సద్విమర్శను స్వీకరిస్తేనే స్వర్గానికి సోపానం
తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుంకటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు. రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు.
మనిషి ఎంత బలవంతుడో, అంత బలహీనుడు కూడా! అతని ద్వారా ఏదో ఒక తప్పు జరిగిపోతూనే ఉంటుంది. పొరపాటునో, గ్రహపాటునో ఏదో ఒక తప్పిదం దొర్లిపోవడం మానవ సహజం. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. అయితే, కావాలని కాకుండా కాకతాళీయంగా జరిగే చిన్న చిన్న తప్పుల్ని అల్లాహ్ క్షమిస్తాడు. కాని తెలిసీ, కావాలని బుద్ధిపూర్వకంగా మాటిమాటికీ చేసే పాపాలను మాత్రం క్షమించడు. కొంతమంది తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి, దాన్ని సరిదిద్దుకుంటే, మరికొంతమంది తప్పును అసలే అంగీకరించరు. ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తారు.
ఎవరైనా తప్పును తమ దృష్టికి తీసుకు వస్తే దాన్ని కప్పి పుచ్చుకోవడానికి వితండవాదం చేస్తారు తప్ప, తమ తప్పును సంస్కరించుకోవడానికి సుతరామూ ప్రయత్నించరు. కొద్దిమంది మాత్రమే విమర్శను స్వీకరించి సరిదిద్దుకుంటారు. సద్విమర్శను స్వీకరించడం వల్ల తప్పును తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా మళ్లీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకునే వీలు కలుగుతుంది. ఈ విధంగా తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాప పడేవారు నిజమైన విశ్వాసులు. ఇలాంటి వారిని గురించి పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది...
వారివల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, పాపకార్యంగాని, జరిగిపోతే, వెంటనే వారు అల్లాహ్‌ను స్మరించి క్షమాపణ వేడుకుంటారు. అంతేగాని తాము చేసిన దానిపై వారు మంకుపట్టు పట్టరు. (3-135). పవిత్ర ఖురాన్‌లో మరోచోట ఇలా ఉంది. ‘‘దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా షైతాన్ ప్రేరణ వల్ల దురాలోచన జనిస్తే వెంటనే వారు అప్రమత్తులైపోతారు. ఆ తరువాత అనుసరించాల్సిన విధానం ఏమిటో వారికి స్పష్టంగా తెలిసిపోతుంది (7-201).
‘‘మీరు దైవాన్ని క్షమాపణ కోరుకుని ఆయన వైపు మరలండి. నిస్సందేహంగా మీ ప్రభువు అమిత దయాళువు. ఆయనకు తన దాసుల పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి’’ (11-90)మరొకచోట ఇలా ఉంది: ‘‘ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! దైవకారుణ్యం పట్ల నిరాశ చెందకండి. దైవం తప్పకుండా మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దదాళువు. కనుక మీపై దైవశిక్షవచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని స్థితి రాకుముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి. ఆయనకు పూర్తిగా విధేయులైపొండి (39-54).జ
పవిత్ర ఖురాన్‌లోని ఈ దివ్య వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమంటే, సాధ్యమైనంత వరకూ ఏ చిన్న తప్పూ జరగకుండా ఉండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలిసో, తెలియకో యాదృచ్ఛికంగా ఏదైనా పొరపాటు దొర్లిపోతే వెంటనే సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపం, క్షమాపణ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఆచరణకు అవకాశాలు ఎప్పుడు మూసుకుపోతాయో ఎవరికీ తెలియదు.
రానున్న క్షణం మనుగడకు హామీనిస్తుందో, మృత్యువునే వెంట తెస్తుందో మనకు తెలియదు. అందుకని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా, శ్వాస ఉండగానే ఆశతో సాగిలపడి దైవకారుణ్యాన్ని అన్వేషించాలి. జరిగిన తప్పుల పట్ల మనస్పూర్తిగా పశ్చాత్తాప పడాలి. సిగ్గుపడాలి.
ఇకముందు అలాంటివి జరగని విధంగా దృఢనిర్ణయం తీసుకుని, దానిపై స్థిరంగా ఉండాలి. భావిజీవితాన్ని సంస్కరించుకుంటూ, అడుగడుగునా సింహావలోకనం చేసుకుంటూ, సాధ్యమైనంత మేర సత్కార్యాల్లో లీనమవ్వాలి. దైవకారుణ్యంపట్ల సదా ఆశ కలిగి ఉండాలి. ఈవిధంగా మనసా, వాచా, కర్మణా, ఆశావహ దృక్పథంతో, ధర్మబద్ధమైన జీవితం గడిపితే ఇహలోకంలోనూ, పరలోకంలోనూ దైవప్రసన్నత పొంది, శాశ్వత అమర సుఖాలకు పాత్రులు కావచ్చు.
- యండీ ఉస్మాన్ ఖాన్