ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే.. | IPO or initial public offering, Meaning and Advantages | Sakshi
Sakshi News home page

ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..

Published Mon, Nov 11 2024 4:20 AM | Last Updated on Mon, Nov 11 2024 8:00 AM

IPO or initial public offering, Meaning and Advantages

కిటుకులు తెలియాలి 

ఒకటికి మించిన దరఖాస్తులు 

ఇందుకు బంధు, మిత్రుల సహకారం అవసరం 

ఎన్‌ఐఐ విభాగంలోనూ పాల్గొనొచ్చు 

వాటాదారుల కోటా  మరొక మార్గం 

ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో).. ఎక్స్‌ లేదా వై లేదా జెడ్‌.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్‌ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. 

ఇది  ఏ స్థాయిలో అంటే బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్‌ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్‌ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్‌ ఉన్న ఐపీవోలో అలాట్‌మెంట్‌ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం.  

ఒకటికి మించిన దరఖాస్తులు 
ఐపీవోలో షేర్ల అలాట్‌మెంట్‌ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్‌. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్‌ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్‌ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. 

దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్‌ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్‌ వేయాలి.

 ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్‌ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీవో ఒక లాట్‌ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్‌ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్‌ వేసినా కానీ, ఒక్కటే లాట్‌ అలాట్‌ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు.  

జాక్‌పాట్‌
డిమాండ్‌ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్‌ (30) ఇటీవలి బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీవోలో జాక్‌పాట్‌ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్‌ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్‌ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్‌ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్‌ఎన్‌ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్‌ రోజున బజాజ్‌ ఫైనాన్స్‌ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు.  

వాటాదారుల కోటా.. 
ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్‌) అప్పటికే స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీవోలో బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్‌ చేశారు. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అన్నది బజాజ్‌ ఫైనాన్స్‌ సబ్సిడరీ. అలాగే, బజాజ్‌ ఫైనాన్స్‌ అన్నది బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్‌ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్‌ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్‌ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్‌ అకౌంట్‌లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.

బిడ్స్‌ ఇలా...
త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్ల కంపెనీ ఏథర్‌ ఎనర్జీ సైతం లిస్టెడ్‌ సంస్థ హీరో మోటోకార్ప్‌ వాటాదారులకు కోటా రిజర్వ్‌ చేసింది. ఏథర్‌ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్‌ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్‌ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్‌ చేయడం గుర్తుండే ఉంటుంది.  

రుణం తీసుకుని మరీ..

వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్‌ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్‌ డీమ్యాట్‌ ఖాతా ద్వారా బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్‌ఎన్‌ఐ విభాగంలో బిడ్‌ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు.  

వాటాదారుల కోటాలో..

ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్‌ మెహ్రా (43) ముందుగానే బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్‌ హోల్డర్స్‌ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్‌ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్‌ అయ్యాయి.  

తిరస్కరణకు దూరంగా..
కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్‌ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్‌ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్‌ ఖాతాలోని పేరు, డీమ్యాట్‌ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% 
మేర సబ్‌్రస్కిప్షన్‌ రావాల్సి 
ఉంటుంది.  

కసరత్తు అవసరం.. 
లిస్టింగ్‌ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్‌ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్‌ లాభం కోసం దరఖాస్తు

చేసుకుంటే.. లిస్టింగ్‌ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్‌ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్‌పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్‌ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్‌ నాటికి మార్కెట్‌ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్‌పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.

ఎస్‌ఎంఈ ఐపీవోలు 
మెయిన్‌బోర్డ్‌ ఐపీవోల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్‌ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్‌ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్‌ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్‌ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్‌ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్‌ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్‌) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్‌ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్‌) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్‌ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్‌ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.

జాగ్రత్త అవసరం..
ఇక ఎస్‌ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్‌ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్‌ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్‌సాల్‌ ఐటీఎస్‌ టెక్నాలజీస్‌ అనే ఎస్‌ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్‌ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్‌ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్‌ఎంఈలకు అయితే బీఎస్‌ఈ లేదా ఎన్‌ఎస్‌ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. 

రుణంతో దరఖాస్తు... 
పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్‌ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్‌ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్‌ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్‌ఎన్‌ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు.

 రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్‌ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్‌ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్‌ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్‌ ఖాతాకు ఎన్‌బీఎఫ్‌సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్‌బీఎఫ్‌సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్‌ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్‌ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్‌ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్‌బీఎఫ్‌సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్‌ వెనక్కి తీసుకోవచ్చు.

నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్‌ఐఐ) 
అధిక నెట్‌వర్త్‌ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్‌ హెచ్‌ఎన్‌ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్‌ హెచ్‌ఎన్‌ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. 

బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్‌స్కిప్షన్‌ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్‌ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్‌ హెచ్‌ఎన్‌ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్‌ హెచ్‌ఎన్‌ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు.   

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement