civil engineers
-
సివిల్ ఇంజనీర్లకు డిమాండు తక్కువే
దేశంలో సివిల్ ఇంజనీర్ కోర్సుకు అనుకున్నంతగా డిమాండు లేదని ప్రాంగణ నియామకాల తీరు వెల్లడిస్తోంది.2012–13 నుంచి2015–16 మధ్య కాలంలో సివిల్ ఇంజనీరింగ్ పాసయిన వారిలో కేవలం 38 శాతం మందికే ఉద్యోగాలు లభించాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)గణాంకాలను బట్టి తెలుస్తోంది.దేశంలో నిర్మాణ రంగం శరవేగంతో పురోగమిస్తున్న ఈ తరుణంలో ఆ రంగానికి కీలకమైన సివిల్ ఇంజనీర్లకు డిమాండు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏఐసీటీఈ ఆమోదించిన ఆరు ఇంజనీరింగ్ కోర్సుల్లో మూడు కోర్సులకు –కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్–మాత్రమే డిమాండు ఉంది. ఆ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు 50 శాతానికి మించి ఉన్నాయి.అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్‌తో పోలిస్తే కెమికల్ ఇంజనీరింగ్‌వంటి కోర్సుల్లో చేరే వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఏఐసీటీఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2012–13 సంవత్సరంలో సివిల్ ఇంజనీరింగ్‌లో 11.98 లక్షల మంది చేరగా, వారిలో 4.64 లక్షల మంది(39శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1.74 లక్షల మంది(38శాతం)కే ఉద్యోగాలు లభించాయి. కెమికల్ ఇంజనీరింగ్‌లో 86 వేల మంది చేరితే,45 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో25వేల మందికి(55%) ఉద్యోగాలు వచ్చాయి. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 20 లక్షల మందికిపైగా చేరారు. వీరిలో 9.40 లక్షల మంది పాసయ్యారు.4.74 లక్షల(50శాతం) మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం మీద కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలోనే 50శాతానికిపైగా ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ సీట్లు తామరతంపరగా పెరిగిపోవడంతో కోర్సు పూర్తి చేసి బయటకొస్తున్న వారి సంఖ్య కూడ పెరుగుతోందని, అయితే, వారిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడటంతో ఉద్యోగాలు లభించడం లేదని నిపుణులు చెబుతున్నారు. -
మెకానికల్ ఇంజినీర్లు పనికిరారు : సీఎం
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్‌కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. -
సివిల్ ఇంజినీర్లకు ఎన్నో అవకాశాలు
- సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయని, ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా సివిల్ ఇంజనీర్ల పాత్ర కీలకం కానుందని సీఆర్డీఏ ఇంజనీర్ హెచ్ఎం రెడ్డి అన్నారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం కేఎల్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా రాజధాని నిర్మాణం జరగాలంటే అందులో సివిల్ ఇంజనీర్ల కృషి, వినూత్న ఆలోచనలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని అన్నారు. నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే ఎటువంటి నిర్మాణంలోనైనా నాణ్యత చాలా ప్రధానమని ఆయన విశ్లేషించారు. తాత్కాలిక సచివాలయం, ఇతర భవనాల గురించి ఆయన విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, స్మార్ట్ నగరాల వంటి ఎన్నో ప్రాజెక్టులు చేపడుతున్నాయని, దీని వల్ల సివిల్ ఇంజనీర్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకం
ఘట్కేసర్, న్యూస్‌లైన్ : దేశ అభివృద్ధికి ప్రధానమైన నిర్మాణాల పూర్తిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర కీలకమని ఎల్ అండ్ టీ జియో స్ట్రక్చర్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కన్నప్పన్ పేర్కొన్నారు. మండల పరిధి అంకుశాపూర్‌లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ‘రీసెంట్ అప్లికేషన్స్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్’ అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో శనివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సివిల్ ఇంజినీర్లు అందిపుచ్చుకోవాలని, సమాజానికి ఉపయోగపడేలా పదికాలాల పాటు మన్నేలా నిర్మాణాలు ఉండేలా శ్రద్ధ చూపాలని సూచించారు. తక్కువ ఖర్చుతో నాణ్యత గల కట్టడాల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. సివిల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఇటీవలి కాలంలో యువతులు ఎక్కువగా చేరుతుండటం శుభ పరిణామమని అన్నారు. సివిల్ ఇంజినీర్లకు అపార అవకాశాలు ఉన్నాయనీ, తమ ఎల్అండ్టీ సంస్థలోనే ప్రతి ఏడాది వెయ్యిమంది వరకు నియామకం అవుతున్నారని తెలిపారు. సదస్సులో యూఎస్ఏలోని సౌత్ డకోటా టిక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణన్, ఏసీఈ కళాశాల మాజీ డెరైక్టర్ పరమేశ్వరన్, ఆస్ట్రేలియాలోని కూర్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.వి.రంగన్, ఏసీఈ కళాశాల చైర్మన్ వి.ఎం.రావు, కార్యదర్శి వై.వి.గోపాలకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ బి.ఎల్.రాజు, సదస్సు సమన్వయకర్తలు జగన్నాథరావు, సీఎస్వీఎస్ కుమార్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.