
సినిమాల్లో అవకాశమిస్తామని..17 రోజులపాటూ..
హైదరాబాద్: మైనర్ బాలికకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి 17 రోజుల పాటు ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమాల్లో డ్యాన్సర్‌గా స్థిరపడాలనే ఉద్దేశంతో బాలిక(15) బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివాసముండే మేనమామ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె బలహీనతను ఆసరాగా చేసుకున్న నలుగురు యువకులు బాలికపై కన్నేశారు.
ఇందిరానగర్‌లో నివసిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ అక్బర్(21), తూము వెంకారెడ్డి(22), ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నండూరి పాపారావు అలియాస్ గణేష్(31) మోయినాబాద్‌వాసి గుడుపల్లి నవీన్‌కుమార్(19)లు బాలికకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ మభ్యపెట్టి ఈ నెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా నందిగామకు తీసుకెళ్లారు. మరో స్నేహితుడు కుమార్‌తో కలిసి ఐదుగురు ఆమెను ఇందిరానగర్‌తో పాటు చింతల్, జీడిమెట్ల, నందిగామ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉండగా మిగతా నలుగురిని ఐపీసీ సెక్షన్ 376(డి), సెక్షన్ 5(జి), రెడ్‌విత్ 6, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.