బిప్లబ్ కుమార్ దేబ్
అగర్తలా : మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్.. తరుచూ అలాంటి కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ వివాదాలకు దూరంగా ఉండాలని ఆదేశించినా.. బిప్లబ్ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా సివిల్ సర్వీసెస్ పై కామెంట్లు చేసి విమర్శలపాలయ్యారు. సివిల్, మెకానికల్ ఇంజినీర్లను పొల్చుతూ బిప్లబ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. శుక్రవారం అగర్తలాలో జరిగిన సివిల్ సర్వీస్ డేలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్‌కు సివిల్ ఇంజనీర్లు మాత్రమే సరిపోతారని, మెకానికల్ ఇంజినీర్లు అందుకు పనికిరారని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాలుపంచుకునే అనుభవం కలిగిన సివిల్ ఇంజినీర్లు అయితేనే సమాజాన్ని చక్కగా నిర్మించగలరని తెలిపారు. ఒకప్పుడు హ్యూమానిటీస్ చదివిన వారు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారని.. కాలం మారుతున్నందున ప్రస్తుతం డాక్టర్లు కూడా సివిల్స్ ఉద్యోగాల్లో అద్భుతంగా రాణించగలరని పేర్కొన్నారు. రోగాన్ని నయం చేసే తెలివితేటలు కలిగిన వారు సమాజంలోని సమస్యలను అలాగే పరిష్కరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బిప్లబ్ ఇలాంటి వ్యాఖ్యల చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు రెండు రోజుల ముందే నటి డయానా హెడెన్ కు మిస్ వరల్డ్ కిరీటం ఎలా ఇచ్చారంటూ కామెంట్ చేసిన బిప్లబ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన బిప్లబ్ స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment