సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్ స్ట్రిప్ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించినా, పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది.
ఈ కారణంగానే వీటి ఏర్పాటు సందిగ్ధంలో పడింది.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చి దశలవారీగా ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. తొలుత వరంగల్‌లో విమానాశ్రయాన్ని సిద్ధం చేసే కసరత్తులో భాగంగా, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కోరిన మేరకు భూమిని సేకరించి అప్పగించనుంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సమావేశ ఎజెండాలో కూడా దీనిని చేర్చారు.
250 ఎకరాల భూసేకరణ
మామునూరులో నిజాంకాలంలో నిర్మించిన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఇది వాడుకలో లేదు. అక్కడ చిన్నòÙడ్డు తప్ప ఎలాంటి భవనం లేదు. ఒక పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే ఉంది. గోతులు పడి అది కూడా వినియోగించడానికి వీలు లేదు. ప్రస్తుతం ఆ ఎయిర్‌స్ట్రిప్‌కు సంబంధించిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అ«దీనంలో ఉంది.
అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అంతమేర భూసేకరణ జరగాల్సి ఉంది. సమీపంలోనే పశసంవర్థక శాఖ కు చెందిన స్థలం అందుబాటులో ఉంది. కొంత సమీప గ్రామం నుంచి సేకరించాల్సి ఉంది. గ్రామస్తులకు ఎయిర్‌పోర్టుకు మరోవైపు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చే పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్‌కు ఈమేర కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
ఏడాదిన్నరలో సిద్ధం చేసేలా..
వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని రూ.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేస్తారు. రన్‌వే విస్తరణ, టెర్మి నల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్విసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది.
ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తు తం దేశీయ విమానాశ్రయం (డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు)గానే ఏర్పాటు చేయనున్నారు. 500 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది రూపొందనుంది. భవిష్యత్ అవసరాల ఆధారంగా విస్తరిస్తారు.
దశలవారీగా ఇతర చోట్ల కూడా..
వరంగల్ మామునూరుతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. వీటిని దశలవారీగా చేపట్టాలని ఇప్పుడు నిర్ణయించారు.
హైదరాబాద్ తర్వాత అంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం వరంగల్ కావటం, అక్కడ టెక్స్‌టైల్‌పార్కు, ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో అక్కడ తొలుత విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment