ముంబై: టీవీల తయారీలో ఉన్న వ్యూ టెలివిజన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో రూ.1,000 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. ‘కంపెనీ లాభదాయకంగా ఎదగాలని కోరుకుంటోంది. అది నిలకడగా లేకుంటే మార్కెట్ వాటా కోసం వెంబడించబోము’ అని సంస్థ ఫౌండర్, చైర్‌పర్సన్ దేవితా షరాఫ్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక, వ్యూహాత్మక వాటాదారుల కోసం వెతకడానికి ఇది సరైన సమయం అని ఆమె యోచిస్తున్నారు. ‘2022–23లో రూ.900 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లను దాటతాం. టర్నోవర్ గర్వం అయితే, లాభదాయకత చిత్తశుద్ధి లాంటిది. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం లాభాలు మూడు రెట్లు అధికం. లాభదాయకత కోసం ఎక్కువ శ్రద్ధ వహిస్తాం’ అని తెలిపారు.
40 లక్షలకుపైగా టీవీలు..
వ్యూ ఇప్పటి వరకు 40 లక్షల పైచిలుకు టీవీలను విక్రయించింది. 2022–23లో మొత్తం ఆదాయంలో 80 శాతం వాటా 50 అంగుళాలు ఆపైన సైజులో లభించే ప్రీమియం మోడళ్లు కైవసం చేసుకున్నాయి. ‘అన్ని టీవీ విభాగాల్లో ప్రీమియం కేటగిరీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరుగుతున్నందున టీవీ సెట్స్‌కు చాలా డిమాండ్ ఉంది. వినియోగ విధానాలు మారుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్లో రూ.20 లక్షల ధరతో 100 అంగుళాల టీవీని కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టాం. 100 యూనిట్లు విక్రయించాం. 85 అంగుళాల టీవీలు 2012 నుంచి 5,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఒకట్రెండేళ్లలో 85, 98 అంగుళాల టీవీలు 10,000 యూనిట్ల అమ్మకాలను ఆశిస్తున్నాం’ అని దేవితా షరాఫ్ చెప్పారు.
ధర పెంపు ప్రభావం ఉండదు..
ఈ మధ్యకాలంలో ప్యానెళ్ల ధరలు పెరిగాయి. అయితే కోవిడ్ కాలం మాదిరిగా ప్యానెళ్ల కొరత లేదని దేవితా షరాఫ్ తెలిపారు. ‘ధరల పెంపు కారణంగా వ్యూ వంటి ప్రీమియం బ్రాండ్ ప్రభావితం కాలేదు. కంపెనీ సేవలందించే వివేకం గల వినియోగదారులు ప్రపంచ పోకడలను అర్థం చేసుకోగలుగుతారు. తక్కువ ధర విభాగాల్లో పోటీపడే బ్రాండ్లకు ఇది కష్టంగా మారుతుంది. ఈ కంపెనీలు ధరపై మాత్రమే విక్రయించగలుగుతాయి’ అని వివరించారు. కంపెనీ తాజాగా 98, 85 అంగుళాల్లో నూతన టీవీల శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర రూ.6 లక్షల వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment