న్యూఢిల్లీ: ఆసియా తయారీ సరఫరా వ్యవస్థలో వైవిధ్యానికి దారితీస్తున్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల నుంచి భారత్ ప్రయోజనం పొందుతుందని ది ఎకనామిస్ట్ గ్రూప్ అంచనా వేసింది. భారత్ బలమైన వృద్ధి మార్గంలో ప్రయాణిస్తోందని ద ఎకనామిస్ట్ గ్రూప్ ఇండియా హెడ్ ఉపాసనా దత్ పేర్కొన్నారు. విధానపరమైన సంస్కరణలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభంగా మారుతోందన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ బలమైన పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.
జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన భారత్, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తెలిసిందే. పీఎల్‌ఐ సహా పలు పథకాల ద్వారా దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఎకనామిస్ట్ గ్రూపు ప్రస్తావించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణ, భవిష్యత్ ఇంధన వనరులపై అంతర్జాతీయ పెట్టుబడులు, పర్యావరణ అనుకూల విధానాలు ఇవన్నీ భారత్ వంటి దేశాలకు అవకాశాలను తీసుకొస్తాయని ఉపాసనా దత్ అభిప్రాయపడ్డారు.
తయారీలో స్థానం బలోపేతం
‘‘భౌగోళిక రాజకీయ రిస్క్‌ల నేపథ్యంలో కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలపై పునరాలోచన చేస్తున్నాయి. చైనా మార్కెట్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకునే దిశగా అవి తీసుకునే నిర్ణయాలతో ఇతర మార్కెట్ల వాటా పెరగనుంది. చైనాకు భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్ అవుతుంది’’అని ఉపాసనా దత్ పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు, పన్నులు, వాణిజ్య నియంత్రణల పరంగా భారత్‌లో ఎంతో పురోగతి కనిపిస్తోందంటూ.. దేశంలో తయారీ పరంగా ఉన్న రిస్క్‌లను ఇది తగిస్తుందని చెప్పారు. అయితే అదే సమయంలో వర్ధమాన, ముఖ్యంగా దక్షిణాసియా మార్కెట్ల నుంచి ఎదురయ్యే బలమైన పోటీ కారణంగా.. తయారీలో బలమైన శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను కొంత ఆలస్యం చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment