Double digit growth rate
-
దూసుకెళ్తున్న ఆడి కార్లు.. డబుల్ డిజిట్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఈ ఏడాది రెండంకెల బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తోంది. ‘2023 జనవరి–జూన్‌లో 97 శాతం వృద్ధితో 3,500 యూనిట్లు విక్రయించాం. ఎస్‌యూవీలు 200 శాతం, స్పోర్ట్స్ కార్ల విభాగం 127 శాతం అధిక అమ్మకాలను సాధించాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 20 శాతం మాత్రమే. జూలైలోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేశాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. కాగా, కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యూ8 ఈ–ట్రాన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభం. 50, 55 ట్రిమ్స్‌లో లభిస్తుంది. ట్రిమ్నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 491–600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 55 ట్రిమ్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో అందుకుంటుంది. -
‘వ్యూ’ లక్ష్యం రూ.1,000 కోట్లు
ముంబై: టీవీల తయారీలో ఉన్న వ్యూ టెలివిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో రూ.1,000 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. ‘కంపెనీ లాభదాయకంగా ఎదగాలని కోరుకుంటోంది. అది నిలకడగా లేకుంటే మార్కెట్ వాటా కోసం వెంబడించబోము’ అని సంస్థ ఫౌండర్, చైర్పర్సన్ దేవితా షరాఫ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక, వ్యూహాత్మక వాటాదారుల కోసం వెతకడానికి ఇది సరైన సమయం అని ఆమె యోచిస్తున్నారు. ‘2022–23లో రూ.900 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లను దాటతాం. టర్నోవర్ గర్వం అయితే, లాభదాయకత చిత్తశుద్ధి లాంటిది. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం లాభాలు మూడు రెట్లు అధికం. లాభదాయకత కోసం ఎక్కువ శ్రద్ధ వహిస్తాం’ అని తెలిపారు. 40 లక్షలకుపైగా టీవీలు.. వ్యూ ఇప్పటి వరకు 40 లక్షల పైచిలుకు టీవీలను విక్రయించింది. 2022–23లో మొత్తం ఆదాయంలో 80 శాతం వాటా 50 అంగుళాలు ఆపైన సైజులో లభించే ప్రీమియం మోడళ్లు కైవసం చేసుకున్నాయి. ‘అన్ని టీవీ విభాగాల్లో ప్రీమియం కేటగిరీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరుగుతున్నందున టీవీ సెట్స్‌కు చాలా డిమాండ్ ఉంది. వినియోగ విధానాలు మారుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌లో రూ.20 లక్షల ధరతో 100 అంగుళాల టీవీని కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టాం. 100 యూనిట్లు విక్రయించాం. 85 అంగుళాల టీవీలు 2012 నుంచి 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఒకట్రెండేళ్లలో 85, 98 అంగుళాల టీవీలు 10,000 యూనిట్ల అమ్మకాలను ఆశిస్తున్నాం’ అని దేవితా షరాఫ్ చెప్పారు. ధర పెంపు ప్రభావం ఉండదు.. ఈ మధ్యకాలంలో ప్యానెళ్ల ధరలు పెరిగాయి. అయితే కోవిడ్ కాలం మాదిరిగా ప్యానెళ్ల కొరత లేదని దేవితా షరాఫ్ తెలిపారు. ‘ధరల పెంపు కారణంగా వ్యూ వంటి ప్రీమియం బ్రాండ్ ప్రభావితం కాలేదు. కంపెనీ సేవలందించే వివేకం గల వినియోగదారులు ప్రపంచ పోకడలను అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ ధర విభాగాల్లో పోటీపడే బ్రాండ్లకు ఇది కష్టంగా మారుతుంది. ఈ కంపెనీలు ధరపై మాత్రమే విక్రయించగలుగుతాయి’ అని వివరించారు. కంపెనీ తాజాగా 98, 85 అంగుళాల్లో నూతన టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర రూ.6 లక్షల వరకు ఉంది. -
అమెరికా మార్కెట్లో కొత్తగా 30 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరం కీలకమైన అమెరికా మార్కెట్లో దాదా పు 30 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధి ఉన్నా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రెండంకెల స్థాయిలో సాధించగలమని ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ప్రస్తుతానికి ధరలపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆదాయ వృద్ధి కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని పేర్కొన్నారు. అటు చైనా మార్కె ట్లో తాము ఏటా రెండంకెల స్థాయిలో ఫైలింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40,50 ఫైలింగ్స్ ఉండొచ్చని వివరించారు. సాధారణంగా ఉత్పత్తులకు అనుమతి లభించాలంటే .. దరఖాస్తు చేసుకున్న తర్వాత 18–24 నెలలు వరకు సమయం పడుతుందని ఇజ్రేలీ తెలిపారు. గతేడాది నాలుగు ఉత్పత్తులకు అనుమతి లభించిందని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే, ఆపై ఆర్థిక సంవత్సరాల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొన్నారు. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్‌యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్‌లో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్‌తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్‌తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
కమర్షియల్ వాహనాలు జోరుగా.. హుషారుగా! తగ్గేదెలే!!
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం ప్రతికూలమే అయినప్పటికీ ఈ ఏడాది వాణిజ్య వాహనాల (సీవీ) అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం అలాగే వడ్డీ రేట్ల పెరుగుదల వంటి ప్రతికూలతలను అధిగమించేలా మౌలికసదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుండటం, దేశీయంగా వినియోగం క్రమంగా పెరుగుతుండటం తదితర సానుకూలాంశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రవాణా రేట్లు, వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండటమనేది రవాణాదారుల విశ్వాస సూచీ మెరుగుదలకు తోడ్పడుతున్నాయని వాఘ్ వివరించారు. తమ కంపెనీ విషయానికొస్తే లాభదాయకత వృద్ధిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ఎప్పట్లాగే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం పండుగ సీజన్ నుండి డిమాండ్ పుంజుకోగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) గణాంకాల ప్రకారం 2022-23 తొలి త్రైమాసికంలో దేశీయంగా సీవీల విక్రయాలు 112 శాతం పెరిగి 1,05,800 యూనిట్ల నుంచి 2,24,512 యూనిట్లకు పెరిగాయి. 2021-22లో అమ్మకాలు 26 శాతం వృద్ధి చెంది 5,68,559 యూనిట్ల నుంచి 7,16,566 యూనిట్లకు పెరిగాయి. వడ్డీ రేట్ల పెంపుతో ఈఎంఐల భారం పెరుగుతుందని, అయితే ఇది మరీ ఎక్కువగా ఉండకుండా చూసేలా తగు ఫైనాన్సింగ్ స్కీమ్‌లు లభించే విధంగా ఆర్థిక సంస్థలతో కలిసి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తోందని వాఘ్ చెప్పారు. -
వాహన అమ్మకాల జోరు: టాప్ గేర్‌లో విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ:వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి సాధించ వచ్చని అంచనా వేస్తోంది. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ఈ విషయం తెలిపారు. ‘సంకేతాలన్నీ అదే దిశలో (రెండంకెల స్థాయి వృద్ధి) కనిపిస్తున్నాయి. డిమాండ్ బాగుంది. తయారీ కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మారి, లాకవుట్లు, అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడం వంటి మన చేతుల్లో లేని సవాళ్లు తలెత్తితే తప్ప సరైన దిశలోనే పరిశ్రమ సాగుతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఏసీఎంఏ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ టర్నోవరు 2020-21తో పోలిస్తే 23 శాతం పెరిగి రూ. 4.2 లక్షల కోట్లకు చేరింది. డిమాండ్ పుంజుకోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు కొంత తగ్గడం వంటి అంశాల కారణంగా ప్యాసింజర్ వాహనాల తయారీ 20 శాతం, వాణిజ్య వాహనాల ఉత్పత్తి 30 శాతం పెరిగాయి. ఆటో విడిభాగాల ఎగుమతులు 43 శాతం పెరిగి రూ. 1.41 లక్షల కోట్లకు, దిగుమతులు 33 శాతం పెరిగి రూ. 1.36 లక్షల కోట్లకు చేరాయి. ఏసీఎంఏలో 850 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. సంఘటిత పరిశ్రమ టర్నోవరులో వీటి వాటా 90 శాతం పైగా ఉంటుంది. కొత్త వాహనాల ఊతం.. కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాల మోడల్స్ .. ఈ పండుగ సీజన్లో అమ్మకాలకు ఊతంగా నిలవగలవని కపూర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆశావహంగా ఉండటం ఈ ఆర్థిక సంవత్సరమూ కొనసాగవచ్చని, 2022–23లో పరిశ్రమ ఆరోగ్యకరమైన పనితీరు కనపర్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే, బీమా వ్యయాలు .. ఇంధనం ధరలు .. రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం వంటి అంశాలు పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరం దృష్టి సారించాలని కపూర్ కోరారు. అమ్మకాల పరిమాణం రీత్యా పరిశ్రమ కరోనా పూర్వ స్థాయికి తిరిగి చేరుకుందని చెప్పారు. కొత్త ప్లాట్‌ఫాంలు ఆవిష్కరణ, ద్విచక్ర వాహనాలు.. వాణిజ్య వాహనాల అమ్మకాలు పుంజుకుంటే తదుపరి దశ వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. స్థానికీకరణపై ఆటో పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతుండటం, ప్రభుత్వం ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల్లాంటివి భారత్‌ను హై–ఎండ్ ఆటో–విడిభాగాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మార్చగలవని కపూర్ తెలిపారు. ఎలక్ట్రిక్ దిశగా పరిశ్రమ టూవీలర్లు, త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పుంజుకుంటున్న కొద్దీ విడిభాగాల పరిశ్రమ కూడా గణనీయంగా మార్పులకు లోనవుతోందని కపూర్ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలు వృద్ధి చెందడానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వాహనాల తయారీ సంస్థలకు (ఓఈఎం) ఎలక్ట్రిక్ విడిభాగాల సరఫరా చూస్తే.. మొత్తం దేశీయ మార్కెట్లో చేసిన విక్రయాల్లో కేవలం ఒక్క శాతంగానే (రూ. 3,520 కోట్లు) ఉన్నట్లు కపూర్ వివరించారు. ఈ విభాగంలో అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులు పెట్టడం తిరిగి మొదలైతే.. ఈ రంగంలో నియామకాలు కూడా పెరుగుతాయని కపూర్ చెప్పారు. -
హోండా విస్తరణ వ్యూహాలు : బైక్‌లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో టూ వీలర్ దిగ్గజానికి షాకిచ్చేలా దూసుకుపోతోంది. వచ్చే ఏడాది నాటికి డబుల్ డిజిట్ గ్రోత్ సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ .800 కోట్ల పెట్టుబడులతోపాటు వరుసగా మూడేళ్ల పాటు రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ మనోరు కటో మంగళవారం తెలిపారు. త్వరలోనే ఒక కొత్త ప్రొడక్ట్‌ను ప్రారంభిస్తామన్నారు. దీంతో తమ ఉనికిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతామన్నారు. అలాగే ఈ ఏడాదిలో 18 ఇతర ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన ప్రకటించారు. 2018-19 నాటికి, గత ఆర్థిక సంవత్సరంలో 5,700 అవుట్లెట్ల నుంచి 6వేల టచ్ పాయింట్స్‌ను పెంచుతామని తద్వారా విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అయితే 2020 నాటికి టూవీలర్ ఇండస్ట్రీ బీఎస్-6 ఎమిషన్ నిబంధనలకు అప్‌గ్రేడ్‌తో ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బైక్‌లపై భారీగా ధర తగ్గింపు మరోవైపు ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్ మోడళ్లపై ధరలను భారీగా తగ్గించింది. సీబీఆర్1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ మోడల్స్‌పై రూ. 2.5లక్షల వరకు ధరను తగ్గించినట్లు హోండా తెలిపింది. దిగుమతి చేసుకునే పూర్తిగా నిర్మితమైన యూనిట్ల(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్)పై సుంకాన్ని 25శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకే బైక్‌లపై ధరలను తగ్గించినట్టు చెప్పింది. సవరించిన ధరల ప్రకారం.. హోండా సీబీఆర్1000ఆర్ఆర్ మోడల్ ధర రూ. 16.79లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 14.78లక్షలకు (ఎక్స్‌షోరూం దిల్లీ) పడిపోయింది. ఇక సీబీఆర్1000ఆర్ఆర్ ఎస్పీ మోడల్ ధర రూ. 21.22లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 18.68లక్షలకు(ఎక్స్‌షోరూం దిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్ ఫైర్‌బ్లేడ్ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్సన్, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి 2018 ఆర్థిక సంవత్సరంలో, హోండా అమ్మకాలు 22శాతం పెరుగుదల నమోదు చేసింది. 6.12 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతేకాదు 7.59 మిలియన్ యూనిట్ల విక్రయాలతో 2016-17 లో ప్రధాన ప్రత్యర్థి హీరో మోటోను అధిగమించింది. దేశంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీదారుగా ఉన్న సంస్థ దేశంలో 50శాతం స్కూటర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని మనేసర్‌లో, రాజస్థాన్‌లోని తపుకారాలో, కర్ణాటకలోని నరస్పురా, గుజరాత్‌లోని విఠలాపూర్లలో ప్రస్తుతం నాలుగు కర్మాగారాలలో 6.4 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. -
రెండంకెల వృద్ధిరేటుకు సహకరించాలి
* బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు * లోప భూయిష్టమైన విధానాలపై నిలదీసిన బ్యాంకర్లు.... రైతుమిత్ర సంఘాలకు రుణ మాఫీ విధానంపై ఈసడింపు * వడ్డీలేని రుణం, ‘పావలా వడ్డీ’పై స్పష్టతేదీ? * బ్యాంకర్లను అనునయించిన ముఖ్యమంత్రి * వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన బాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించడానికి బ్యాంకర్లు ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాడి, మత్స్య పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్యా రంగాలకు భారీ ఎత్తున రుణాలు ఇస్తేనే రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 190వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలోవ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోప భూయిష్టమైన విధానాలను రూపొందించి.. ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని కోరడం సమంజసం కాదంటూ స్పష్టీకరించారు. బ్యాంకర్ల నుంచి ఎదురుదాడిని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు.. ఎస్ఎల్బీసీకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల రుణాలను కలిపి రూ.1,25,748 కోట్లతో బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికతో పోలిస్తే 47 శాతం అధికం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఇచ్చిన తరహాలోనే రైతుమిత్ర సంఘాలు(ఆర్ఎంజీ), జేఎల్‌జీ(జాయింట్ లయబుల్ గ్రూప్స్)ల్లోని రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఇంతలోనే బ్యాంకర్లు జోక్యం చేసుకుంటూ ఆర్ఎంజీ, జేఎల్‌జీ సంఘాల్లో రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఈసడించారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా భారీ ఎత్తున రుణాలు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. బ్యాంకర్ల ఎదురుదాడితో తేరుకున్న సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామంటూ వారిని చల్లార్చేయత్నం చేశారు. జూలై ఆఖరుకు పునరుద్ధరణ పూర్తి మొదటి విడత రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేసిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి.. పాత రుణాలను జూలై ఆఖరు నాటికి పునరుద్ధరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా, రూ.మూడు లక్షల్లోపు రుణాలను పావలా వడ్డీ కింద ఇస్తోండటం వల్ల రైతులు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ.. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తుందో.. లేదో.. స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘రుణాలను మాఫీ చేశాం కదా.. వడ్డీ రాయితీ చెల్లించడం ఏంటి?’ అంటూ సీఎం ప్రశ్నించడంతో అవాక్కైన బ్యాంకర్లు.. ఇంతకూ వడ్డీలేని రుణం, పావలావడ్డీ పథకాలను కొనసాగిస్తున్నారా? లేదా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దశలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో చర్చించిన చంద్రబాబు.. ఆ రెండు పథకాలను కొనసాగిస్తున్నామని, వడ్డీరాయితీ బకాయిల చెల్లింపులపై ఓ నిర్ణయం తీసుకుంటామని దాటవేసే యత్నం చేశారు. భూమికి సంబంధించిన రికార్డులను ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ ద్వారా ఆన్లైన్లో పెట్టామని.. ఇది వేగంగా రుణాలను పంపిణీ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. సూక్ష్మ సేద్యానికి సహకారం రాష్ట్రంలో సూక్ష్మ నీటిపారుదల సేద్యానికి సహకరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. పదెకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్పింక్లర్లను ఇప్పటిదాకా 50 శాతం రాయితీపై ఇచ్చే వారని.. ఇప్పుడు ఆ రాయితీని 70 శాతానికి పెంచామని చెప్పారు. 2015-16లో ఐదు లక్షల ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ, అటవీ శాఖ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు టి.కుటుంబరావు, ఆర్బీఐ రీజనల్ డెరైక్టర్ ఆర్.ఎన్.దాస్, ఎస్ఎల్బీసీ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్, నాబార్డు సీజీఎం హరీష్ జావాలు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయం: ప్రత్తిపాటి ఎస్ఎల్బీసీ సమావేశం ముగిసిన అనంతరం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులతో మట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో కన్నా 2015-16లో రైతులకు అధికంగా రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరామన్నారు. 2015-16 వార్షిక రుణ ప్రణాళిక ముఖ్యాంశాలు (అంకెలు.. రూ.కోట్లల్లో) ⇒ 1,25,748 బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళిక ⇒ 85,345 ప్రాధాన్యరంగానికి ⇒ 28,828 ప్రాధాన్యేతర రంగాలకు ⇒ 65,272 వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం ⇒ 17,205 వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణం ⇒ 1344 మత్స్య పరిశ్రమకు రుణ లక్ష్యం ⇒ 3,098 పాడి పరిశ్రమకు.. ⇒ 2,789 వ్యవసాయ యాంత్రీకరణకు.. ⇒ 15,880 స్వయం సహాయక మహిళా సంఘాలకు.. ⇒ 16,960 చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్చి 31, 2015 నాటికి ⇒ 1,93,753 బ్యాంకుల్లో డిపాజిట్లు ⇒ 2,15,797 రుణాలుగా పంపిణీ ⇒ 1,51,482 ప్రాధాన్యత రంగ అప్పులు ⇒ 95,597 వ్యవసాయ రుణాలు ⇒ 32,276 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ⇒ 3,026 విద్యా రుణాలు ⇒ 17,424 గృహ నిర్మాణ రుణాలు