
ట్రంప్ యంత్రాంగం ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది.
యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.
ఖాళీకి పావుగంట
ఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment