Regional Connectivity Scheme
-
ఏటా 40 కోట్ల మంది విమాన ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయాన కనెక్టివిటీ ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా కొనసాగుతుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్మాంగ్ వుల్నామ్ తెలిపారు. సీప్లేన్ల కార్యకలాపాల కోసం తగిన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ‘దేశంలో విమానయాన రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం దేశీయంగా 11 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య రెట్టింపై 22 కోట్లకు చేరుకుంది. 2029 నాటికి దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణం పట్ల ప్రజల్లో ఆకాంక్ష ఉంది’ అని వివరించారు. సేవలు అందించని, లేదా తక్కువ సేవలందించే ఎయిర్‌పోర్టుల నుండి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంతోపాటు విమాన ప్రయాణ వ్యయానిన మరింత తగ్గించడం ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ (ఆర్సీఎస్) పథకం లేదా ఉడాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 1.46 కోట్ల మంది.. హెలికాప్టర్లు, సీప్లేన్ల కార్యకలాపాలను పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వుమ్లున్మాంగ్ వివరించారు. 2016 అక్టోబర్‌లో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ప్రారంభమైంది. దీని కింద 2024 నవంబర్ 30 నాటికి 13 హెలిపోర్ట్‌లు, 2 వాటర్ ఏరోడ్రోమ్లుసహా సేవలు అందించని, తక్కువ సరీ్వస్‌లు ఉన్న 87 విమానాశ్రయాలను కలుపుతూ 613 మార్గాలు అందుబాటులోనికి వచ్చాయి. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఇప్పటివరకు 2.86 లక్షల సర్వీసుల ద్వారా 1.46 కోట్ల మంది దేశీయంగా వివిధ నగరాలకు రాకపోకలు సాగించారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2024 డిసెంబర్లో పార్లమెంటుకు తెలిపింది. -
ప్రపంచ విమానయాన హబ్‌గా భారత్: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‌ను ప్రపంచ విమానయాన హబ్‌గా మార్చడానికి చర్యలు చేపట్టామని వివరించారు. ప్రాంతీయ అనుసంధాన పథకంతో విమాన ప్రయాణం ప్రజలందరికీ అందుబాటులోకి వస్తోందని అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి సైతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వెల్లడించారు. పౌర విమానయానంపై గురువారం ఢిల్లీలో జరిగిన రెండో ఆసియా–పసిఫిక్ మినిస్టీరియల్ సదస్సులో మోదీ మాట్లాడారు. 29 దేశాల నంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తీసుకొచి్చన ‘ఉడాన్’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని విదేశీ ప్రతినిధులకు మోదీ సూచించారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగంలో నూతన అవకాశాలు సృష్టించేందుకు ప్రయతి్నంచాలని కోరారు. దాంతో ఆయా దేశాల్లో ఆర్థిక వృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, శాంతి, సౌభాగ్యానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉద్ఘాటించారు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను వైమానిక రంగంతో అనుసంధానిస్తే వివిధ దేశాలకు, ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతుండడం, వారు సృష్టిస్తున్న డిమాండ్ విమానయాన రంగానికి చోదకశక్తిగా మారుతున్నాయని మోదీ స్పష్టంచేశారు. భారత్‌లో విమానయాన సంస్థల నెట్వర్క్, సేవలు నానాటికీ విస్తరిస్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. ఏవియేషన్ సెక్టార్లో ‘మహిళల సారథ్యంలో ప్రగతి’కి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌లోని మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 5 శాతమేనని పేర్కొన్నారు. -
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సపోర్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో పౌర విమానాశ్రయంగా రూపొందనున్న వరంగల్ విమానాశ్రయాన్ని రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్సీఎస్)లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి డొమెస్టిక్ (దేశీయ విమానాలు నడిచే విమానాశ్రయం) విమానాశ్రయంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో.. విమానాశ్రయం సిద్ధమయ్యాక ఆర్థిక అడ్డంకులను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దీన్ని ‘ఉడాన్’పథకంలో అంతర్భాగంగా ఉన్న రీజినల్ కనెక్టివిటీ పథకంలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది. ఈ పథకంలో చేర్చే విమానాశ్రయాలకు మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుంది. ఈమేరకు ఈ స్కీంలో వరంగల్ విమానాశ్రయాన్ని చేర్చాలంటూ తాజాగా పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రతిపాదన తర్వాత ఇప్పుడు మరో లేఖ కూడా రాసింది. ఏర్పాట్లు ఎందుకంటే.. ప్రస్తుత అవసరాల ఆధారంగా ఏర్పాటవుతున్న చాలా విమానాశ్రయాలు, ఆ తర్వాత రకరకాల కారణాలతో కునారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగా ఉండటంతో విమానయాన సంస్థ (ఆపరేటర్లు)లు ఆసక్తి కోల్పోతున్నాయి. వెంటనే సర్వీసులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫలితంగా విమానాశ్రయాలనే మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక సమీపంలోనే మరో విమానాశ్రయం ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీంతో వరంగల్ విమానాశ్రయానికి డిమాండ్ ఎక్కువగా ఉండదన్న అభిప్రాయం గతంలో వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంతకాలం జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల, భారీ టెక్స్టైల్ పార్కు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ పార్కు, ఇతర సంస్థల రాకతో వరంగల్ పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ముందుకొచ్చి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అడిగిన మేరకు భూమిని సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైంది. భూమి బదలాయింపు జరిగిన ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూరులోని పాత ఎయిర్ స్ట్రిప్ అదీనంలో 750 ఎకరాల భూమి పోను, అదనంగా కావలసిన 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన కావడం తెలిసిందే. గత నెలాఖరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానించగా, ఇప్పుడు సంబంధిత అధికారులు భూసేకరణ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వరంగల్ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఆయా సంస్థల ఆసక్తి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశీయంగా విమానాలు నడుపుతున్న సంస్థలన్నీ ముందుకొస్తే దీనికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వాటిల్లో ఆ ఆసక్తి రావాలంటే ప్రభుత్వాల నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫండింగ్‌కు వీలు కల్పిస్తూ ఉడాన్ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీంను ప్రారంభించడం తెలిసిందే. ప్రయాణికులు విమానాలు ఎక్కే విషయంలో.. ఆశించిన డిమాండ్– ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ఆపరేటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆశించిన డిమాండ్ కనక లేకుంటే.. ఎంత నష్టం జరుగుతుందో లెక్కలేస్తారు. దాన్ని నష్టంగా భావిస్తారు. డిమాండ్ అంచనా– వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేదే వయబిలిటీ గ్యాప్‌ఫండ్. దాన్ని ఆపరేటర్లకు అందిస్తే వారు నష్టాలతో సంబంధం లేకుండా విమానాలను కొనసాగిస్తారు. ఎవరెంత భరిస్తారు.. రీజినల్ కనెక్టివిటీ స్కీంలో భాగంగా అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కేంద్రప్రభుత్వం 80 శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీన్ని ఆపరేషన్ మొదలైన మూడేళ్లపాటు కొనసాగిస్తారు. దీనికిందకు వరంగల్ విమానాశ్రయాన్ని తీసుకురావాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. త్వరలో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 విమానాశ్రయాలకు ఈ నిధి సమకూరుతున్నట్టు సమాచారం. -
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్‌లో ప్రయాణించారు. -
విమాన టికెట్ ధరలు పెరుగుతాయ్!
• ఒక్కొక్క ఫ్లైట్‌కి రూ.8,500 వరకు సుంకం విధింపు • డిసెంబర్ 1 నుంచి అమల్లోకి • రీజినల్ కనెక్టివిటీ స్కీమ్‌కు నిధుల సమీకరణే లక్ష్యం న్యూఢిల్లీ: విమానయానం మళ్లీ భారం కానుంది. టికెట్ ధరలు పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఉడాన్) నిధుల కోసం ప్రధాన మార్గాల్లో నడిచే విమానాలపై రూ.8,500 వరకు సుంకం విధించనుంది. ఇది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. సుంకం విధింపు మొత్తం ఒక విమానానికి సంబంధించి ఉంటుంది కాబట్టి విమానంలోని సీట్ల సంఖ్యపై ఆధారపడి ప్రతి టికెట్ ధర కొంతమేర పెరుగుతుంది. విమానం ప్రయాణించే దూరాన్ని బట్టి సుంకం ఒక్కొక్క ఫ్లైట్‌కి రూ.8,500 వరకు ఉంటుందని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే తెలిపారు. విమానంపై సుంకం.. 1,000 కిలోమీటర్ల దూరానికి రూ.7,500గా, 1,000-1,500 కిలోమీటర్ల దూరానికి రూ.8,000గా, 1,500 కిలోమీటర్ల దూరానికి రూ.8,500గా ఉంటుందని వివరించారు. ప్రధాన మార్గాల్లో నడిచే దేశీ విమానాలపై మాత్రమే ఈ సుంకం విధింపు ఉంటుందని, ప్రాంతీయ విమానాలను దీని నుంచి మినహారుుంచామని పేర్కొన్నారు. ‘సుంకం విధింపుతో రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌కి రూ.400 కోట్లు జమవుతాయని అంచనా వేస్తున్నాం. ఇక మరో 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తారుు. అంటే ఫండ్‌కి మొత్తంగా ఏడాదికి రూ.500 కోట్లు రావొచ్చు’ అని వివరించారు. కాగా సామాన్యుడికి విమనయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీజినల్ కనెక్టివిటీ స్కీమ్‌ను ఆవిష్కరించింది. దీనికి నిధుల కోసం రీజినల్ కనెక్టివిటీ ఫండ్‌ని ఏర్పాటు చేస్తోంది. ఈ స్కీమ్ కింద ప్రయాణికులు గంట విమాన ప్రయాణానికి రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది.