సివిల్ ఇంజినీర్లకు ఎన్నో అవకాశాలు
- సీఆర్‌డీఏ ఇంజనీర్ హెచ్‌ఎం రెడ్డి
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సివిల్ ఇంజనీర్ల పాత్ర కీలకం కానుందని సీఆర్‌డీఏ ఇంజనీర్ హెచ్‌ఎం రెడ్డి అన్నారు.
ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా రాజధాని నిర్మాణం జరగాలంటే అందులో సివిల్ ఇంజనీర్ల కృషి, వినూత్న ఆలోచనలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఎటువంటి నిర్మాణంలోనైనా నాణ్యత చాలా ప్రధానమని ఆయన విశ్లేషించారు.
తాత్కాలిక సచివాలయం, ఇతర భవనాల గురించి ఆయన విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, స్మార్ట్ నగరాల వంటి ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాయని, దీని వల్ల సివిల్ ఇంజనీర్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.