* బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
* లోప భూయిష్టమైన విధానాలపై నిలదీసిన బ్యాంకర్లు....
రైతుమిత్ర సంఘాలకు రుణ మాఫీ విధానంపై ఈసడింపు
* వడ్డీలేని రుణం, ‘పావలా వడ్డీ’పై స్పష్టతేదీ?
* బ్యాంకర్లను అనునయించిన ముఖ్యమంత్రి
* వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించిన బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండంకెల వృద్ధిరేటు సాధించడానికి బ్యాంకర్లు ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాడి, మత్స్య పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్యా రంగాలకు భారీ ఎత్తున రుణాలు ఇస్తేనే రెండంకెల వృద్ధి రేటు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 190వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలోవ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీలో ప్రభుత్వం అనుసరించిన విధానాలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం లోప భూయిష్టమైన విధానాలను రూపొందించి.. ఉదారంగా రుణాలు ఇచ్చి సహకరించాలని కోరడం సమంజసం కాదంటూ స్పష్టీకరించారు. బ్యాంకర్ల నుంచి ఎదురుదాడిని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు.. ఎస్‌ఎల్‌బీసీకి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల రుణాలను కలిపి రూ.1,25,748 కోట్లతో బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికతో పోలిస్తే 47 శాతం అధికం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఇచ్చిన తరహాలోనే రైతుమిత్ర సంఘాలు(ఆర్‌ఎంజీ), జేఎల్‌జీ(జాయింట్ లయబుల్ గ్రూప్స్)ల్లోని రైతులకు రుణాలు ఇవ్వాలని కోరారు. ఇంతలోనే బ్యాంకర్లు జోక్యం చేసుకుంటూ ఆర్‌ఎంజీ, జేఎల్‌జీ సంఘాల్లో రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఈసడించారు. స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా భారీ ఎత్తున రుణాలు ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. బ్యాంకర్ల ఎదురుదాడితో తేరుకున్న సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామంటూ వారిని చల్లార్చేయత్నం చేశారు.
జూలై ఆఖరుకు పునరుద్ధరణ పూర్తి
మొదటి విడత రుణమాఫీ కింద ప్రభుత్వం అందజేసిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి.. పాత రుణాలను జూలై ఆఖరు నాటికి పునరుద్ధరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. రూ.లక్ష లోపు రుణాలను వడ్డీ లేకుండా, రూ.మూడు లక్షల్లోపు రుణాలను పావలా వడ్డీ కింద ఇస్తోండటం వల్ల రైతులు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ.. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తుందో.. లేదో.. స్పష్టత ఇవ్వాలని కోరారు.
‘రుణాలను మాఫీ చేశాం కదా.. వడ్డీ రాయితీ చెల్లించడం ఏంటి?’ అంటూ సీఎం ప్రశ్నించడంతో అవాక్కైన బ్యాంకర్లు.. ఇంతకూ వడ్డీలేని రుణం, పావలావడ్డీ పథకాలను కొనసాగిస్తున్నారా? లేదా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దశలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో చర్చించిన చంద్రబాబు.. ఆ రెండు పథకాలను కొనసాగిస్తున్నామని, వడ్డీరాయితీ బకాయిల చెల్లింపులపై ఓ నిర్ణయం తీసుకుంటామని దాటవేసే యత్నం చేశారు. భూమికి సంబంధించిన రికార్డులను ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్ ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టామని.. ఇది వేగంగా రుణాలను పంపిణీ చేయడానికి ఉపకరిస్తుందన్నారు.
సూక్ష్మ సేద్యానికి సహకారం
రాష్ట్రంలో సూక్ష్మ నీటిపారుదల సేద్యానికి సహకరించాలని బ్యాంకర్లను సీఎం చంద్రబాబు కోరారు. పదెకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్పింక్లర్లను ఇప్పటిదాకా 50 శాతం రాయితీపై ఇచ్చే వారని.. ఇప్పుడు ఆ రాయితీని 70 శాతానికి పెంచామని చెప్పారు. 2015-16లో ఐదు లక్షల ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ, అటవీ శాఖ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు టి.కుటుంబరావు, ఆర్‌బీఐ రీజనల్ డెరైక్టర్ ఆర్.ఎన్.దాస్, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్, నాబార్డు సీజీఎం హరీష్ జావాలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం: ప్రత్తిపాటి
ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ముగిసిన అనంతరం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరులతో మట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో కన్నా 2015-16లో రైతులకు అధికంగా రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరామన్నారు.
2015-16 వార్షిక రుణ ప్రణాళిక ముఖ్యాంశాలు (అంకెలు.. రూ.కోట్లల్లో)
⇒ 1,25,748 బ్యాంకర్లు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళిక
⇒ 85,345 ప్రాధాన్యరంగానికి
⇒ 28,828 ప్రాధాన్యేతర రంగాలకు
⇒ 65,272 వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం
⇒ 17,205 వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణం
⇒ 1344 మత్స్య పరిశ్రమకు రుణ లక్ష్యం
⇒ 3,098 పాడి పరిశ్రమకు..
⇒ 2,789 వ్యవసాయ యాంత్రీకరణకు..
⇒ 15,880 స్వయం సహాయక మహిళా సంఘాలకు..
⇒ 16,960 చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు
మార్చి 31, 2015 నాటికి
⇒ 1,93,753 బ్యాంకుల్లో డిపాజిట్లు
⇒ 2,15,797 రుణాలుగా పంపిణీ
⇒ 1,51,482 ప్రాధాన్యత రంగ అప్పులు
⇒ 95,597 వ్యవసాయ రుణాలు
⇒ 32,276 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు
⇒ 3,026 విద్యా రుణాలు
⇒ 17,424 గృహ నిర్మాణ రుణాలు
రెండంకెల వృద్ధిరేటుకు సహకరించాలి
Published Tue, Jun 30 2015 2:20 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement