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసే విభాగంలో సుస్థిర స్థానం దక్కించుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15–20 లక్షల ధరల విభాగంలో మారుతీ సుజుకీ అగ్రగామిగా నిలిచిందని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
పోటీపడాలని నిర్ణయించాం..
మూడు వరుసల ఎస్‌యూవీ/ఎంపీవీ విభాగంలో 2022–23లో అన్ని కంపెనీలవి కలిపి భారత్‌లో 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రూ.20 లక్షలకుపైగా ఖరీదు చేసేవి 1.2–1.25 లక్షల యూనిట్లు ఉంటాయని శ్రీవాస్తవ వెల్లడించారు. ‘మూడు వరుసల ప్రీమియం ఎంపీవీ/ఎస్‌యూవీల కోసం మార్కెట్ ఉందని భావిస్తున్నాం.
మూడు వరుసలున్న ఎంపీవీ లేదా ఎస్‌యూవీ లేదా రెండింటి లక్షణాలను కలిగి ఉండే ప్రీమియం వాహనం కోసం చూస్తున్న కస్టమర్లు ఉన్నారు. ఈ విభాగం అభివృద్ధి చెందుతోంది. అలాగే చాలా పెద్దదిగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లోని వినియోగదార్లు ప్రత్యేకంగా ఎస్‌యూవీ లేదా ఎంపీవీ కోసం చూడటం లేదు. వారికి కావాల్సింది చాలా స్థలం, మంచి డ్రైవింగ్ పనితీరు, ఫీచర్లు, సాంకేతికతతో కూడిన మూడు వరుసల ప్రీమియం వాహనం. కాబట్టి ఈ విభాగంలో పోటీపడాలని నిర్ణయించాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment