దుమ్ముగూడెం కాంట్రాక్టులన్నీ రద్దు
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోని 10 ప్యాకేజీలలో పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు టెర్మినేట్ ఉత్తర్వులు పంపింది.
తద్వారా ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థలతో నలుగుతున్న వివాదానికి రాష్ట్ర నీటిపారుదలశాఖ స్వస్తి పలికింది. అయితే కాంట్రాక్టు సంస్థలకు పంపిన ఉత్తర్వుల్లో ‘ప్రాజెక్టును ఇకపై చేపట్టరాదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మీరు ఊహించుకుంటున్నారు. మీ ఊహలకు ఎలాంటి అర్థం లేదు’ అని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.