అది 2009 అక్టోబర్.. 10.94 లక్షల క్యూసెక్కుల వరద నీటితో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కరకట్టను తెంచుకుని గ్రామాలపై విరుచుకుపడింది. కోట్లాది రూపాయల పంట, ఆస్తి నష్టం వాటిల్లాయి. కొందరు స్వార్థంతో కృష్ణానది కరకట్టకు మధ్యలో పైపులైన్లు వేయటం వల్లే భారీ నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. భట్టిప్రోలు మండలం ఒలేరు పల్లెపాలెం వద్ద కరకట్ట కోతకు గురవడానికి కారణం ఇదేనని కనుగొన్నారు. భట్టిప్రోలు నుంచి లంకెవానిదిబ్బవరకు సుమారు వంద చోట్ల కరకట్టకు మధ్యలో పైపులైన్లు ఉన్నట్లు తేలింది. మళ్లీ...ఇప్పుడు కృష్ణానదికి పెను ముప్పు పొంచి ఉంది. పైపులైన్లు కాదు ఏకంగా నది ఒడ్డునే గోతులు తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు.
రేపల్లె : కొందరి స్వార్థం అందరికి పెనుముప్పును తెచ్చిపెడుతోంది. నదీపరివాహక ప్రాంతంలో మనుగడను ప్రమాదకరంగా మారుస్తోంది. నదీప్రవాహం, కరకట్టకు మధ్య ఉన్న లంకభూముల్లో భారీ గోతులు తవ్వుతున్నారు. సాగు పేరుతో రక్షణ కవచాలకు విచక్షణ రహితంగా గునపాలు గుచ్చుతున్నారు. కృష్ణా కరకట్టల మధ్య తూములు ఏర్పాటు చేస్తూ కట్టలను బలహీనపరుస్తున్నారు. లంక భూముల్లో భారీ గోతులు తవ్వి యథేచ్ఛగా మట్టిని తరలించేస్తున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే కాస్తంత వరద నీరు వచ్చినా లంక భూములు భారీ కోతకు గురై కరకట్టను తాకేంత ప్రమాదానికి చేరుకుంది.
భారీ గోతులు...
మండలంలోని పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలోని లంక భూముల్లో 12 నుంచి 15 అడుగుల వరకు భారీ గోతులు తవ్వి మట్టిని తరలించారు. నదీ ప్రవాహానికి నాలుగుమీటర్ల దూరంలోనే భారీ గోతులు తవ్వారు. పలుచటి గోడలా మాత్రమే కరకట్ట మిగిలింది. మట్టి తరలించిన భూమిలో కూడా చెరువులు, పంటలు వేసేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు.
సాగుభూమి, చెరువులుగా మార్చిన భూమిలో నుంచి నదీ ప్రవాహానికి నడుమ తూములు కూడా ఏర్పాటు చేశారు. నదీ ప్రవాహం కాస్తంత ఎక్కువైనా పలుచగా మారిన కట్టలు, లంకభూమి కోతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. నిరంతరం నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వారధికి కూడా ముప్పే..
తీరప్రాంత ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన పెనుమూడి-పులిగడ్డ వారధికి సైతం అక్రమార్కుల ఫలితంగా ముప్పు పొంచి ఉంది. కృష్ణానదికి వరదలు వచ్చే సమయంలో లంకభూములు వరద తాకిడికి కోసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వారధి వద్ద కూడా భూమి కోతకు గురై వంతెనకు పెను ముప్పే వాటిల్లేప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తూములతో.. కరకట్టకు తూట్లు
Published Sat, Apr 18 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement