ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది.
చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం.
ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది.
వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే!
ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది.
అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం.
Comments
Please login to add a commentAdd a comment