సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో పౌర విమానాశ్రయంగా రూపొందనున్న వరంగల్ విమానాశ్రయాన్ని రీజినల్ కనెక్టివిటీ స్కీం (ఆర్‌సీఎస్)లో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి డొమెస్టిక్ (దేశీయ విమానాలు నడిచే విమానాశ్రయం) విమానాశ్రయంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఈ నేపథ్యంలో.. విమానాశ్రయం సిద్ధమయ్యాక ఆర్థిక అడ్డంకులను అధిగమించేందుకు ముందస్తు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇందుకోసం దీన్ని ‘ఉడాన్’పథకంలో అంతర్భాగంగా ఉన్న రీజినల్ కనెక్టివిటీ పథకంలోకి తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా పౌర విమానయాన శాఖకు ప్రతిపాదించింది.
ఈ పథకంలో చేర్చే విమానాశ్రయాలకు మూడేళ్లపాటు కేంద్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుంది. ఈమేరకు ఈ స్కీంలో వరంగల్ విమానాశ్రయాన్ని చేర్చాలంటూ తాజాగా పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదించింది. ప్రతిపాదన తర్వాత ఇప్పుడు మరో లేఖ కూడా రాసింది.
ఏర్పాట్లు ఎందుకంటే..
ప్రస్తుత అవసరాల ఆధారంగా ఏర్పాటవుతున్న చాలా విమానాశ్రయాలు, ఆ తర్వాత రకరకాల కారణాలతో కునారిల్లుతున్నాయి. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగా ఉండటంతో విమానయాన సంస్థ (ఆపరేటర్లు)లు ఆసక్తి కోల్పోతున్నాయి. వెంటనే సర్వీసులను ఉపసంహరించుకుంటున్నాయి. ఫలితంగా విమానాశ్రయాలనే మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక సమీపంలోనే మరో విమానాశ్రయం ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది.
ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. దీంతో వరంగల్ విమానాశ్రయానికి డిమాండ్ ఎక్కువగా ఉండదన్న అభిప్రాయం గతంలో వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఇంతకాలం జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల, భారీ టెక్స్‌టైల్ పార్కు, వేగంగా విస్తరిస్తున్న ఐటీ పార్కు, ఇతర సంస్థల రాకతో వరంగల్ పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ముందుకొచ్చి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అడిగిన మేరకు భూమిని సేకరించి ఇచ్చేందుకు సిద్ధమైంది. భూమి బదలాయింపు జరిగిన ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఇటీవలే వరంగల్ మామూనూరులోని పాత ఎయిర్ స్ట్రిప్ అదీనంలో 750 ఎకరాల భూమి పోను, అదనంగా కావలసిన 253 ఎకరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన కావడం తెలిసిందే.
గత నెలాఖరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు తీర్మానించగా, ఇప్పుడు సంబంధిత అధికారులు భూసేకరణ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వరంగల్ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు ఆయా సంస్థల ఆసక్తి ఏంటనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దేశీయంగా విమానాలు నడుపుతున్న సంస్థలన్నీ ముందుకొస్తే దీనికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వాటిల్లో ఆ ఆసక్తి రావాలంటే ప్రభుత్వాల నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫండింగ్‌కు వీలు కల్పిస్తూ ఉడాన్ పథకంలో భాగంగా కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీంను ప్రారంభించడం తెలిసిందే.
ప్రయాణికులు విమానాలు ఎక్కే విషయంలో.. ఆశించిన డిమాండ్– ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను ఆపరేటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఆశించిన డిమాండ్ కనక లేకుంటే.. ఎంత నష్టం జరుగుతుందో లెక్కలేస్తారు. దాన్ని నష్టంగా భావిస్తారు. డిమాండ్ అంచనా– వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేదే వయబిలిటీ గ్యాప్‌ఫండ్. దాన్ని ఆపరేటర్లకు అందిస్తే వారు నష్టాలతో సంబంధం లేకుండా విమానాలను కొనసాగిస్తారు.
ఎవరెంత భరిస్తారు..
రీజినల్ కనెక్టివిటీ స్కీంలో భాగంగా అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను కేంద్రప్రభుత్వం 80 శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరించాల్సి ఉంటుంది. దీన్ని ఆపరేషన్ మొదలైన మూడేళ్లపాటు కొనసాగిస్తారు.
దీనికిందకు వరంగల్ విమానాశ్రయాన్ని తీసుకురావాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. త్వరలో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72 విమానాశ్రయాలకు ఈ నిధి సమకూరుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment