సూపర్‌మ్యాక్స్ హైదరాబాద్ ప్లాంట్ విస్తరణ
త్వరలో సిస్టమ్, డిస్పోజబుల్ రేజర్ల తయారీ
వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చౌదురి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రేజర్ బ్లేడ్లు, డిస్పోజబుల్ రేజర్ల తయారీ సంస్థ సూపర్‌మ్యాక్స్ పర్సనల్ కేర్ హైదరాబాద్ ప్లాంట్‌ను విస్తరిస్తోంది. 6-9 నెలల్లో ఈ ప్లాంటులో సిస్టమ్, డిస్పోజబుల్ రేజర్ల తయారీని చేపట్టనుంది. ప్రీమియం డిస్పోజబుల్ రేజర్ బ్లేడ్ల తయారీలోకి కంపెనీ శుక్రవారం ప్రవేశించింది. వీటి తయారీకి ఉపయోగించే స్పట్టరింగ్ మెషీన్‌ను తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. మెషీన్‌తో రోజుకు 10 లక్షల బ్లేడ్లు ఉత్పత్తి చేయవచ్చు. రోజుకు 60 లక్షల బ్లేడ్లు ఉత్పత్తి చేయగల మరో మెషీన్ కొద్ది రోజుల్లో రానుంది. హైదరాబాద్ ప్లాంటులో ప్రస్తుతం రోజుకు ఒక కోటిదాకా బ్లేడ్లను తయారు చేస్తున్నారు.
డిస్పోజబుల్స్‌కు డిమాండ్..
దేశంలో డిస్పోజబుల్ రేజర్లు, సిస్టమ్‌లకు చిన్న పట్టణాల్లోనూ గిరాకీ పెరుగుతోంది. సాధారణ బ్లేడ్ల అమ్మకాల్లో 20 శాతం వృద్ధి రేటు ఉంటే, ఈ విభాగం 45 శాతం దాకా వృద్ధి నమోదు చేస్తోంది. సాధారణ బ్లేడ్లు రూ.1,000 కోట్లు, డిస్పోజబుల్ రేజర్లు, సిస్టమ్‌లు రూ.700 కోట్ల వ్యాపారం జరుగుతోందని సూపర్‌మ్యాక్స్ స్ట్రాటజీ, కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ సుభాష్ చౌదురి తెలిపారు. భారత్‌తోసహా ఇతర దేశాల్లో కంపెనీకి 10 ప్లాంట్లున్నాయి. ఆగ్నేయాసియా, బ్రెజిల్, ఈజిప్ట్‌లో ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు.