క్షమాపణకు త్వరపడండి
ఇస్లాం వెలుగు
పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు.
మనిషన్న తర్వాత ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లి పోవడం మానవ సహజం. మానవమాతృలెవరూ దీనికి అతీతులు కాదు. కావాలని కాక, కాకతాళీయంగా జరిగిన చిన్న చిన్న తప్పుల్ని దైవం క్షమిస్తాడు. కానీ తెలిసి, కావాలని మాటిమాటికీ బుద్ధిపూర్వకంగా తప్పులు చే సేవారిని మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి, దానిని సరిదిద్దుకుంటే, మరి కొంతమంది తప్పును అస్సలు అంగీకరించనే అంగీకరించరు.
ఒక తప్పును సమర్థించుకోడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు. ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకువస్తే దాన్ని కప్పిపుచ్చుకోడానికి వితండవాదం చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితిలోనూ తమను తాము సంస్కరించుకోడానికి ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.
ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాపపడినవారే నిజమైన విశ్వాసులు. విశ్వాసుల గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటుంది. ‘వారి వల్ల ఏదైనా నీతిమాలిన పని గానీ, పాపకార్యం గానీ జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్‌ను స్మరించి, క్షమాపణ వేడుకుంటారు. అంతేగానీ తాము చేసినదానిపై వారు మంకుపట్టు పట్టరు.’’ (3-135).
మరొక చోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా సైతాన్ ప్రేరణ వల్ల ఏదైనా దురాలోచన జనిస్తే, వెంటనే వారు అప్రమత్తులై పోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది.’’ (7-201).
‘‘మీరు అల్లాహ్‌ను క్షమాపణ కోరుకుని ఆయన వైపునకు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయామయుడు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలున్నాయి. (11-90). మరొకచోట ఇలా ఉంది. ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి. అమిత దయాళువు. కనుక మీపై (దైవ) శిక్ష వచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని పరిస్థితి రాక ముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి.’’ (39-54).
ఈ పవిత్ర ఖురాన్ వాక్యాల ద్వారా తెలిసేదేమిటంటే, సాధ్యమైనంత మేర ఏ తప్పూ జరక్కుండా ఉండడానికి శక్తి వంచన లేని ప్రయత్నం చేయాలి. ఒక వేళ తెలిసో తెలియకో తప్పు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం చెందే విషయంలో, క్షమాపణ వేడుకునే విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు.
రానున్న క్షణం మనుగడకు హామీ ఇస్తుందో, మృత్యువునే తెస్తుందో తెలియదు. కనుక శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవాన్ని క్షమాపణ వేడుకోవాలి. జరిగిపోయిన తప్పుల పట్ల మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి. ఇకముందు అలాంటి తప్పులు జరగని విధంగా గాఢమైన నిర్ణయం తీసుకుని, దానిపైనే స్థిరంగా ఉండాలి.
భావి జీవితాన్ని సంస్కరించుకుంటూ అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత వరకు సత్కార్యాల్లో లీనమవ్వాలి. దానధర్మాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో దైవక్షమాపణ వేడుకుని, ఆశావహదృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోను, పరలోకంలోనూ దైవ ప్రసన్నతను పొంది, శాశ్వతమైన సుఖాలకు పాత్రులమయ్యే అవకాశం ఉంది.
- మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్