
అరుదైన వీడియో పోస్ట్ చేసిన జుకర్‌బర్గ్
న్యూయార్క్: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అరుదైన వీడియోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడా వీడియో విపరీతంగా దూసుకుపోతోంది. ఆ వీడియో ఏమిటంటే ఆయన హార్వార్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న సందర్భంలోనిది.. మరో ఐదు రోజుల్లో ఆయన హార్వార్డ్‌లో ప్రసంగించి డిగ్రీని అందుకోనున్న నేపథ్యంలో ఆ వీడియో అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. అందులో ఏముందంటే..
హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరీక్ష రాసి దరఖాస్తు చేసుకున్న జుకర్.. తనకు సీటు వచ్చిందో లేదో అని ఉత్కంఠగా తన ఇంట్లోని కంప్యూటర్ ముందు కూర్చుని సెర్చింగ్ చేస్తుంటాడు. ఆ సమయంలో తన తండ్రి వీడియో తీస్తుండగా కాస్తంతా కంగారుతో కంప్యూటర్లో తన రిజల్ట్ వెతికిన జుకర్ సీటు పొందడాన్ని చూసి యాహూ.. తాను సాదించానంటూ ఉక్కిరిబిక్కరి అవుతుంటాడు. ‘నేను హార్వార్డ్‌కు ఎంపికయినప్పుడు మానాన్న తీసింది ఈ వీడియో. వచ్చే వారం నేను నా డిగ్రీ తీసుకునేందుకు అదే వర్సిటీకి వెళుతున్నాను’ అని రాస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 2006లో హార్వార్డ్ విద్యార్థి అయిన జూకర్ మధ్యలోనే చదువు మానేసి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా మారి ప్రపంచమొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.