ముంబై: వాహన రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌లో నాలుగు శాతం తగ్గినట్లు భారత వాహన డీలర్ల సంఘం ఫాడా గురువారం ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో మొత్తం 17,24,935 వాహనాలు విక్రయంగా.., గతేడాదిలో ఇదే నెలలో 17,97,432 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన, ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్‌లో నీరసించాయి. ఇందులో ద్విచక్ర వాహన విక్రయాలు 7%, ప్యాసింజర్ వాహనాలు ఒకశాతం పడిపోయినట్లు ఫాడా తెలిపింది.
‘‘ఉద్గార ప్రమాణ నిబంధనలతో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగనన్న వాహనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు మార్చిలోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టారు. అలాగే అధిక బేస్ ఎఫెక్ట్ ఒక కారణంగా నిలిచింది. వెరసి గడిచిన ఎనిమిది నెలల్లో తొలిసారి ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి క్షీణత నమోదైంది’’ ఫాడా తెలిపింది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల వాహన డీలర్‌షిప్‌ల వద్ద వినియోగదారుల ఎంక్వైరీ పెరిగాయి. మే నెల అమ్మకాల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఫాడా ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే త్రీ–వీలర్స్, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలకు డిమాండ్ పెరిగింది. త్రీ–వీలర్ అమ్మకాలు 57 శాతంతో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ట్రాక్టర్ విక్రయాలు ఒక శాతం, వాణిజ్య వాహనాలు 2 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ‘‘ గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన ప్యాసింజర్ విభాగం గత నెలలో నెమ్మదించింది.
ద్విచక్ర వాహనాల విభాగం కరోనా ముందు కంటే 19 శాతం వెనకబడే ఉంది. ఈ విభాగంపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగం మొత్తం ఆటో అమ్మకాల్లో 75 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున జీఎస్టీ తగ్గింపు ద్విచక్ర వాహన అమ్మకాల పునరుద్ధరణకు దోహదపడుతుంది’’ అని సింఘానియా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment