‘ఉడాన్’’పై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు సూచన
న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‌ను ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు.
పౌర విమానయానంపై గురువారం ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా–పసిఫిక్ మినిస్టీరియల్ సదస్సులో మోదీ మాట్లాడారు. 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తీసుకొచి్చన ‘ఉడాన్’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు మోదీ సూచించారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయతి్నంచాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు.
ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని మోదీ స్పష్టంచేశారు. భారత్‌లో విమానయాన సంస్థల నెట్‌వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్ సెక్టార్‌లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment